గ్రామ పంచాయతీలపై మోయలేని భారం!

ABN , First Publish Date - 2022-05-16T05:15:57+05:30 IST

పారిశుధ్య కార్మికుల జీతాలు, విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్ల నిర్వహణ ఖర్చులు.. హరితహారం మొక్కల కొనుగోళ్లు ఇలా ఎన్నో వ్యయాలతో ఆర్థికలోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలపై మరో భారం మోపేందుకు రంగం సిద్ధమైంది.

గ్రామ పంచాయతీలపై మోయలేని భారం!
వీధి దీపాల నిర్వహణపై బీబీపేటలో చర్చిస్తున్న సర్పంచ్‌లు

- ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు పవర్‌షాక్‌

- వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యత ఈఈఎస్‌ఎల్‌కు

- కార్మికుల జీతాలు, ట్రాక్టర్‌ నిర్వహణ ఖర్చులే చెల్లించలేని పరిస్థితి

- ఏటా రూ.10 లక్షల ఖర్చులు దాటుతున్న వైనం

- తాజా నిర్ణయంపై సర్పంచుల విముఖత


కామారెడ్డి, మే 15: పారిశుధ్య కార్మికుల జీతాలు, విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్ల నిర్వహణ ఖర్చులు.. హరితహారం మొక్కల కొనుగోళ్లు ఇలా ఎన్నో వ్యయాలతో ఆర్థికలోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలపై మరో భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ప్రతీ గ్రామ పంచాయతీలో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ బాధ్యతలను ఎనర్జి ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) సంస్థకు అప్పజెప్పాలని, గ్రామ పంచాయతీలు ఈ మేరకు తీర్మానం చేసి పంపాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మా గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసే బాధ్యతను ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్నటువంటి సంస్థకు అప్పగించడం ఏమిటని ఆయా గ్రామాల సర్పంచులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ప్రతినెల వివిధ ఖర్చుల రూపేనా గ్రామ పంచాయతీలు చెల్లిస్తుండడంతో వ్యయం  తడిసి మోపెడవుతుందని, మళ్లీ ఈ ఖర్చును ఎలా భరించాలని వాపోతున్నారు.

జిల్లాలో పంచాయతీల పరిస్థితి ఇలా..

జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలను చిన్న, మధ్యస్త, పెద్ద పంచాయతీలుగా విభజిస్తే చిన్న గ్రామ పంచాయతీలకు నెలకు పారిశుధ్య కార్మికుల జీతాలకు రూ.25,500 నుంచి 35,000, విద్యుత్‌ బిల్లులు రూ.15వేలు, వీధి దీపాల ఖర్చులు రూ.10వేలు, హరితహారం మొక్కల నిర్వహణ రూ.9వేల వరకు ఉంటుంది. ఈ రూపేనా 1500 జనాభా కలిగిన ఒక చిన్న గ్రామ పంచాయతీ ఖర్చులు నెలకు రూ.79వేల వరకు వేసుకున్నా ఏడాదికి రూ.10లక్షల వరకు ఉంటుంది. 3వేల జనాభా ఉన్న పంచాయతీలకు ఏడాదికి రూ.15లక్షలు, 4500 జనాభా పైబడిన వాటికి ఏడాదికి రూ.22 లక్షల ఖర్చు అవుతున్నాయి. ఈ విధంగా పెరిగిపోతున్న ఖర్చులతో గ్రామంలో ప్రజలకు అవసరమైన ఇతర వివిధ రకాల అభివృద్ధి పనులు చేసేందుకు నిధుల కొరత ఏర్పడుతున్నట్లు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.

నిధుల విడుదల గోరంత

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల చేస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా విడుదలవుతున్న నిధులు సక్రమంగా విడుదల కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 1500 జనాభా ఉన్న గ్రామ పంచాయితీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా ఏడాదికి రూ.25లక్షలు విడుదల అవుతుండగా వివిధ రకాల చెల్లింపులకు గాను ఏడాదికి రూ.10లక్షల వరకు ఖర్చులు అవుతున్నాయి. అలాగే రూ.15 లక్షలు డ్రైనేజీలు, కల్వర్టులు, సీసీరోడ్ల నిర్మాణాలు, తాగునీటి అవసరాలు, పాఠశాలల, అంతర్గత రోడ్ల మరమ్మతులు, ఇతర పనులకు మిగులు కొద్దిపాటి నిధులు ఎలా సరిపోతాయని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. మధ్యస్థ, పెద్ద పంచాయతీల ఆర్థిక పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది.

అగ్రిమెంట్‌తో ఎక్కువ ఖర్చు

ప్రస్తుతం ఏడేళ్లకు ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే భారం రెట్టింపు అవుతుందనే విమర్శలు సర్పంచ్‌ల నుంచి వినిపిస్తున్నాయి. దానికి తోడు వీధి దీపాల నిర్వహణలో రోజువారిగా తలెత్తే వివిధ రకాల సమస్యలను సంస్థ ఎప్పుడు పరిష్కరిస్తుందని అంటున్నారు. అనుకోని సమయాల్లో రాత్రిళ్లు వీధి లైట్లకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే బాధ్యత ఎవరు వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.


వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీలకే ఉండాలి

- పాత రాజు, సర్పంచ్‌, జనగామ, బీబీపేట మండలం

గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీలకే ఉండాలి. ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడం వల్ల నిర్వహణ సరిగా జరుగక గ్రామాల్లో అంధకారం చోటు చేసుకుంటుంది. జీపీలకు మంజూరు అవుతున్న నిధుల్లో సగం వరకు నిర్వహణకే చెల్లిస్తే మిగిలిన పనులు ఏ నిధుల ద్వారా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలి.

Updated Date - 2022-05-16T05:15:57+05:30 IST