జగనన్న లేట్‌ అవుట్లు

ABN , First Publish Date - 2022-05-21T06:36:50+05:30 IST

జగనన్న లేట్‌ అవుట్లు

జగనన్న లేట్‌ అవుట్లు
నిర్మానుష్యంగా గుడివాడలోని మల్లాయిపాలెం లే అవుట్‌

జిల్లాలో నత్తనడకన ఇళ్ల నిర్మాణం

ఎటూ చాలని ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలు

రెండేళ్లలో అమాంతంగా పెరిగిపోయిన ధరలు

అదనపు భారం లబ్ధిదారులపైనే.. 

రూ.5 లక్షలు లేనిదే కష్టమంటున్న నిపుణులు

ఇల్లు కట్టకపోతే స్థలం వేరొకరికి ఇస్తామని అధికారుల బెదిరింపులు 

 ప్రభుత్వ సబ్సిడీ రెట్టింపు చేయాలని లబ్ధిదారుల డిమాండ్‌


అదిగో ‘జగనన్న లే అవుట్లు’.. ఇదిగో పేదలందరికీ ఉచిత స్థలాలు.. అదిగదిగో ఇళ్లు నిర్మించుకోడానికి ఆర్థికసాయం.. అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పి రెండేళ్లవుతున్నా ఇంతవరకూ జిల్లాలో ఒక్క లే అవుట్‌ పూర్తయింది లేదు. రోజులు గడిచిపోతున్నా.. ధరలు పెరిగిపోతున్నా.. ఆ ఆర్థికసాయమే అంటూ ప్రభుత్వం వేలాడుతుంటే, తలకుమించిన భారాన్ని మోయలేక, అధికారుల ఒత్తిడికి తాళలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. 


గుడివాడ, మే 20 : పేదల సొంతింటి కల ఇప్పట్లో సాకారమయ్యేలా లేదు. వ్యయం పెరిగిపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావట్లేదు. మరోవైపు ఇంటి పనులు మొదలుపెట్టకపోతే స్థలం వేరొకరికి బదిలీ చేస్తామని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఎటూ చాలట్లేదని, ఇంటి నిర్మాణం తలకుమించిన భారమైందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. అదనపు భారాన్ని భరించగలిగే వారు మాత్రం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సెంటు స్థలంలో ఇల్లు ఎలా నిర్మించుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. మండలాలవారీగా గృహ నిర్మాణాలపై వారంవారం టార్గెట్లు ఇచ్చి మరీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా ఒక్క అడుగు ముందుకు కదలని పరిస్థితి ఉంది. 

పునాది స్థాయి దాటినవి పది శాతమే..

జిల్లాలోని జగనన్న లే అవుట్లలో ఇళ్లు నిర్మించుకోవడానికి 97,363 మందికి స్థలాలు మంజూరు చేశారు. గురువారం నాటికి వీటిలో 30,232 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. 50,783 మంది బేస్‌మెంట్‌ వేయలేదు. కేవలం 7,268 మంది మాత్రమే బేస్‌మెంట్‌ స్థాయి దాటారు. అంటే పదిశాతం మంది మాత్రమే బేస్‌మెంట్‌ స్థాయి దాటి ఇళ్లు నిర్మించుకున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో 2,309 మందే పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించుకున్నారు.  

మూడు సిమెంట్‌ బస్తాల కోత 

ఇళ్ల నిర్మాణానికి 93 బస్తాల సిమెంట్‌ అవసరమని సాంకేతిక నిపుణులు అంచనా వేయగా, ప్రభుత్వం నాలుగు విడతల్లో కేవలం 90 బస్తాలే ఇస్తోంది. మొదటి దశలో 40, రెండో దశలో 10, మూడో దశలో 20, నాల్గో దశలో 20 బస్తాలు మొత్తం ఒక్కో లబ్ధిదారుడికి 90 సిమెంట్‌ బస్తాలు ఇవ్వాల్సి ఉంది. మరో మూడు బస్తాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఇంటికి 20 టన్నుల ఇసుక ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. లబ్ధిదారుడికి మొదటి దశలో రూ.60 వేలు, రెండో దశలో రూ.60 వేలు, మూడు, నాలుగు దశల్లో రూ.30 వేల చొప్పున ఇస్తున్నారు. మెటీరియల్‌ తీసుకుంటే ఆ విలువ పోగా, మిగతా మొత్తాన్ని నగదుగా ఇస్తున్నారు. 

