Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మరపురాని కివీల మంత్రజాలం

twitter-iconwatsapp-iconfb-icon
మరపురాని కివీల మంత్రజాలం

వరల్ట్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో క్రికెట్ సూపర్ పవర్ భారత్ పై కివీల సాధికారిక విజయం ఈ కాలమ్‌కు ప్రేరణ. 1973 వేసవిలో ఇంగ్లాండ్‌లో 1000 ఫస్ట్ క్లాస్ రన్స్‌తో ‘1000 రన్స్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ మే’ స్పోర్టింగ్ లిస్ట్‌లో డబ్ల్యు జి గ్రేస్, డాన్ బ్రాడ్‌మన్ సరసన స్థానం సంపాదించుకున్న గ్లెన్ టర్నర్, అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో కివీలకు సమున్నత గౌరవాన్ని సాధించిన రిచర్డ్ హ్యాడ్లీ, న్యూజిలాండ్ ప్రతిభాపాటవాలకు పర్యాయపదాలు. కివీల ఉత్తేజకరమైన బ్యాటింగ్, మహోత్తరమైన బౌలింగ్ గురించిన చెరిగిపోని స్మృతిహారమిది.


ఇప్పుడు ఎక్కడెక్కడి క్రికెట్ మ్యాచ్‌లు మీ కళ్ళముందే జరుగుతున్నాయి! టెలివిజన్ మహత్వమది. ఈ కాలం భారతీయుల క్రికెట్ చైతన్యాన్ని రూపొందిస్తున్న ప్రసార సాధనమది. అయితే నా బాల్య కౌమారాలలో ప్రపంచానికి నా గవాక్షం రేడియో. బీటిల్స్ గానఝరిని నేను మొట్టమొదట బిబిసి వరల్డ్ సర్వీస్ వారి ‘టాప్ ట్వంటీ’ ప్రోగ్రామ్‌లో విన్నాను. అదే చానల్ టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌లో లార్డ్స్ మైదాన్‌లో గార్ ఫీల్డ్ సోబర్స్ టెస్ట్ హండ్రెండ్‌లో ప్రతి స్ట్రోక్‌పై స్ఫూర్తిదాయక వ్యాఖ్యానాన్నీ విన్నాను.


ఇది 1966 నాటి మాట. అప్పుడు నా వయస్సు ఎనిమిదేళ్లు. మూడు సంవత్సరాల అనంతరం న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ మన దేశంలో మూడు టెస్ట్ల సిరీస్ నిమిత్తం పర్యటించింది. మన ‘ఆకాశవాణి’లో ఆ సిరీస్‌పై వ్యాఖ్యానాలను కూడా వినే ఉంటాను. వాటి జ్ఞాపకాలు ఏవీ నా మదిలో మిగలలేదు. అయితే 1973 వేసవిలో కివీ క్రికెటర్లు నాపై నెరపిన మంత్రముగ్ధ ప్రభావాలు నాకు బాగా జ్ఞాపకమున్నాయి. ఆ వేసవిలో గ్లెన్ టర్నర్ ఒక రికార్డు నెలకొల్పాడు. ఒక వేయి ఫస్ట్‌క్లాస్ రన్స్‌ను ఆయన పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ ఎండాకాలంలో మే మాసాంతంలోగా అటువంటి స్కోర్‌ను సాధించడం చాలా గొప్ప విషయం. అప్పటికి 35 సంవత్సరాలలో అటువంటి ఘనతను సంపాదించిన మొదటి బ్యాట్స్‌మన్ గ్లెన్ టర్నర్. ఈ కివీ (న్యూజిలాండ్ దేశస్థుడు) క్రికెటర్ ఆ రికార్డును కౌంటీ ఛాంపియన్‌షిప్ పోటీలో వర్సెస్టెర్ షైర్ టీమ్ తరపున సాధించాడు. అప్పట్లో బిబిసి వరల్డ్ సర్వీస్‌లో సాటర్ డే స్పోర్ట్స్ స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుండేది. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు అవిరామంగా ప్రసారమవుతుండేది. ప్రతి శనివారం టర్నర్ ఇన్నింగ్స్‌పై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆ కార్యక్రమంలో వింటుండేవాణ్ణి. 


