రాత్రి పదిగంటల సమయంలో వితంతువు ఇంటికి వెళ్లాడు.. నీకు రావాల్సిన డబ్బులు వచ్చేవారం వస్తాయని చెబుతూ.. సర్పంచ్ చేసిన నిర్వాకమిది!

ABN , First Publish Date - 2021-11-18T18:00:25+05:30 IST

ఇల్లు నిర్మించుకోండి..

రాత్రి పదిగంటల సమయంలో వితంతువు ఇంటికి వెళ్లాడు.. నీకు రావాల్సిన డబ్బులు వచ్చేవారం వస్తాయని చెబుతూ.. సర్పంచ్ చేసిన నిర్వాకమిది!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఇల్లు నిర్మించుకోండి తర్వాత డబ్బులిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో వెనకేసుకున్న నాలుగు రాళ్లను బయటకు తీసి ఇల్లు కట్టుకుంది ఆ వితంతు మహిళ. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం ఆలస్యం కావడంతో సతమతమయ్యింది. ఏం చేయాలో.. ఎవరిని అడగాలో తెలియని ఆమెకు ఆదుకుంటానని సర్పంచ్ ముందుకొస్తే త్వరలోనే తన డబ్బులొస్తాయని ఆశ పడింది. కానీ ఆమె జీవితంలో సర్పంచ్ రూపంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే..


జిల్లాలోని నిజాంనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ 45ఏళ్ల మహిళ నివసిస్తోంది. కొన్నాళ్ల క్రితం భర్త మరణించాడు. పిల్లలు లేరు. ఒంటరిగా జీవనం గడుపుతోంది. పనికి వెళ్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంది. ఇందిరాగాంధీ ఆవాస్ యోజన కింద ఆమె అర్హురాలు కావడంతో ఇల్లు మంజూరైంది. మొదటగా మీరే ఇల్లు నిర్మించుకోండి.. తర్వాత డబ్బులిస్తాం అంటే తిప్పలు పడి ఇంటిని నిర్మించుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రావడం ఆలస్యం కావడంతో కంగారుపడింది. ఎవరిని అడగాలో ఆమెకు తెలియలేదు. ఆమె పరిస్థితి తెలిసి.. ‘నీకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చేస్తా’ అని అమర్ సింగ్ అనే ఆ గ్రామ సర్పంచ్  మాటిచ్చాడు. దాంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే తనకు రావాల్సిన డబ్బులొస్తాయని, పూట గడుస్తుందని అనుకుంది.



అయితే, అమర్ సింగ్ ఓ దుర్మార్గుడు. ఆమె ఒంటరిగా ఉందని తెలిసి ఆమెపై కన్నేశాడు. డబ్బులు ఫలానా రోజు వస్తాయని మాయమాటలు చెబుతూ ఆమె ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. అపాయం గుర్తించని ఆమె అతడిని మంచోడే అని భావించింది. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో అమర్ సింగ్ మరోసారి ఆమె ఇంటికి వెళ్లి.. వచ్చేవారం కచ్చితంగా డబ్బులొస్తాయని చెబుతూ అవకాశం దొరికిందని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అమర్ సింగ్ నుంచి ఎదురైన ఊహించని సంఘటనతో ఆమె షాక్‌కు గురైంది. బుధవారం ఉదయం బరోదమేవ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


బరోదమేవ్ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్‌ఐ ఇలియాస్‌ఖాన్‌ మాట్లాడుతూ అమర్ సింగ్ అనే సర్పంచ్ ఒంటరిగా ఉన్న వితంతువుపై అత్యాచారం చేశాడని, నిందితుడిపై ఇంతకుముందే రెండుమూడు కేసులున్నాయని చెప్పారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.

Updated Date - 2021-11-18T18:00:25+05:30 IST