అనధికార పెత్తనాలు

ABN , First Publish Date - 2022-04-14T05:40:17+05:30 IST

నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో అనఽధికార పెత్తనాలు నడుస్తున్నాయి.

అనధికార పెత్తనాలు

నంద్యాల మున్సిపాల్టీలో అంతా వీళ్ల రాజ్యమే 

మున్సిపల్‌, సచివాలయాల సిబ్బంది ఊడిగం చేయాల్సిందే

ప్రతి పనికీ చేతులు తడపాల్సిందే 

అధికార పార్టీలో కలకలం రేపుతున్న వసూళ్ల పర్వం 


నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 13 : నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో అనఽధికార పెత్తనాలు నడుస్తున్నాయి. మాజీ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తల పెత్తనం, వసూళ్ల పర్వం కలకలం రేపుతోంది. వీరితో పాటు కొందరు కౌన్సిలర్లు తమ పరిధి దాటి అంతా తనదే అని పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీ అంతా ఇలాంటి వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. 


మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 42వార్డులు ఉన్నాయి. అధికార పార్టీ తరపున 37మంది కౌన్సిలర్లు, టీడీపీ తరపున నలుగురు, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లలో కొందరు, మరి కొందరు మాజీ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు వ్యవహరిస్తున్న తీరు అధికార పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాల్టీలో ఏ విభాగంలో పని కావాలన్నా తమను సంప్రదించాల్సిందేనని వీరు హుకుం జారీ చేశారు. మున్సిపాల్టీకి వచ్చే ప్రతి విన్నపం తమ దృష్టికి తీసుకు రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాము చెప్పినట్లు వినకుంటే సిబ్బందిని ఇంకో సెక్షన్‌కు మార్పిస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌ చైౖర్‌పర్సన్‌గా మహిళ ఉండటంతో కౌన్సిల్‌లోని అధికార పార్టీకి చెందిన నలుగురు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా రన్న విమర్శలు ఉన్నాయి. వీరి తీరు ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. 


పైరవీల కింగ్‌గా..


అతను మున్సిపాల్టీ మాజీ కౌన్సిలర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో పైరవీల కింగ్‌గా అవతారమెత్తాడు. ఇతని భార్య గత మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. కానీ ఈ మాజీ కౌన్సిలర్‌ వీఎల్‌టీ, ఇంటి పన్నులు, ప్లాన్‌ అప్రూవల్‌ ఇలా.. ఏ పని అయినా తన కనుసన్నల్లో జరగాల్సిందేనని కిందిస్థాయి సిబ్బందిని శాసిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ‘నేను ముుఖ్య నాయకుడికి అనుచరుడిని ‘నా కెపాసిటీ మీకు తెలుసు కదా’ అని సిబ్బందిపై పెత్తనం చెలాయించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఎవరైనా పని నిమిత్తం మున్సిపాల్టీకి వస్తే, ఆ వ్యక్తి సెల్‌ఫోన్‌ నెంబర్‌ తీసుకొని తనకు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించడంతో తలలు పట్టుకుంటున్నారు. 


అంతా నాదేనంటూ..


మున్సిపల్‌ కౌన్సిల్‌లో అంతా తనదే అనే మరో పీఠం ఉంది. చైర్‌ పర్సన్‌ తరువాత స్థానంలో ఉన్న ఈ కౌన్సిలర్‌ అంతా తనదేనంటూ పరిధిని దాటి పెత్తనం చెలాయిస్తున్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుతో పాటు పట్టణంలో ఎక్కడైనా సరే గృహ నిర్మాణాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, ఖాళీ స్థలాలపై పన్నులు, టౌన్‌ ప్లానింగ్‌ అనుమతి లేని నిర్మాణాలు.. ఇలా అన్నింటికి నేరుగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతని వ్యవహారం ఇప్పటికే అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఇతని వ్యవహార శైలిపై మిగతా వార్డు కౌన్సిలర్లు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు కౌన్సిలర్‌ తన అధికార పరిధిని అతిక్రమించి పెత్తనం చెలాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయినా అతను లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్య నాయకుడి అండ తనకుందంటూ, ఎవరేం చేసుకుంటారో చేసుకోండని మున్సిపల్‌ సిబ్బందిని, సహచర కౌన్సిలర్లను సైతం బెదిరిస్తున్నట్లు ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. 


