కబ్జా కోరల్లో కొల్లేరు

ABN , First Publish Date - 2020-07-08T07:56:32+05:30 IST

కొల్లేరు సరస్సుని ఎంచక్కా కబ్జా చేసి అందులో చేపల చెరువులు తవ్వుకోవడానికి వైసీపీ పెద్దలు తమకు అయిన వారికి గ్రీన్‌ సిగ్నల్‌

కబ్జా కోరల్లో కొల్లేరు

  • చేపల చెరువుల కోసం వందలఎకరాలు కబ్జా
  • అక్రమంగా చెరువుల తవ్వకానికి ఎత్తుగడ!
  • వైసీపీ పెద్దల ఆశీస్సులతో పక్కా ఏర్పాట్లు
  • వీరమ్మకుంట వద్ద రంగంలోకి యంత్రాలు
  • చిచ్చురేపిన గ్రూపు తగాదాలు, గొడవలు
  • పరస్పర ఫిర్యాదులతో బెడిసికొట్టిన వ్యూహం
  • రంగంలోకి అటవీ పరిరక్షణ అధికారులు

కొల్లేరు అభయారణ్యం. అనుమతిలేనిదే ఏ ఒక్కరికీ ప్రవేశం లేనేలేదు. అంగుళం భూమి తవ్వకానికి గానీ, గట్లు పోయడానికి గానీ నిబంధనలు ఒప్పుకోవు. అభయారణ్యంలో ఇంతకు ముందునుంచే కట్టుదిట్టమైన భద్రత ఉంది. కానీ.. ఇంతటి కఠిన నిబంధనలు అమల్లో ఉన్నా.. కొల్లేరు కబ్జా కోరల్లో చిక్కుకుంటోంది. 


(ఏలూరు - ఆంధ్రజ్యోతి) 

కొల్లేరు సరస్సుని ఎంచక్కా కబ్జా చేసి అందులో చేపల చెరువులు తవ్వుకోవడానికి వైసీపీ పెద్దలు తమకు అయిన వారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా, అధికారుల కళ్లబడకుండా వందలాది ఎకరాలు తవ్వేసుకుని పని కానిచ్చేయండని ప్రోత్సహించారు. ఇంకేముంది వైసీపీ ముఖ్య నేతలకు సహచరులుగా, అనుచరులుగా ఉన్నవారంతా కొల్లేరును కబ్జా చేసేందుకు యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. కొద్ది రోజుల వ్యవధిలోనే దాదాపు 400 వదల ఎకరాల్లో చేపల చెరువులకు వీలుగా గట్లు ఏర్పాటు చేశారు. అయితే గ్రూపు తగాదాలు కారణంగా ఈ వ్యవహారం బట్టబయలైంది. అటవీ పరిరక్షణ అధికారులు రంగ ప్రవేశం చేసి వేసిన గట్లను తొలిగించారు.


అసలేమైందంటే.. 

కొల్లేరులో అక్రమ చెరువుల తవ్వకంపై దశాబ్దంన్నర కిందట కేంద్ర సాధికార కమిటీ నిషేధం విధించింది. ఎవరైనా గీత దాటితే అటవీ అధికారులు కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధుల అండతో కొందరి చూపు కొల్లేరుపై పడింది. ఈ మధ్యనే దెందులూరు నియోజకవర్గ పరిధిలోని వీరమ్మకుంట-మానేరు గ్రామాల పరిధిలో భారీ ఎత్తున కబ్జా చేసి చేపల చెరువులు తవ్వకానికి పన్నాగం పన్నారు. వారం క్రితం మూడో కంటికి తెలియకుండా యంత్రాలను తరలించారు. వీరమ్మకుంట సమీపాన ఇంతకుముందు వైఎస్‌ హయాంలో మనుగడలో ఉన్న 65 ఎకరాల చెరువును తొలుత పునరుద్ధరించుకోవాలనే ఎత్తుగడకు దిగారు. ఈ ప్రాంతంలోనే అప్పట్లో కొల్లేరు ఆపరేషన్‌ పేరిట ఉన్న చెరువు గట్లను ధ్వంసం చేశారు. తిరిగి అదే స్థానంలో తాజాగా చెరువులు తవ్వేందుకు అధికార పార్టీ మద్దతుదారులు యంత్రాలను రప్పించారు. సాధారణంగా కొల్లేరు ప్రాంతంలో ఎక్కడ జేసీబీ కనపడినా అటవీ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తొలుత 65 ఎకరాలు, ఆతర్వాత మరో 300 ఎకరాల్లోనూ వరుసగా చెరువుల ఏర్పాటుకు గట్లు పోసేందుకు సిద్ధపడ్డారు.


