కరోనా నివారణకు యునాని వైద్యం

ABN , First Publish Date - 2021-05-15T05:49:54+05:30 IST

కరోనా నివారణకు యునాని వైద్యం

కరోనా నివారణకు యునాని వైద్యం

 అందుబాటులో శక్తివంతమైన మందులు

 అద్భుతంగా పని చేసే సాఫీ ఔషధం

 ఇమ్యూనిటీ పెంచే రకాలు అనేకం

 ముందు జాగ్రత్తలతోనే కరోనాకు చెక్‌

 ప్రభుత్వ యునాని వైద్యుడు డాక్టర్‌ మహేంద్ర కుమార్‌

హన్మకొండ, మే 14 (ఆంధ్రజ్యోతి) : కరోనా నివారణకు యునాని వైద్యవిధానంలో సమర్ధవంతంగా పని చేసే మందులు ఉన్నాయంటున్నారు డాక్టర్‌ మ హేంద్ర కుమార్‌. హన్మకొండ రాయపురలోని ప్రభుత్వ యునాని ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మహేంద్రకుమార్‌ కరోనా చికిత్సకు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న యునాని మందులు, వాటి వల్ల కలిగే సత్పలితాల గురించి ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు. వివరాలు...  

ప్రశ్న: కరోనా నివారణలో యునానిలో మందులేమైనా ఉన్నాయా?

జవాబు: కరోనా బారిన పడ్డ బాధితులకు అవసరమైన చికిత్సలు చేయడానికి యునానిలో అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కిందటేడు కరోనా మొదటి వేవ్‌ అప్పుడు కూడా చాలామంది రోగులకు యునాని మందులు ఇచ్చాము. వారిలో రోగ నిరోధకశక్తిని పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదం చేశాయి. ప్రస్తుత కరోనా సంక్షోభంలో యునానిలో ‘సాఫీ’ అనే మందు అద్భుతంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ మందుకు డిమాండ్‌ బాగా పెరిగింది. దానితో పాటు ధర కూడా ఎక్కువైంది.

ప్ర: కరోనా నుంచి ఉపశమనానికి యునానిలో ఉన్న మందులేమిటీ?

జ: కొవిడ్‌ రోగులకు యునానిలో సూచించే మందుల్లో పొడి దగ్గుకు హబ్‌-ఈ-సుర్ఫా, ఖమీర-ఎ-బనఫ్ఫా, లౌక్‌-ఎ-సపిస్తన్‌ (మధుమేహ రోగులకు మినహా), జ్వరానికి హబ్‌-ఎ బుఖార్‌, హబ్‌-ఎ- ముబారక్‌, గొంతునొప్పికి షర్బత్‌-ఈ-టూత్‌సియా, శ్వాసపరమైన ఇబ్బందులకు లౌక్‌-ఏ-కతాన్‌, హబ్‌-ఎ-హిందీ జీకీ ఉన్నాయి. కరోనా రోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం  పొందడానికి యునానిలో సద్‌ కూఫీ, ఊడ్‌ సలీబ్‌, జిద్వార్‌ అందుబాటులో ఉన్నాయి. బేదానా (ఆంటాక్సిడెంట్‌), ఉన్నాబ్‌ (యాంటి ఇన్‌ఫ్లూయింజా), సంపిస్తన్‌, కరంజ్వా (యాంటిపైరెటిక్‌), శ్వాససంబంధమైన ఇబ్బందుల ఉపశమనానికి రోగన్‌-ఏ-బబునా, ముక్కుద్వారా పీల్చు కోవడానికి ఆరఖ్‌ - అజీబ్‌ అనే చుక్కల మందు కూడా అందుబాటులో ఉన్నాయి. వైరస్‌ నిరోధానికి కూడా యునానిలో కొన్ని మందులు ఉన్నాయి. కలోంజీ, సీర్‌,  జంజాబీల్‌, అస్లాసస్‌, అఫ్సంటీన్‌, తుక్‌-ఉ-కసూస్‌, ఖయర్‌ శంబర్‌, జిలో తదితర మందులు కూడా ఉన్నాయి. వీటిని యూనాని ఫిజీషియన్‌ పర్యవేక్షణలో వాడాలి. రోగిలో రోగ నిరోధకశక్తిని పెంచే మందుల్లో ఖమీర మార్వరీడ్‌, అస్గంధ్‌ ఉన్నాయి. 