‘1000రన్స్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ మే’ అనేది స్పోర్టింగ్ లిస్ట్స్‌లో ప్రత్యేకమైనది. 1973లో ఆ విశిష్ట జాబితాలోని ఆరుగురు క్రికెటర్లలో డబ్ల్యు.జి.గ్రేస్, వాలే హమ్మండ్, డాన్ బ్రాడ్‌మన్ (ఈ పరుగుల రికార్డును ఆయన రెండుసార్లు సాధించాడు) కూడా ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఒకరు ఈ గొప్ప జాబితాలో చోటు సంపాదించుకోవడం నాటి క్రికెట్ జగత్తులో ఒక అపూర్వ విశేషం. తత్కారణంగా గ్లెన్ టర్నర్ పలువురి, ముఖ్యంగా ఇంగ్లీష్ క్రికెట్ వ్యాఖ్యాతల ఆదరాభిమానాలను పొందాడు. ఆయన ప్రతిభాపాటవాలు ఈ భారతీయ బాల విద్యార్థి మనస్సుపై చెరగని ముద్రవేశాయని మరి చెప్పాలా? 


1973 మేలో వర్సెస్టెర్ షైర్ టీమ్‌కు ఘన విజయాన్ని సాధించిపెట్టిన టర్నర్, ఆ మరుసటి నెల న్యూజిలాండ్ టీమ్‌లో చేరాడు. ఆ టీమ్ సభ్యుడుగా మూడు టెస్ట్ మ్యాచ్‌ల నిమిత్తం ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1973 జూన్ 7 నుంచి 12 దాకా నాటింగ్ హామ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌పై బిబిసిలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వినడం ఒక ఉద్వేగభరితమైన అనుభవం. మరి ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం మరెంత పులకరింపు కలిగించివుండేదో కదా. నాలుగో ఇన్నింగ్స్‌లో విజయం సాధించేందుకు న్యూజిలాండ్ 478 పరుగులు చేయవలసి ఉంది. ఆ అసాధారణ పరిస్థితిని కివీలు స్ఫూర్తిదాయకంగా అధిగమించారు. మా ఫ్యామిలీ రేడియోలో నేను ప్రతి పరుగుపైన వ్యాఖ్యానాన్ని అమిత శ్రద్ధతో వినే వాణ్ణి.


ఇంచుమించు అర్ధ శతాబ్దం క్రితం జరిగిన చరిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ అది. అయితే స్కోర్ కార్డ్‌ను చూడకుండానే ఆ టెస్ట్ మ్యాచ్‌లో ఎవరెవరు ఎన్ని పరుగులు చేసిందీ చెప్పగలను. న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ బెవోన్ కోన్గ్ డన్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ విక్టర్ పొలార్డ్‌లు సెంచరీలు చేశారు. ఈ ఇరువురి బ్యాటింగ్ శైలులు భిన్నమైనవి. కోన్గ్ డన్ బ్యాటింగ్ చాలా సంప్రదాయ పద్ధతుల్లో ఉంటుంది. పొలార్డ్ బ్యాటింగ్ వినూత్న పద్ధతుల్లో ఉండి ప్రతి ఒక్కరినీ అలరించేది.


ఈ చరిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌కు రెండు వేసవిల క్రితం అంటే 1971లో భారత్, ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ప్రప్రథమంగా ఓడించింది. నలభై సంవత్సరాల పాటు అవిరామంగా ప్రయత్నించిన అనంతరం సాధించిన విజయమది. 1971 ఆగస్టు తుదినాళ్ళలో ఈ ఓవల్ టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు నేను బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నాను. రేడియోలో ఆ టెస్ట్ మ్యాచ్‌పై వ్యాఖ్యానం వినడం సాధ్యమయ్యేది కాదు. మరుసటిరోజు దినపత్రికలలో ఆ టెస్ట్ మ్యాచ్ వివరాలను చదువుకుని సంతృప్తి పడేవాణ్ణి. అయితే 1973 జూన్‌లో ఇంగ్లాండ్-–న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ ప్రతి క్షణాన్ని అనుసరించాను. ఉత్తేజకరమైన బౌలింగ్, మహోత్తేజకరమైన బ్యాటింగ్! ఆ మ్యాచ్‌లోని ప్రతి అంశమూ ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకముంది.


