దిగుబడులు విక్రయించుకోలేక..!

ABN , First Publish Date - 2020-03-31T12:25:03+05:30 IST

కరోనా దెబ్బకు పూలు, పంట దిగుబడులను విక్రయించుకోలేక నగరిప్రాంత రైతులు అయోమయంలో పడ్డారు.

దిగుబడులు విక్రయించుకోలేక..!

ఆందోళన చెందుతున్న నగరి రైతులు


నగరి, మార్చి 30: కరోనా దెబ్బకు పూలు, పంట దిగుబడులను విక్రయించుకోలేక నగరిప్రాంత రైతులు అయోమయంలో పడ్డారు. మండలంలోని మిట్టపాళెం, చిన్నతాంగేళ్‌, మూలనత్తం, అడవికొత్తూరు, కృష్ణాపురం, ఎంఎన్‌ కండ్రిగ, ఎంకేకండ్రిగ తదితర గ్రామాల్లో మల్లె, సంపంగి, రోజా పూల సాగు జరుగుతోంది. ఏటా మార్చి నుంచి మే వరకు అధికంగా పూల దిగుబడులు వస్తుంటాయి.


ఈ సీజన్‌లో శుభకార్యాలతోపాటు, ఉగాది, శ్రీరామనవమి పండుగలు, గంగజాతరలు ఉన్నందున వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు రైతుల లాభాలకూ ఢోకా ఉండదు. ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్‌తో ప్రధాన మార్కెట్లుగా ఉన్న చెన్నై, తిరుపతి, తిరుత్తణి, వేలూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో పూలమండీలు, చిన్న దుకాణాలు వారం రోజులుగా మూతపడడం సమస్యగా మారింది. విక్రయాల్లేక పోవడంతో అధికశాతం రైతులు తోటల్లోనే పూలను వదిలేస్తూ నష్టాలపాలవుతున్నారు. ఇక వ్యాపారులు రాకపోవడం తదితర కారణాలతో వరి రైతులకూ నష్టాలు తప్పడం లేదు. నూర్పిళ్లు పూర్తి చేసినా, పొలాల్లోనే ధాన్యం ఉండిపోవడంపై అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-03-31T12:25:03+05:30 IST