పుట్టగొడుగుల్లా!

ABN , First Publish Date - 2021-06-14T06:36:52+05:30 IST

అక్రమ లే-అవుట్లు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా అక్రమ లేఅవుట్ల వ్యాపారం సాగిస్తున్నారు. వ్యవసాయ భూములు (వరి, కొబ్బరి తోటలు)లను లే-అవుట్లుగా మార్పుచేసి వాటిలో ప్లాట్లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.

పుట్టగొడుగుల్లా!
మహిపాలచెరువు సమీపంలో వరి పొలాన్ని లేఅవుట్‌గా మారుస్తున్న దృశ్యం

  • ముమ్మిడివరం మండలంలో వెలుస్తున్న అక్రమ లే అవుట్లు

ముమ్మిడివరం, జూన్‌ 13: అక్రమ లే-అవుట్లు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా అక్రమ లేఅవుట్ల వ్యాపారం సాగిస్తున్నారు. వ్యవసాయ భూములు (వరి, కొబ్బరి తోటలు)లను లే-అవుట్లుగా మార్పుచేసి వాటిలో ప్లాట్లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ల్యాండ్‌ కన్వర్షన్లు గానీ, లేఅవుట్ల నిర్మాణానికి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ లే-అవుట్లు వేస్తున్నారు. వీటి నిర్మాణానికి తప్పనిసరిగా ల్యాండ్‌ కన్వర్షన్‌ పొంది పది శాతం భూమిని కమ్యూనిటీ అవసరాలకు కేటాయించి 30 అడుగుల వెడల్పు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. అయితే అటువంటివి ఏమీ లేకుండానే నిర్మాణాలు సాగిస్తున్నారు. ముమ్మిడివరం మండలంలో 216 జాతీయ రహదారిని ఆనుకుని అన్నంపల్లి వద్ద వరి చేనును, మహిపాల చెరువు సెంటర్‌ సమీపంలో వరి పొలాన్ని, నగర పంచాయతీ పరిధిలోని 10వ మైలురాయి సమీపంలో వరి చేనును లే-అవుట్‌గా మార్పుచేశారు. నగర పంచాయతీ పరిధిలో సుమారు 60 లేఅవుట్లు అనధికారికంగా ఉన్నట్టు గుర్తించి నోటీసులు జారీ చేశారు. అయినా వాటిల్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు యథావిధిగానే జరుగుతున్నాయి. భవన నిర్మాణానికి ప్లానింగ్‌ అప్రూవల్‌ కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  


Updated Date - 2021-06-14T06:36:52+05:30 IST