క్రికెట్ అభిమానులు అయిన భారతీయులు న్యూజిలాండ్ క్రికెటర్ల పట్ల ఒక ఆధిక్యతా భావం చూపడం కద్దు. కీవీల కంటే మన క్రికెటర్లే అన్నింటా ఉత్కృష్టులు అనేది మనవారి భావనగా ఉండేది. ఏమైనా మనకు సంబంధించినంతవరకు కీవీ క్రికెటర్ల గురించిన రెండు ముఖ్యమైన వాస్తవాలను ప్రస్తావించవలసి ఉంది. మొదటిది- మనం ఒక టెస్ట్ మ్యాచ్‌లో అతి తక్కువ పరుగులు (26, ఆలౌట్) చేయడానికి బాధ్యులు కీవీలే; రెండోది- మనం ఓవర్సీస్ టెస్ట్ సిరీస్‌లో సాధించిన మొదటి విజయం న్యూజిలాండ్‌లో. ఇంగ్లాండ్ వేసవిలో మే మాసాంతంలోగా 1000 పరుగుల రికార్డును నెలకొల్పడంలో గ్లెన్ టర్నర్ ఎలా గ్రేస్, హమ్మండ్, బ్రాడ్ మన్‌లను అనుసరించిందీ, ట్రెంట్ బ్రిడ్జి టెస్ట్ మ్యాచ్‌లో 478 పరుగులు సాధించడంలో కోన్గ్ డన్, పొలార్డ్‌లు ప్రదర్శించిన ప్రతిభాపాటవాల గురించి తెలుసుకున్న తరువాత కివీ క్రికెటర్లపై అమిత గౌరవభావాన్ని పెంచుకున్నాను. మరో విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంది. టెస్ట్ క్రికెట్‌లో కివీలను సునాయాసంగా ఓడించవచ్చనే అభిప్రాయం ఒకటి విస్తృతంగా ఉంది. ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్, భారతీయ క్రికెట్ అభిమానులలో ఇటువంటి అభిప్రాయం బలంగా ఉంది. అయితే వెల్లింగ్టన్‌లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో రిచర్డ్ హ్యాడ్లీ తన అద్భుత స్వింగ్ బౌలింగ్ ద్వారా ఆ అభిప్రాయం పూర్తిగా తప్పుడు అభిప్రాయమని నిరూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న హాడ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో మన జట్టును చిత్తుగా ఓడించాడు. ఆయన బౌలింగ్ ధాటికి గవాస్కర్, విశ్వనాథ్, వెంగ్ సర్కార్‌లు సైతం నిలవలేకపోయారు. 


వెల్లింగ్టన్ టెస్ట్ మ్యాచ్‌లో యువ హ్యాడ్లీ ఒక స్టార్‌గా వెలుగొందాడు. అయితే కివీల విజయంలో ఆయనతో పాటు గ్లెన్ టర్నర్, బెవన్ కోన్గ్ డన్‌లు కూడా కీలక పాత్ర వహించారు. దేశ దేశాలలోని క్రికెట్ అభిమానులలో కివీల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో మరే వ్యక్తి కంటే రిచర్డ్ హ్యాడ్లీనే విశేషంగా తోడ్పడ్డారు. ఈ విషయంలో ఆయన పాత్ర అనుపమానమైది. ఆయన యువ సమకాలికుడు మార్టిన్ క్రో పాత్ర కూడా విశిష్టమైనదే. ప్రపంచ క్రికెట్‌లో హ్యాడ్లీ అత్యుత్తమ బౌలర్ అయితే క్రోవ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మాన్. క్రో అద్భుతమైన కెప్టెన్ కూడా. ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ఎంత ప్రతిభాన్వితమైనవో 1992 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో వెల్లడయ్యాయి.


