వైసీపీలో ఉండవల్లి శ్రీదేవి ప్రకంపనలు.. కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2022-01-03T21:18:23+05:30 IST

వైసీపీలో ఉండవల్లి శ్రీదేవి ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవల 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో అంబేద్కర్‌పై శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు

వైసీపీలో ఉండవల్లి శ్రీదేవి ప్రకంపనలు.. కీలక నేత రాజీనామా

అమరావతి: వైసీపీలో ఉండవల్లి శ్రీదేవి ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవల 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో అంబేద్కర్‌పై శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని, ఎవరో తాను మాట్లాడినట్లు ఎడిటింగ్ చేశారని తెలిపారు. దళిత సమాజం తనను క్షమించాలని శ్రీదేవి కోరారు. అయితే శ్రీదేవి తీరుకు నిరసనగా వైసీపీ నేత పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొలికపూడి ఉమామహేశ్వరరావు రాజీనామా చేశారు. అంబేద్కర్ పట్ల ఎమ్మెల్యే శ్రీదేవి అనుచిత వ్యాఖ్యలు బాధించాయని, ఎమ్మెల్యే తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.


ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో ఏకంగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పైనే శ్రీదేవి నోరు జారారు. ‘‘బాబూ జగ్జీవన్‌రామ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంబేడ్కర్‌ ద్వారా హక్కులు వచ్చాయా? రాలేదు. రాజ్యాంగ హక్కులను జగ్జీవన్‌రామ్‌ మనకు అమలు చేశారు. ఈ రోజున రాజకీయంగా, సామాజికంగా మనం ఎదుగుతున్నామంటే అది జగ్జీవన్‌రామ్‌ ఘనతే. నేను ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని శ్రీదేవి అన్నారు.


అయితే అంబేద్కర్‌ను తాను దూషించలేదని వివరణ ఇచ్చారు. కావాలనే కొంత మంది వ్యక్తులు తనపై దుష్ప్రాచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్ఫింగ్, ఎడిటింగ్ వీడియో వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాల దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. తాను ఈ స్థాయిలో నిలబడేందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలే తోడ్పాటు నిచ్చాయని తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్ రాం దళితులకు రెండు కళ్లులాంటి వాళ్లని తెలిపారు. తాను  చిన్ననాటి నుంచి అంబేద్కర్ వాదినని చెప్పారు.

Updated Date - 2022-01-03T21:18:23+05:30 IST