దళితుడిపై హెడ్ కానిస్టేబుల్ బూతుల వర్షం.. పదే పదే ఎందుకిలా!?

ABN , First Publish Date - 2020-06-07T16:31:06+05:30 IST

అనంతపురం జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందినవారిపై వరుసగా వేధింపులు కొనసాగుతున్నాయి.

దళితుడిపై హెడ్ కానిస్టేబుల్ బూతుల వర్షం.. పదే పదే ఎందుకిలా!?

అనంతపురం : జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందినవారిపై వరుసగా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తున్నప్పటీకీ పట్టించుకునే నాథులే లేరు. అసలు అనంతపురం జిల్లాలో పదే పదే ఎందుకిలా జరుగుతోంది..? ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు..? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు..? రక్షించాల్సిన పోలీసులే దళితులను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు..? అగ్రకులాలకు చెందిన ఆఫీసర్ల నుంచి దళితులకు ఇంకెన్నాళ్లిలా వేధింపులు..? అనే విషయమై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


అసలేం జరిగింది..!?

వివరాల్లోకెళితే.. రాయదుర్గం నియోజకవర్గం, గుమ్మగట్ట పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రఘునాథరెడ్డి.. ఎఫ్ఐఆర్ కాపీ అడిగినందుకు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బండ బూతులు తిట్టారు. ఆయన మాట్లాడిన మాటలు రాయడానికి, చెప్పడానికి వీలులేనంత అసభ్యంగా ఉన్నాయంటే అర్థం చేస్కోండి. గుమ్మగట్ట మండలం, హీరాపురం గ్రామంలో కొన్నేళ్లుగా కుల వివక్ష అధికంగా ఉంది. అధికారపార్టీకి చెందినవారు గ్రామంలో సామాజిక వర్గానికి చెందిన దళితులను తరచుగా వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 


ఎఫ్ఐఆర్ కాపీ అడగటమే తప్పా..!?

కేసుకు సంబంధించి రమేష్ అనే వ్యక్తి గుమ్మగట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కొన్ని నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు గానూ శనివారం ఎఫ్ఐఆర్ కాపీ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఎస్ఐ స్టేషన్‌లో లేరు. అక్కడే ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డిని ఎఫ్ఐఆర్ కాపీ అడిగాడు. ఆయన ఏ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో గానీ ఒక్కసారిగా బాధితుడిపై బూతుల వర్షం ప్రారంభించాడు. తీవ్ర అసభ్య పదజాలంతో నోటికొచ్చిన మాటలన్నీ తిట్టేశారు. ‘అదేంటి సార్.. నేను అడిగిందేంటి.. మీరు అంటున్నదేంటి..?’ అని బాధితుడి మొత్తుకున్నా ఇంకాస్త రెచ్చిపోయారు. 


ఈయనకేం కొత్తకాదు..!

కాగా.. రఘునాథరెడ్డి ఇలాంటి ఘటనలతో గతంలో రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ ఆయన తీరు మాత్రం మారలేదు. అదేదో సామెత ఉంది కదా ఆ తీరున రఘునాథరెడ్డి వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇవన్నీ అటుంచితే.. రఘునాథరెడ్డి.. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేకు సమీప బంధువు కావడంతో చర్యలు తీసుకునేందుకు ఉన్నాతాధికారులు వెనుకాడుతున్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే అసలుకే ఎసరు వస్తుందని రఘునాథరెడ్డికి పోవడానికే భయపడుతున్నారట. అటు దళితులపై పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. ఇటు రఘునాథరెడ్డి లాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

Updated Date - 2020-06-07T16:31:06+05:30 IST