ప్ర: యునాని వైద్యాన్ని ఆచరించేవాళ్లు ఇప్పటికీ ఉన్నారా?

జ: చాలా మంది ఉన్నారు. ఆయుర్వేదానికి,  యునానికి మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆయుర్వేదంలో మందులు ప్రిజర్వేటిక్‌ కోసం కొంచెం ఆల్కహాల్‌ పర్మెంటెండ్‌ ఉంటాయి. యునానిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌ ఉండవు. పూర్తిగా తేనెనే ఉపయోగిస్తారు. ఎన్నేళ్లయినా పాడవకుండా ఉంటాయి. ముస్లింలు ఎక్కువగా యునాని వైద్యాన్ని ఆచరిస్తారు. హిందువులు సైతం ఈ వైద్యం పట్ల మక్కువ చూపుతున్నారు. వృద్ధుల్లో ఎక్కువమంది ఈ వైద్యాన్నే ఇష్టపడతారు. కుష్టాలనీ (భస్మం) ఉంటాయి. కాస్త ఎక్కువగా పవర్‌ఫుల్‌గా ఉంటాయి.

ప్ర: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు యునాని మందులు వాడవచ్చా?

జ: వాడవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి యునాని మందులు దోహదపడతాయి. అందుకే ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం, యునాని, హోమియేపతి తదితర ప్రాచీన వైద్య విధానాలను ఆయుష్‌ అనే పేరుతో ఒక గొడుకు కిందకు తెచ్చింది. ఈ వైద్యా విధానానికి చెందిన  వారంతా కలిసి కశాయంలాంటి ఒక కొత్త మందును తయారు చేశారు. ఇందులో భాగంగానే ఆర్సెనిక్‌ అల్బమ్‌ (హోమియోపతి)  తీసుకుంటే అది కూడా కరోనా రాకుండా అడ్డుకోగలుగుతుంది. కిందటేడు పరీక్షల్లో భాగంగా ఆరువేల మందిని ఎంపిక చేసి మూడు వేల మందికి ఆర్సెనిక్‌ అల్బమ్‌, మిగతా మూడు వేల మందికి కశాయం ఇచ్చారు. ఇందులో 11 మందికి తప్ప మిగతా ఎవరికి కరోనా రాలేదు. ఈ సారి కరోనా వైరస్‌ భిన్నంగా ఉంది. వేరే వేరియంట్లతో వ్యాపించింది. అందువల్ల ఈ ఏడాది దీని మీద పరిశోధనలు గానీ, నివేదికలుగానీ లేవు. పోయిన సారికంటే ఈ సారి వైరస్‌ ప్రమాదకరంగా ఉంది. దీనితో ఆయు్‌షపరంగా పరిశోధనలను ఆపేసి మొత్తంగా వ్యాక్సినేషన్‌పైనే దృష్టిని కేంద్రీకరించారు. 

ప్ర: యునాని డాక్టర్‌గా కరోనా రోగులకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు.

జ: యునాని గానీ ఆయుష్‌ గానీ ప్రాచీన వైద్య విధానం కిం ద పని చేసే అందరమూ ఒకటే చెబుతున్నాము. కరోనా వేరియంట్‌ తీవ్రత దృష్టా అందరు సింగిల్‌ మాస్క్‌ కాకుండా డబుల్‌ మాస్క్‌ ధరించాలి. ప్రతీ రోజు యోగా చేయాలి. డి విటమిన్‌ కోసం సూర్య నమస్కారం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. చేపలు తింటే మంచిది. దీని వల్ల శరీరంలో సహజసిద్ధంగానే కావలసిన ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనితోపాటు రోగనిరోధక శక్తి పెంచే పెంచే మందులనూ వాడాలి. రక్తశుద్ధికి సాఫీ అనే మందును వాడాలి. ఇప్పుడు ఇది కమర్షియల్‌ అయింది. ద్రవరూపంలో ఉండే టానిక్‌ ఇది. అర టీ కప్‌ నీటిలో రెండు చెంచాల సాఫీ కలుపుకొని ఉదయం సాయంత్రం  తీసుకోవాలి. కిరాక్‌-ఏ-నర్సుల, కిరాక్‌- ఎ- ఆల్జీమ్‌ వంటి మందులు జులుబు, దగ్గు వంటి రుగ్మతలను తగ్గిస్తుంది. వీటిని వాడడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. 


Updated Date - 2021-05-15T05:49:54+05:30 IST