తక్కువ ఖర్చులో... దుష్ప్రభావాలు లేకుండా...

ABN , First Publish Date - 2022-03-01T19:02:45+05:30 IST

ఖర్చు, దుష్ప్రభావాలు.. ఈ రెండూ లేని వైద్య చికిత్స ఉండదు. అయితే మూలికలతో కూడిన యునాని వైద్యం ఇందుకు పూర్తి మినహాయింపు. మరీ ముఖ్యంగా స్త్రీల సమస్యలకు

తక్కువ ఖర్చులో... దుష్ప్రభావాలు లేకుండా...

ఆంధ్రజ్యోతి(01-03-2022)

ఖర్చు, దుష్ప్రభావాలు.. ఈ రెండూ లేని వైద్య చికిత్స ఉండదు. అయితే మూలికలతో కూడిన యునాని వైద్యం ఇందుకు పూర్తి మినహాయింపు. మరీ ముఖ్యంగా స్త్రీల సమస్యలకు యునాని వైద్య విధానంలో సమర్థమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు యునాని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్‌ షాజహాన్‌ బేగం.


యునాని వైద్య విధానం ప్రధానంగా శరీర ద్రవాల ఆధారంగా పని చేస్తుంది. కఫం (బల్గమ్‌), రక్తం (ఖూన్‌), పసుపుపచ్చ బైల్‌ స్రావం (సఫ్రా), నలుపు బైల్‌ స్రావం (సౌదా)... ఈ నాలుగు శరీర ద్రవాల నాణ్యతలు, పరిమాణాల్లో, తత్వాల్లో తేడాలు చోటు చేసుకున్నప్పుడు శరీరంలో రుగ్మతలు ఏర్పడతాయి. అవి లక్షణాల రూపంలో బయల్పడినప్పుడు, వాటి తీవ్రత ఆధారంగా, రోగి భౌతిక రూపం ఆధారంగా, చలి, వేడిలకు శరీరం స్పందించే తీరు, వయసుల ఆధారంగా యునాని చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. చికిత్సలో భాగంగా వారి వారి శరీర తత్వాలను బట్టి అవసరమైన మందులను అప్పటికప్పుడు తయారుచేసి అందించడం యునాని వైద్య విధానం ప్రత్యేకత. యునాని మందులన్నీ పూర్తిగా మూలికల నుంచే తయారవుతాయి. కాబట్టి ఇతర మందుల మాదిరిగా వీటికి దుష్ప్రభావాలు లేకపోవడం మరో విశేషం. 


పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పిసిఒడి)

అమ్మాయిలు మెచ్యూర్‌ అయిన రెండు, మూడు నెలల నుంచే పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ బారిన పడుతున్నారు. టీనేజ్‌ నుంచి పునరుత్పత్తి వయసు 35-40 ఏళ్ల మహిళలు ఎక్కువగా ఈ రుగ్మతకు గురవుతూ ఉంటారు. అండాశయాల పైన సిస్ట్‌లు ఏర్పడడం మూలంగా నెలసరి క్రమం తప్పుతుంది. రెండు నుంచి మూడు నెలలకోసారి నెలసరి వస్తూ ఉంటుంది. బరువు పెరగడంతో పాటు, చుబుకం, పైపెదవుల మీద వెంట్రుకలు పెరిగే హిర్సుటిజం లక్షణాలు మొదలవుతాయి. హైపోథైరాయిడ్‌ సమస్య కూడా కొందర్లో ఉంటుంది. పిసిఒడి ప్రధానంగా కఫం, నలుపు బైల్‌ డిజార్డర్‌. అయినప్పటికీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించి, ఫలితాలను బట్టి కఫం, బ్లాక్‌ బైల్‌ లోటుపాట్లను సరిదిద్దే చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. చికిత్సలో భాగంగా మూడు నెలల పాటు మందులు వాడవలసి ఉంటుంది. మందులు వాడినంత కాలం కొవ్వుతో కూడిన పదార్థాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, దుంప కూరగాయలు తినకూడదు. 


డిస్‌ఫంక్షనల్‌ యుటెరైన్‌ బ్లీడింగ్‌ (డియుబి)

ఈ రుగ్మత రక్తం, నల్లని బైల్‌ల సమస్యకు సూచన. నెలసరిలో అధిక రక్తస్రావంతో పాటు నెలలో రెండు నుంచి మూడుసార్లు నెలసరి  స్రామవయ్యే ఈ రుగ్మతను సాధారణంగా ఎడినొమయాసిస్‌, యుటెరస్‌ ఫైబ్రాయుడ్‌ రుగ్మతలుగా వైద్యులు నిర్థారిస్తారు. కొంత మంది మహిళలు సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందడం కోసం గర్భాశయాన్ని తొలగించుకునే హిస్టరెక్టమీని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ యునాని వైద్యం ఈ రుగ్మతను రక్తం, నలుపు బైల్‌.. ఈ రెండిటి సమస్యగా భావిస్తుంది.