ఇటీవల సౌథాంప్టన్‌లో వరల్ట్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఈ కాలమ్‌కు ప్రేరణ అని పాఠకులు ఊహించే ఉంటారు. ఆ ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ సాధికారికంగా గెలుచుకున్నది. ఆ విజయానికి కివీలు పూర్తిగా అర్హులు. ఆస్ట్రేలియా కంటే కివీలు ముందుగా ఫైనల్‌కు చేరుకోవడం ఆనందంగా ఉంది. ఆస్ట్రేలియా– న్యూజిలాండ్‌కు పొరుగు దేశం. అయితే కివీల పట్ల ఆస్ట్రేలియన్లకు తక్కువ భావం ఉండేది. (న్యూజిలాండ్‌లో 1946లో ఒక టెస్ట్ ఆడిన ఆస్ట్రేలియన్లు, ఆ తరువాత 27 సంవత్సరాల పాటు కివీలపై ఆడడానికి తిరస్కరిస్తూ వచ్చారు.) ఆ ఫైనల్‌లో భారత్ జట్టును కివీలు ఓడించడం మరింత సంతోషకరమైన విషయం. జనాభాపరంగా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఎంత అంతరం ఉందో మరి చెప్పనవసరం లేదు. ఇక ఆర్థిక శక్తి పాలనా నియంత్రణ, ఇతరులను సతాయించడం మొదలైన విషయాలలో మన దేశం క్రికెట్ జగత్తులో ఏకైక అగ్రరాజ్యం కదా. ఇది ఒక తిరుగులేని వాస్తవం. 


న్యూజిలాండ్ క్రికెటర్ల ప్రతిభాపాటవాల పట్ల నా గౌరవాభిమానాలలో భాగంగా ఆ దేశానికి చెందిన సార్వకాలిక క్రికెట్ జట్టు (ఆల్ టైమ్ ఎలెవన్) నొకదాన్ని ఎంపిక చేస్తాను. ఇన్నింగ్స్ ఓపెనింగ్స్‌లో గ్లెన్ టర్నర్‌తో పాటు బెర్ట్ సట్ల్కిఫ్ ఉండాలి (బెర్ట్ మన దేశంలో రెండుసార్లు ఆడాడు. రెండు సందర్భాలలోనూ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు). మూడు, నాలుగు స్థానాలలో కేన్ విలియమ్సన్, మార్టిన్ క్రో‌ ఉండాలి. కెప్టెన్సీ వీరిద్దరి మధ్య మారుతూ ఉండాలి. ఐదో స్థానంలో మార్టిన్ డొనెలీ ఉండాలి. లెప్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ అయిన డొనెలీ చాలా పాతతరం క్రికెటర్. ఇంగ్లాండ్‌పై ఆయన సాధించిన విజయాలు అవిస్మరణీయమైనవి. ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలు ఆల్‌రౌండర్స్‌వి. వీరు: వికెట్ కీపర్ బ్రెండన్ మెకల్లమ్, లెఫ్ట్‌ ఆర్మ్ స్లో బౌలర్ డానియెల్ వెట్టోరి, ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ. మిగతా ముగ్గురు స్వింగ్ బౌలర్లు. వీరిలో ఒకడుగా ఉండడానికి రిచర్డ్ కోలింజ్ అర్హుడేగానీ నేను ట్రెంట్ బౌల్ట్ వైపు మొగ్గుతున్నాను. ఇతనితో పాటు టిమ్ సౌథీ, షేన్ బాండ్. స్వింగ్ బౌలింగ్‌లో వీరి ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మాటకొస్తే స్వింగ్ బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రతిభావంతులలో అత్యధికులు కివీలే కదా. ఆల్‌టైమ్ ఇండియన్ ఎలెవన్, ఆల్ టైమ్ కివీ ఎలెవన్ జట్ల మధ్య భారత్‌లో టెస్ట్ మ్యాచ్ జరిగితే కుంబ్లే, మన్కడ్, అశ్విన్ లాంటి వారిని ఔట్ చేసేందుకు కివీలు చాలా తిప్పలు పడడం ఖాయం. అయితే ఆ మ్యాచ్ సౌథాంప్టన్‌లో జరిగితే మన గవాస్కర్, టెండూల్కర్ లాంటి వారిపై కివీలు పైచేయి సాధిస్తారనడంలో సందేహం లేదు.


మరపురాని కివీల మంత్రజాలం

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.