మంజూరుకాని బిల్లు... పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌

ABN , First Publish Date - 2022-05-17T06:43:16+05:30 IST

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో చేపట్టిన వెంకన్నపాలెం-పెదబొడ్డేపల్లి రోడ్లు అభివృద్ధి విస్తరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.

మంజూరుకాని బిల్లు...  పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌
రావికమతం వే బ్రిడ్జి వద్ద ఛిద్రమైన రోడ్డు, ఆగిన విస్తరణ పనులు

మరింత దారుణంగా బీఎన్‌ రోడ్డు


రావికమతం, మే 16: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో చేపట్టిన వెంకన్నపాలెం-పెదబొడ్డేపల్లి రోడ్లు అభివృద్ధి విస్తరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.  మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మార్జిన్‌ను విస్తరించిన కాంట్రాక్టర్‌... బిల్లు మంజూరు కాకపోవడంతో పనులు ఆపేశారు. యంత్ర సామగ్రిని కూడా ఇక్కడి నుంచి తరలించుకుపోవడంతో రోడ్డు విస్తరణ పనులు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి నర్సీపట్నం మునిసిపాలిటీలో పెదబొడ్డేపల్లి వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధితోపాటు ఇరువైపులా మూడు మీటర్ల విస్తరణ పనులకు న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులు రూ.79.81 కోట్లు మంజూరయ్యాయి. ఎస్‌ఆర్‌టీ అనే కంపెనీ కాంట్రాక్టు పొందింది. సుమారు నాలుగు నెలల క్రితం బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం చర్చి నుంచి రావికమతం పెట్రోల్‌ బంకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు.  మూడు కిలోమీటర్ల మేర అసంపూర్తిగా పనులు చేసి వదిలేశారు. మిగిలిన ప్రాంతాల్లో పనులు ప్రారంభించలేదు. బిల్లు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారని స్థానికులు చెబుతున్నారు. కానీ దీనిపై ఆర్‌అండ్‌బీ మాడుగుల జేఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ఇటీవలే ఇక్కడకు వచ్చానని, రోడ్లు నిర్మాణ పనులు ఎందుకు ఆగిపోయాయో తెలియదని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పనులు తిరిగి మొదలు పెట్టడానికి చర్యలు చేపడతానన్నారు.


ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు..

-కె.వరహాలరావు, ఆటో డ్రైవర్‌, రావికమతం

నేను 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. బీఎన్‌ రోడ్డు ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. రోడ్డు మొత్తం గోతులే. తరచూ ఏదో ఒక పార్ట్‌ విరిగిపోతున్నది. తిరిగి బాగు చేయించే వరకు బాడుగ వుండదు. ప్రభుత్వం ‘వాహన మిత్ర’ పథకం పేరుతో సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తుంటే, ఆటో మరమ్మతులకు రూ.15-20 వేలు అవుతున్నాయి.


Updated Date - 2022-05-17T06:43:16+05:30 IST