సర్జరీతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా హ్యూమస్‌ హెచ్చుతగ్గులను సరిదిద్దే చికిత్సతో రక్తస్రావాన్ని అదుపు చేసుకోవచ్చు. స్కానింగ్‌తో సమస్యను గుర్తించిన తర్వాత మందులను వైద్యులు ఎంచుకుంటారు. ఎడినొమయాసిస్‌, ఫైబ్రాయిడ్లకు నోటి మందులతో పాటు లోకల్‌ పెసరీస్‌లను కూడా వాడుకోవలసి ఉంటుంది. ఈ మందులను నెలలో పది రోజుల పాటు మూడు నెలలు వాడాలి. నోటి మందులను మూడు నుంచి నాలుగు నెలల పాటు తీసుకోవాలి. మందులు వాడినంత కాలం ఆహారంలో కారం, మసాలాలు తగ్గించుకోవాలి.


పిసిఒడితో కూడిన ఇన్‌ఫెర్టిలిటీపిసిఒడిని సరిదిద్దడంతో నెలసరి క్రమబద్ధమైనప్పటికీ కొందరు మహిళలు గర్భం దాల్చలేరు. ఇలాంటి వారిలో అండాశయాల్లో తయారయ్యే ఫాలికల్స్‌ను బలపరిచే సపోర్టివ్‌ మందులు ఇవ్వడం ద్వారా గర్భధారణ జరిగేలా చేయవచ్చు. ఇలాంటి సపోర్టివ్‌ మెడిసిన్స్‌ వల్ల గర్భం దాల్చే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ మందులు వాడే సమయంలో కూడా ఆహార నియమాలు పాటించక తప్పదు. 


పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌

కటి ప్రదేశంలోని అంతర్గత అవయవాలైన గర్భాశయం, ఫెలోపియన్‌ ట్యూబ్‌లు, అండాశయాలు, వెజైనాలలో ఇన్‌ఫెక్షన్‌లు ఈ కోవకు చెందుతాయి. బైల్‌, రక్తంలో తేడాలు చోటు చేసుకోవడం మూలంగా మహిళలు ఈ రుగ్మతల బారిన పడతారు. పొత్తికడుపు నొప్పి, బరువు, వైట్‌ డిశ్చార్జ్‌, దుర్వాసనతో కూడిన స్రావాలు, బలహీనత లాంటి లక్షణాలు ఈ రుగ్మతలో ఉంటాయి. ఈ లక్షణాలతో పాటు భౌతిక పరీక్ష ఆధారంగా సమస్య తీవ్రతను వైద్యులు అంచనా వేసి, బైల్‌ లోపాన్ని సమం చేసే యునాని మందులను సూచిస్తారు. ప్రధానంగా రక్తశుద్ధి మందులను సూచించడంతో పాటు, కొన్ని రకాల మందులు కలిపి మరిగించిన నీటితో వైద్యులే జననాంగాలను శుభ్రం చేస్తారు. ఇలా పది రోజుల పాటు ప్రతి రోజూ చేయించుకోవలసి ఉంటుంది. రెండు నెలల్లోనే ఫలితం కనిపిస్తుంది. మాత్రలు, సిరప్‌లు, హల్వాల రూపంలో యునాని మందులు ఉంటాయి. కొందరికి వైద్యులు పైపూత మందులనూ సూచిస్తారు. మందులు వాడినంత కాలం అవసరం మేరకు ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది.


సర్జరీలు ఉండవు

ఎడినొమయాసిస్‌, ఫ్రైబ్రాయిడ్లు, ఇన్‌ఫెర్టిలిటీ మొదలైన సమస్యలు నేటి మహిళల్లో పెరుగుతున్నాయి. వీటన్నింటికీ అల్లోపతి చికిత్సా విధానంలో మందులతో పాటు సర్జరీల పాత్ర కూడా ఉంటుంది. అలాగే చికిత్సకూ, మందులకూ అయ్యే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ మందులు అన్ని చోట్లా అందుబాటులో ఉండవు. పైగా వీటి దుష్ప్రభావాలను కూడా భరించవలసి ఉంటుంది. యునానీ వైద్యంలో సర్జరీ పాత్ర ఉండదు. కేవలం మందులతోనే సర్జరీ అవసరం లేకుండా సమస్య అదుపులోకి వస్తుంది. మందులు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. ఎటువంటి దుష్ప్రభావాలూ లేని ఈ మందులు ఇంగ్లీషు మందుల కంటే ఎంతో చవక కూడా. సాధారణంగా ఇన్‌ఫెర్టిలిటీ (గర్భం దాల్చలేని) సమస్యలు ఉన్న మహిళలకు అల్లోపతి వైద్య విధానంలో ఐ.వి.ఎఫ్‌ (కృత్రిమ గర్భధారణ)ను వైద్యులు సూచిస్తూ ఉంటారు. యునాని వైద్యంలో ఐ.వి.ఎఫ్‌కు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇన్‌ఫెర్టిలిటీ సమస్యను పరిష్కరించుకునే వీలుంది. 


డాక్టర్‌ షాజహాన్‌ బేగం,

యునాని గైనకాలజిస్ట్‌,

నిజామియా టిబ్బి కాలేజ్‌ అండ్‌ జనరల్‌ హాస్పిటల్‌,

చార్మినార్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-03-01T19:02:45+05:30 IST