మూడు, నాలుగు రోజుల్లోనే 15 ఎకరాలు పొడవునా గట్లు వేసేశారు. ఆ ప్రాంతానికి రావద్దంటూ స్థానికులను  ముందుగానే హెచ్చరించారు. దీంతోపాటు గుడివాకలంక ప్రాంతంలో మరో 70 ఎకరాల్లోనూ చెరువుల తవ్వకానికి అంతర్గతంగా కొందరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ‘చెరువుల ఆపరేషన్‌’ పూర్తిచేయాలని ఎక్కడికక్కడ తమ వారందరికీ వర్తమానం పంపారు. నిడమర్రు మండలం వెంకటాపురం పరిధిలోనూ పది ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి కొందరు యంత్రాలు, ట్రాక్టర్లతో రంగంలోకి దిగారు. కొల్లేరుకు ఎగువన చేపల చెరువు లీజుకు తీసుకోవాలంటే ఎకరాకు ఏడాదికి రూ.80 వేలు ఖర్చవుతుంది. కానీ కొల్లేరు భూమిని ఆక్రమించి తవ్వకాలు సాగిస్తే ఉచితంగా భూమీ దక్కుతుంది. చేపల పెంపకానికి, వ్యాపారానికి వెసులుబాటూ కురుదుతుంది. తుంది. 


బెడిసి కొట్టిన వ్యూహం..

వందల ఎకరాల్లో కొల్లేరు కబ్జాకు అధికార పార్టీ నేతలు భారీగానే స్కెచ్‌ వేశారు.  ఆఖరికి ఎమ్మెల్యేను కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. ఒక ప్రణాళికా బద్ధంగా చేపల చెరువులు వెలిసేలా డిజైన్‌ చేశారు. నిబంధనల పేరిట అధికారులు అడ్డుకుంటే వారిని ‘మేనేజ్‌’ చేసే ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేకించి వీరమ్మకుంట ప్రాంతంలో సుమారు 400 ఎకరాల్లో వారం వ్యవధిలోనే చేపల చెరువులు వెలిసేలా ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు. కానీ వైసీపీలో కొందరు వర్గాల వారీగా విడిపోవడంతో పరిస్థితి తారుమారైంది. ఒక వర్గం తొలుత 65 ఎకరాల్లో చెరువులు తవ్వుకోవడానికి తమకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసిందని పైకి ప్రచారం చేసుకుంది. కానీ మరో వర్గం దీనికి ససేమిరా వీల్లేదంది. తాము కూడా చేపల చెరువులు తవ్వుకునేలా సాయపడాలని కోరింది. ఈ ఒప్పందాలేవీ కుదరకపోవడంతో కొందరు అధికారులకు ఉప్పందించారు.


అటవీ పరిరక్షణ అధికారులు రంగంలోకి దిగి రెండు యంత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన చెరువు గట్లను ధ్వంసం చేశారు. ఫారెస్ట్‌ బీటు సిబ్బందిని కాపలాకు నియమించారు. ప్రస్తుతానికి వీరమ్మకుంటలో చోటు చేసుకున్న పరిణామాలు అధికారపార్టీలో అగ్గి రాజేశాయి. మరోవైపు ఏలూరు రూరల్‌ మండల పరిధిలోని గుడివాకలంక  సమీపంలోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది. ఇక్కడ కూడా కొందరు గ్రూపులుగా విడిపోయి ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో అక్కడా చెరువుల తవ్వకం ఆరంభంలోనే నిలిచిపోరుంది.

Updated Date - 2020-07-08T07:56:32+05:30 IST