ప్రభుత్వ లెక్కల ప్రకారమైతే నాణ్యత ప్రశ్నార్థకం

బేస్‌మెంట్‌ దశకు వచ్చిన ఇళ్లకు గోడల నడుమ మట్టిని నింపాలి. ఒక్కో ఇంటికి పది చక్రాల లారీ మట్టి రెండు లోడులు అవసరమవుతుంది. ప్రాంతాన్ని అనుసరించి ఒక్కో లారీకి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి నమూనాలో మెట్లు లేవు. మెట్లు కావాలనుకునే వారు బేస్‌మెంట్‌, పిల్లర్ల సంఖ్య ఎక్కువ పెట్టాలి. వాటికి అదనంగా రూ.50 వేల వరకు పెట్టాల్సి ఉంటుంది. దీనినిబట్టి అదనంగా రూ.2.5 లక్షల భారం అవుతుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో ఇల్లు నిర్మించుకోవడం సాధ్యమయ్యే పనికాదని తేలుతోంది. కొంతమంది లబ్ధిదారులు మాత్రం ఇంటిని పటిష్టంగా నిర్మించుకోవడానికి రూ.2.5 లక్షలు అదనంగా వెచ్చిస్తూ ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు. 

వేధిస్తున్న మౌలిక వసతుల లేమి

జిల్లాలో అత్యధిక లే అవుట్లను మౌలిక వసతుల లేమి వేధిస్తోంది. మెటీరియల్‌ తోలకానికి గ్రామీణ ప్రాంతాల్లోని లే అవుట్లలో రహదారుల వసతి సైతం లేకపోవడం గమనార్హం. వారంవారం కలెక్టర్లు, జేసీ స్థాయి అధికారులు గృహ నిర్మాణాలపై సమీక్షలు చేస్తున్నా జగనన్న లే అవుట్లలో మౌలిక వసతులు కల్పించడానికి నిధుల లేమి కిందిస్థాయి అధికారులను వేధిస్తోంది. లే అవుట్లు వేసి రెండేళ్లు అవుతున్న దృష్ట్యా ఇంటి నిర్మాణ సామగ్రి, ఇతర మెటీరియల్‌, లేబర్‌ కాంపొనెంట్‌ రెట్టింపయ్యాయి. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రెట్టింపు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించకుండా ఉన్నతస్థాయి సమీక్షల వల్ల ఫలితం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

అదనపు ఖర్చు మాటేమిటి?

ప్రభుత్వం విడుదల చేసిన ఇంటి నమూనా ప్రకారం నాలుగు దశల్లో లబ్ధిదారులకు నగదు విడుదల చేస్తున్నారు. ఇనుము, సిమెంట్‌ను స్థలం వద్దకే తెచ్చి ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. వాస్తవానికి లబ్ధిదారులే వాటిని తీసుకెళ్తున్నారు. కంకర సైతం లబ్ధిదారులే సమకూర్చుకుంటున్నారు. రవాణా ఖర్చులు ప్రభుత్వ నమూనాలో ఇంటి ఖర్చుకు జత చేయలేదు. దీంతో లబ్ధిదారుడికి రవాణా కింద రూ.10 వేలు అదనపు ఖర్చవుతోంది. నాలుగు విడతల్లో కలిపి ఇనుము 8-45 చువ్వలు, 10-ఎంఎం సైజు చువ్వలు 15, 12-ఎంఎం సైజు చువ్వలు 15 మొత్తం 485 కేజీలు ఇవ్వాల్సి ఉంది. అయితే, పూర్తిస్థాయిలో ఇనుము లబ్ధిదారులకు అందట్లేదు. పిల్లర్లకు అవసరమైన 6-ఎంఎం చువ్వలు లబ్ధిదారులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. శ్లాబ్‌ నిర్మాణ సమయంలో పిల్లర్లు, ఇనుప చట్రాల నిర్మాణానికి బైండింగ్‌ వైర్‌ అవసరం ఉంటుంది. 6-ఎంఎం చువ్వలు, బైండింగ్‌ వైర్లకు అయ్యే ఖర్చు లబ్ధిదారులపైనే పడుతోంది.




Updated Date - 2022-05-21T06:36:50+05:30 IST