సంక్రాంతికి సూర్య నమస్కారాలు... అనూహ్య స్పందన...

ABN , First Publish Date - 2022-01-13T21:50:22+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సమయంలో సూర్య నమస్కారాలకు

సంక్రాంతికి సూర్య నమస్కారాలు... అనూహ్య స్పందన...

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సమయంలో సూర్య నమస్కారాలకు చాలా ప్రాధాన్యం ఉందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సూర్య నమస్కార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందన్నారు. 75 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే 1 కోటి మందికిపైగా దీనిలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో శక్తి సామర్థ్యాలు, రోగనిరోధక శక్తి పెరుగుతాయని రుజువైనట్లు తెలిపారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల కరోనాను దూరంగా ఉంచవచ్చునన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ గ్లోబల్ సూర్య నమస్కార్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గురువారం వర్చువల్ సమావేశంలో సోనోవాల్ తెలిపారు. 


ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్ర భాయ్ మాట్లాడుతూ, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనసు, శరీరం పునరుత్తేజం పొందుతాయన్నారు. జనవరి 14న జరిగే గ్లోబల్ సూర్య నమస్కార్ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. సూర్య నమస్కారాలను చేసి, ఆ వీడియోలను పోస్ట్ చేయాలని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షణ సంస్థలు పాల్గొంటాయి. ఇండియన్ యోగా అసోసియేషన్, నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్, యోగా సర్టిఫికేషన్ బోర్డు, ఎఫ్ఐటీ ఇండియా, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు భాగస్వాములయ్యే అవకాశం ఉంది.  


Updated Date - 2022-01-13T21:50:22+05:30 IST