అన్నా అనొద్దు.. సార్‌ అని పిలవాల్సిందే...


మున్సిపాల్టీలో ఓ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా కౌన్సిలర్‌ భర్త ఇతను. ఇతడికి మున్సిపాలిటీలో ఏ అధికారం లేదు. భార్యను పక్కనపెట్టి చక్రం అంతా తానే తిప్పుతున్నాడు. సచివాలయ సిబ్బంది ప్రతి రోజూ ఉదయం ఇతనికి ఫోన్‌చేసి గుడ్‌మార్నింగ్‌ చెప్పాలి. లేకుంటే ఇక అంతే సంగతులు. సచివాలయ సిబ్బందిపై ఇతడి పెత్తనం మితిమీరిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మున్సిపాల్టీలో గాని, సచివాలయంలో గాని ఉద్యోగులు ఎవరైనా అన్నా అని సంబోధిస్తే ఇతగాడు ఫైర్‌ అవుతాడు. సార్‌ అని పిలవాల్సిందేనంటూ బెదిరించడం ఇతని నైజం. దీంతో మున్సిపల్‌, సచివాలయ సిబ్బందికి దిక్కు తోచడం లేదు. తన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుకు సంబంధించిన ఫైల్‌ సచివాలయానికి గాని, మున్సిపాల్టీకి గాని వస్తే దాని తీసుకుని ఉద్యోగులు ఆయన ఇంటికి వెళ్లాల్సిందే. ఈ మేరకు ఈ అనధికార వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులపై  ఆర్డర్‌ పాస్‌ చేశాడట. తాము ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నామా...?, లేక ఇతనికి ఊడిగం చేసున్నామా? తెలియడం లేదని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతని వ్యవహార శైలిపై ఇప్పటికే పలువురు అధికార పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకుడి దృష్టికి తీసుకువెళ్లి అక్షింతలు వేయించారు. అయినా ఫలితం లేదని సమాచారం. 


చెప్పింది చేయకుంటే..


ఇంకో మాజీ కౌన్సిలర్‌దీ అదే దర్పం. మున్సిపాలిటీలో అధికారం ఏమీ లేదు. ఆయన భార్య ప్రస్తుతం కౌన్సిల్‌లో సభ్యురాలు. ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని మున్సిపాల్టీ అంతా చక్రం తిప్పుతున్నాడు. రూ.లక్షల్లో వసూళ్ల తతంగం నడుపుతున్న ఈ వ్యక్తి వ్యవహారం అధికార పార్టీలో హాట్‌ టాఫిక్‌ మారింది. ఇతను గతంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాల్టీ పరిధిలో ఏ పనులు కావాలన్నా ఇతడ్ని సంప్రదించాల్సిందే. లేకుంటే ఫైళ్లన్నీ కింది స్థాయిలోనే పెండింగ్‌లో పడటం ఖాయం. సిబ్బందిలో కొందరు ఇతడికి ఏజంట్లుగా  పనిచేస్తున్నారు.  సహకరిం చకుంటే సీటు మార్పిస్తానని ఇంకొందరిని బెదిరించడంతో వారు తలలు బాదుకుంటున్నారు. అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్లు సైతం తమ వార్డుల్లో అతనికేం పనంటూ అక్కసు వెళ్లగక్కుతున్నప్ప టికీ బహిరంగంగా ఎవ్వరూ నోరువిప్పలేని పరిస్థితి నెలకొంది. 



మౌనం దాల్చిన ముఖ్య అధికారి 


నంద్యాల మున్సిపాల్టీలో అధికార పరిఽధులు ఇంతగా ఉల్లంఘనకు గురవుతున్నా ముఖ్య అధికారి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనధికార వ్యక్తులు సంస్థను తమ చేతుల్లోకి తీసుకొని చక్రం తిప్పుతుంటే ముఖ్య అధికారి మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తుల వ్యవహారం గురించి సిబ్బంది, కొందరు కౌన్సిలర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై కౌన్సిల్‌లో అత్యంత కీలకమైన ప్రజాప్రతినిధి సైతం నోరు మెదపలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2022-04-14T05:40:17+05:30 IST