చిన్ననీటి వనరులపై చిన్నచూపు !

ABN , First Publish Date - 2021-10-20T04:53:43+05:30 IST

ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులుగాని,

చిన్ననీటి వనరులపై చిన్నచూపు !
పోచారంలో ఆక్రమణకు గురైన వరద కాలువ

  • వరద కాలువలను కబ్జా చేస్తున్న రియల్టర్లు
  • చెక్‌డ్యాంల మరమ్మతులకు నిధులు కరువు
  • ఉదాసీనంగా అధికార యంత్రాంగం 


ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులుగాని, కాలువలుగాని లేకపోవడంతో చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటలు, బోరు బావులపైనే ఎక్కువ శాతం వ్యవసాయరంగం ఆధారపడుతుంది. అలాంటిది చిన్ననీటి వనరులపై కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణచేసి నీటి వనరులను పరిరక్షించాల్సి ఉన్నా కాలయాపన చేయడంతో మరిన్ని అక్రమాలకు తావిచ్చినట్లవుతోంది. హైదరాబాద్‌ మహానగరానికి దగ్గరలో ఇబ్రహీంపట్నంలో భూముల ధరలు ఎకరా కోట్ల రూపాయలు పలుకుతుంది. దీంతో అక్రమార్కులు చిన్నచోటు కనిపించినా పాగా వేస్తున్నారు. ఆఖరికి సాగునీటి కాలువలను, చెరువులను కూడా వదలడం లేదు. కబ్జాచేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 

ఇబ్రహీంపట్నం చెరువుకు నీరొచ్చే ప్రధాన కాలువయైున పెద్ద కాలువపై పోచారం వద్ద వాగుపై అడ్డంగా చెక్‌డ్యాం(కింది కత్వ)ను నిర్మించారు. ఈ కత్వ నుంచి పోచారం రెవెన్యూలో రెండు కిలోమీటర్ల మేర నిర్మించిన రాతికట్టడం (కాలువ) ఊరి ముందు రంగసముద్రం వరకు ఉంది. గతంలో వరదలు వచ్చినప్పుడు ఈ కాలువ పారి 102 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. అలాంటిది ఈ కాలువను రియల్టర్లు ధ్వంసం చేసి ఓ వెంచర్‌ను వేశారు. అయినా అధికార యంత్రాంగంగాని గ్రామ పంచాయతీగాని పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేగాక ఈ వెంచర్‌లో ప్రభుత్వ భూమి కొంత ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


ఫిరంగి నాలానూ వదలడం లేదు

ఇబ్రహీంపట్నం చెరువుకు నీరొచ్చే ప్రధాన కాలువలో ఫిరంగి నాలా ఒకటి. దీనిని రాచకాలువ అనికూడా పిలుస్తారు. షాబాద్‌ మండలం చందనెల్లి నుంచి మొదలయ్యే ఈ కాలువ సరూర్‌నగర్‌ మండలం మీదుగా 87కిలోమీటర్ల పొడవునా పారి ఇబ్రహీంపట్నం చెరువుకు చేరుతుంది. అలాంటి ఈ కాలువ అక్కడక్కడ కబ్జాలకు గురై వరద నీరు రావడం కష్టమైపోయింది. ఈ కాలువపైనే సరూర్‌నగర్‌ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. రానురాను ఈ కాలువ కుచించుకుపోతోంది. పది మీటర్ల వెడల్పుతో ఉన్న కాలువకు ఇరువైపులా 9 మీటర్ల మేర బఫర్‌ జోన్‌ ఉంది. బఫర్‌ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు, కట్టడాలు చేయడానికి వీలులేదు. అలాంటిది కొంగరకలాన్‌, ఎంపీ పటేల్‌గూడ, మంగల్‌పల్లి పరిధిలో బఫర్‌జోన్‌లో అక్కడక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.


ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు

ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నం చెరువులో భాగమైన చిన్నచెరువు ఎఫ్‌టీఎల్‌లో అకమ్ర నిర్మాణాలు వెలుస్తు న్నాయి. గతంలో ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్పట్లో భూపరిరక్షణ డిప్యూటీ కలెక్టర్‌ విచారణచేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఈమధ్య కాలంలో మరిన్ని నిర్మాణాలు వెలిశాయి.  


తట్టిఖానా వద్ద వృథాగా పోతున్న వరద నీరు

ఇబ్రహీంపట్నం సమీపంలో తట్టిఖానా చెక్‌డ్యాంకు ప్రమాదం పొంచి ఉంది. గతేడాది వర్షాకాలంలో భారీగా వచ్చిన వరదలకు చెక్‌ డ్యాంకు ఓ వైపున కట్టకు కయ్యలు (కొట్టుకుపోవడం) కొట్టింది. దీంతో నీరంతా వృథాగా పోయి చెక్‌డ్యాం ఖాళీ అయింది. నీటిపారుదల శాఖ అధికారులు ఫ్లడ్‌ వాల్‌ నిర్మాణంకోసం రూ.34 లక్షలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా నేటికీ నిధులు మంజూరు కాకపోవడంతో ఇది అలాగే ఉండిపోయింది. కొండల మధ్యన ఉన్న ఈ చెక్‌ డ్యాంలో ఒకటిన్నర కిలోమీటర్‌ పొడవునా నీరు నిలిచి భూగర్భ జలమట్టం పెరిగి చుట్టుపక్కల బోర్లు, బావుల కింద సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. కాగా వరద నీరు ఉధృతంగా వస్తే చెక్‌డ్యాం కట్ట కొట్టుకుపోవడం ఖాయంగా ఉంది.


ఫ్లడ్‌ వాల్‌ నిర్మాణంకోసం ప్రతిపాదలు పంపాం

తట్టిఖానా చెక్‌డ్యాం ఫ్లడ్‌ వాల్‌ నిర్మాణం కోసం రూ.34 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చెక్‌ డ్యాంకు ఓ వైపున కట్ట కొట్టుకుపోవడంతో ఇసుక బస్తాలువేసి తాత్కాలిక మర మ్మతులు చేశాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతాం. పోచారం రెవెన్యూలో కాలువ ధ్వంసంపై అధికారులకు లెటర్‌ రాశాం. జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసి చర్యలు చేపడుతాం. 

- ఆర్‌.పరమేశ్వర్‌, నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ, ఇబ్రహీంపట్నం


కాలువాల కబ్జాలపై ప్రభుత్వం స్పందించాలి

చెరువులు, వరద కాలువలు పూర్వీకులు మనకు అందించిన సంపద. ఇవి కబ్టాలకు గురికాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కళ్ల ముందే కాలువాలను రియల్టరు ధ్వంసంచేసి వ్యాపారం చేసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లేదంటే రైతులతో కలిసి ఆందోళనకు పూనుకుంటాం.

- జక్క రవీందర్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు 



Updated Date - 2021-10-20T04:53:43+05:30 IST