Abn logo
Feb 18 2020 @ 05:18AM

బ్యాటింగే బలంగా..

ఈ ఏడాది ఐసీసీ షెడ్యూల్‌లో మూడు భారీ టోర్నీలు ఉండగా, ఇప్పటికే అండర్‌-19 ప్రపంచకప్‌ ముగిసింది. ఇక ఇప్పుడు మహిళల క్రికెట్‌లో ఽధనాధన్‌ పోరుకు తెర లేవనుంది. అక్టోబరులో పురుషుల పొట్టి ప్రపంచకప్‌ జరగనుండగా అంతకంటే ముందే తమ సత్తా ఏమిటో ప్రదర్శించేందుకు మహిళల జట్లు సిద్ధమవుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలో జరిగే ఈ మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ తొలి టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలో జట్టు బలం, బలహీనలతపై ఓసారి లుక్కేద్దాం. 


ఇప్పటి వరకు జరిగిన ఆరు టీ20 మహిళల ప్రపంచక్‌పలలో భారత్‌ ఒక్కసారి కూడా ఫైనల్లో ప్రవేశించలేదు. 2009, 2010, 2018 టోర్నీల్లో సెమీ్‌సకు వెళ్లడమే తమ ఉత్తమ ప్రదర్శన. ఇక ఈనెల 21న జరిగే ఆరంభ మ్యాచ్‌లోనే భారత మహిళలు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనున్నారు. దీంతో తొలి మ్యాచ్‌తోనే గట్టి పరీక్ష ఎదురుకానుంది. నిస్సందేహంగా భారత బలమంతా బ్యాటింగ్‌లోనే ఉంది. ఈ విభాగం మెరిస్తే ప్రత్యర్థికి చుక్కలు కనిపించాల్సిందే. ముఖ్యంగా 16 ఏళ్ల షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టులో భారీ హిట్టర్లుగా ఉంటున్నారు. జెమీమా రోడ్రిగ్స్‌ స్ట్రయిక్‌ను రొటేట్‌ చేస్తూ వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తగలదు. ఇక స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానను ఆల్‌ ఇన్‌ వన్‌గా చెప్పవచ్చు. కొంతకాలంగా ఈ ఎడమ చేతి బ్యాటర్‌ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉంటోంది. ఇప్పుడీ టోర్నీలోనూ మంధానపైనే జట్టు ఎక్కువగా ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. అయితే షఫాలీ లేక హర్మన్‌లతో క్రీజును పంచుకునేటప్పుడు తను ఎక్కువగా వారికే స్ట్రయికింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే భారీ షాట్లతో వారిద్దరు పరుగుల వరద పారించగలరు. ఇక జెమీమాతో ఆడేటప్పుడూ స్మృతి దూకుడు ప్రదర్శిస్తే సమతూకంగా ఉంటుంది. అయితే ఇదంతా కూడా తన సహజశైలి ఆటను కోల్పోకుండా చేయాల్సి ఉంటుంది. ఇతర బ్యాట్స్‌వుమెన్‌ కన్నా మంధాన కడదాకా క్రీజులో నిలిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టుకు ఈ విషయం బాగా తెలుసు. ‘భారత జట్టు బలమంతా బ్యాటింగ్‌లోనే ఉంది. నలుగురు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌వుమెన్‌ కలిగి ఉండడంతో వారితో మాకు ఎప్పుడూ ప్రమాదమే’ అంటూ స్వయానా ఆస్ర్టేలియా కోచ్‌ మాథ్యూ మాట్‌ స్పష్టం చేశాడు.


టీ20 ప్రపంచకప్‌ సన్నాహకంగా ఆసీస్‌, ఇంగ్లండ్‌లతో జరిగిన ముక్కోణపు సిరీ్‌సలో భారత్‌ గట్టి పోటీనే ఇచ్చి ఫైనల్‌కు చేరినా బ్యాటింగ్‌ బలహీనతలూ బయటపడ్డాయి. ఓపెనర్లు మెరిసినా ఆ తర్వాత విభాగం ఆకట్టుకోలేకపోయింది. దీంతో టాపార్డర్‌లో స్మృతి ఆటతీరు మరింత కీలకంగా మారింది. అంచనాలకు తగ్గట్టుగానే ఆమె ఈ సిరీ్‌సలో వరుసగా 15, 35, 45, 55, 66 స్కోర్లు సాధించింది. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత మంధాన 19 మ్యాచ్‌ల్లో 621 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అయితే ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు లేకపోతే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మంధానపై అధిక ఒత్తిడి పడుతుంది. దీంతో ఈ ప్రభావం ఆమె ఆటపై పడితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కనీసం 16 ఓవర్ల వరకైనా టాప్‌-4   ప్లేయర్స్‌ క్రీజులో ఉంటే ఆశించిన ఫలితం వస్తుంది. మిడిలార్డర్‌లో వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్‌, దీప్తి శర్మ బ్యాటింగ్‌ ఆందోళనకరంగా ఉంది. 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Advertisement
Advertisement
Advertisement