ఒత్తిడి తట్టుకోలేక!

ABN , First Publish Date - 2022-09-23T05:41:54+05:30 IST

ఒత్తిడి తట్టుకోలేక!

ఒత్తిడి తట్టుకోలేక!

- గుండెపోటుకు గురవుతున్న పోలీసులు

- అమలుకాని వారాంతపు సెలవు

- సిబ్బంది కొరతే కారణమంటున్న అధికారులు

(రణస్థలం)

- కవిటి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కర్రి కోదండరావు మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 50 సంవత్సరాలే. ఇటీవల హెచ్‌సీగా పదోన్నతి రాగా.. కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. కానీ ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురై మృతిచెందడంతో విషాదంలో మునిగిపోయారు.  


- లావేరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రొక్కం దినేష్‌కుమార్‌ ఈ నెల 25న గుండెపోటుతో మృతిచెందాడు. అప్పటివరకూ తోటివారితో ఆనందంగా గడిపిన ఆయన మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఆయన వయసు 38 సంవత్సరాలే. 


-  రణస్థలంలో రమణ అనే హోంగార్డు ఈ ఏడాది మే నెలలో గుండెపోటుతో మృతిచెందాడు. విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఆయన వయసు 42 సంవత్సరాలే. 


..ఇలా పోలీస్‌ శాఖలో సిబ్బంది చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్నారు. సిబ్బంది కొరత, వారాంతపు సెలవులు లేకపోవడం, పని ఒత్తిడితో సతమతమవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో వరుస ఘటనలతో పోలీస్‌ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. 


ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో మూడు సబ్‌ డివిజన్ల పరిధిలో 12 సర్కిళ్లుగా విభజించారు. జిల్లావ్యాప్తంగా  42 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు సీసీఎస్‌, మహిళా, ట్రాఫిక్‌, మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు సుమారు 40 మంది సిబ్బంది అవసరం కాగా.. అరకొరగానే ఉన్నారు. ఏ స్టేషన్‌లోనూ పూర్తిస్థాయి సిబ్బంది లేరు. జిల్లావ్యాప్తంగా 22 మంది సీఐలు, 120 మంది ఎస్‌ఐలు, 138 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు 365 మంది, కానిస్టేబుళ్లు 1,200 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు 850మంది హోంగార్డులు సేవలందిస్తున్నారు. జిల్లాలో ఇటీవల దొంగతనాలు, అక్రమాలు భారీగా పెరిగాయి. మరోవైపు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇంకోవైపు ట్రాఫిక్‌ సమస్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సిబ్బంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. జిల్లాలో ఇసుక, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ, వాహన తనిఖీలు చేపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రముఖులకు బందోబస్తు తదితర  బాధ్యతలతో సతమతమవుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా అదనపు విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర, అనారోగ్య సమయాల్లో సెలవు కోసం స్టేషన్‌ అధికారి అనుమతిస్తేనే సిబ్బందితో సర్దుబాటు చేసుకుంటున్నారు. అటు శాఖపరమైన శిక్షణలు తగ్గిపోయాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించేందుకు నిపుణులతో వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉన్నా.. ఎక్కడా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. శారీరకంగా ఒత్తిడి తగ్గించేందుకు మాక్‌ డ్రిల్‌ వంటివి కూడా లేవు. వేతనం కూడా మిగతా శాఖలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇవన్నీ పోలీసుల ఒత్తిడికి కారణమవుతున్నాయి. 


కాగితాల్లోనే ‘వీక్లీ ఆఫ్‌’

సాధారణంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఆదివారం సెలవు ఉంటుంది. ఇతర పండుగల సమయంలో కూడా సెలవులు లభిస్తాయి. పోలీస్‌ శాఖలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. క్షణం తీరిక లేని విధులతో సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు. సెలవులు లేక సతమతమవుతున్నారు. ప్రభుత్వం వీక్లీ ఆఫ్‌ ప్రకటించినా ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం ఈ జీవో కాగితాలకే పరిమితమైందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పండుగ సమయాల్లో కూడా కుటుంబ సభ్యులతో హాయిగా గడిపే యోగ్యం తమకు లేదని కొంతమంది పోలీసులు వాపోతున్నారు. హక్కులపై గొంతు ఎత్తే స్వేచ్ఛ కూడా తమకు లేదని మరికొంతమంది నిట్టూర్చుతున్నారు. మరోవైపు సిబ్బంది కొరత వల్లే వారంతపు సెలవులు ఇవ్వలేకపోతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకాలు చేపట్టాలని, ‘వీక్లీ ఆఫ్‌’ అమలయ్యేలా చూడాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


వ్యాయామం అవసరం 

రెగ్యులర్‌గా గంటపాటు వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం. పోలీస్‌ ఉద్యోగంలో చేరినప్పుడు ఫిట్‌నెస్‌ తరువాత ఉండదు. స్మోకింగ్‌, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి గురైనప్పుడే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పోలీసుల్లో నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు కొంత వరకు మార్చుకోవాలి.

 - డాక్టర్‌ సుమన్‌, వైద్యాధికారి, రావాడ పీహెచ్‌సీ 


అమలు చేస్తున్నాం

పోలీస్‌ శాఖ సిబ్బందికి ప్రభుత్వం వీక్లీఆఫ్‌ ప్రకటించిన మాట వాస్తవమే. అన్ని పోలీస్‌స్టేషన్లలో వారాంతపు సెలవులను అమలు చేస్తున్నాం. కేసులు అధికంగా ఉన్న సమయాల్లో మాత్రం ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉంది. అయినా ఉన్నంతలో శాంతిభద్రతలను కాపాడుతున్నాం. నేర నియంత్రణకు కృషి చేస్తున్నాం.

    - మహేంద్రుడు, డీఎస్పీ, శ్రీకాకుళం.

Updated Date - 2022-09-23T05:41:54+05:30 IST