Abn logo
Sep 27 2021 @ 16:02PM

అన్అకాడమీ టీచర్ జాత్యహంకార వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : విద్యారంగంలో స్టార్టప్ కంపెనీ అన్అకాడమీ ఫ్యాకల్టీ సిద్ధార్థ్ సింగ్ ఈశాన్య రాష్ట్రాల గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో అన్అకాడమీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 


అడవుల్లోని చెట్లను నరికి, వాటిని కాల్చేసి, ఆ భూమిలో గిరిజనులు కొంత కాలం సాగు చేస్తూ ఉంటారు. ఈ సాగు విధానాన్ని ఝూమ్ కల్టివేషన్ అంటారు. దీనిపై అన్అకాడమీ నిర్వహించే మిషన్ ఐఏఎస్ 2021, జాగ్రఫీ తరగతుల్లో సిద్ధార్థ్ సింగ్ పాఠాలు బోధిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ సాగు విధానంపైనా, గిరిజనులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. 


‘‘ఝూమ్ కల్టివేషన్‌ సమయంలో జరుగుతున్నదేమిటంటే, మనకున్నారు ఈ గిరిజనులు, వీరికి బుర్ర లేదు, ఆస్తి లేదు, భూమి దస్తావేజులు లేవు’’ అని సిద్ధార్థ్ సింగ్ అన్నట్లు కనిపించే వీడియో వైరల్ అయి, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వీడియోను అన్అకాడమీ తొలగించింది. 


అన్అకాడమీ టీచర్ వ్యాఖ్యలను ఖండించాలని టీఐపీఆర్ఏ చైర్మన్ ప్రద్యోత్ డెబ్బర్మ ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇప్పటికీ దేశంలో జాత్యహంకారం కొనసాగుతోందని ఆరోపించారు. 


ఇదిలావుండగా, అన్అకాడమీ ఓ ప్రకటనలో ఈ సంఘటనపై బేషరతుగా విచారం వ్యక్తం చేసింది. తమ అంతర్గత మార్గదర్శకాల ప్రకారం సిద్ధార్థ్ సింగ్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఒరిజినల్ వీడియోను తొలగించినట్లు తెలిపింది.