పోలీస్ స్టేషన్‌లో మూషికాల ఆట.. మార్జాల మారాజుల వేట!

ABN , First Publish Date - 2022-06-27T00:25:12+05:30 IST

కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీబదనూర్ రూరల్

పోలీస్ స్టేషన్‌లో మూషికాల ఆట.. మార్జాల మారాజుల వేట!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీబదనూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌‌కు ఇప్పుడో కొత్త చిక్కొచ్చి పడింది. ఇక్కడి పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో కంటే స్టేషన్‌లోని ఎలుకలను పట్టుకోవడంలోనే బిజీగా ఉంటారు. వారు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా, ఎన్ని రకాల వ్యూహాలు పన్నినా మూషికాలు (Rats) వారికి చిక్కుకుండా చిందులు తొక్కుతూనే ఉన్నాయి. ముఖ్యమైన ఫైళ్ల పనిపడుతూనే ఉన్నాయి. ఇక తమ వల్ల కాదని డిసైడైపోయిన పోలీసులు వాటి పనిపట్టేందుకు రెండు పిల్లుల్ని (Cats) తీసుకొచ్చి మోహరించారు.  


ఈ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే చిన్న చెరువు ఉందని, కాబట్టి ఎలుకలన్నీ తమ పోలీస్ స్టేషన్‌‌ను సేఫ్ ప్లేస్‌గా ఎంచుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారు. దీంతో తమకు సమస్యలు మొదలయ్యాయని, ముఖ్యమైన ఫైళ్లను కొరికిపారేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు.


వాటి పని పట్టేందుకు తొలుత ఒక పిల్లిని తెచ్చి స్టేషన్‌లో పెట్టామని, ఫలితంగా ఎలుకల ఇబ్బంది కొంత తగ్గిందని చెప్పుకొచ్చారు. అయితే, వాటి పీడను పూర్తిగా తొలగించుకునేందుకు ఇటీవలే మరో మార్జాలాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. ఇప్పటి వరకు అవి మూడు ఎలుకల్ని చంపి పారేశాయని చెప్పారు. వాటికి పాలు, ఆహారం అందిస్తున్నామని, ఇప్పుడవి పోలీస్ స్టేషన్‌లో కలివిడిగా తిరుగుతూ తమతో కలిసి పోయాయని విజయ్ కుమార్ పేర్కొన్నారు. 


కర్ణాటకలో దోమలు, ఎలుకల బెడద బాగానే ఉంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు పలు ప్రభుత్వ కార్యాలయాలు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (KEA) ఏడాదికి రూ. 50 వేలు ఖర్చు చేస్తోంది. 2010-15 మధ్య ఎలుకలు పట్టుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ. 19.34 లక్షలు ఖర్చు చేసినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-06-27T00:25:12+05:30 IST