Congo లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న భారతీయ దళాలకు UNO ప్రశంసలు

ABN , First Publish Date - 2022-05-27T23:47:47+05:30 IST

కాంగోలో అమాయక పౌరులపై దాడులకు ప్రయత్నిస్తున్న ఎం23 సాయుధ గ్రూపుని క్రియాశీలకంగా నిలువరిస్తున్న భారతీయ దళాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.

Congo లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న భారతీయ దళాలకు UNO ప్రశంసలు

న్యూయార్క్ : కాంగోలో అమాయక పౌరులపై దాడులకు ప్రయత్నిస్తున్న సాయుధ గ్రూపు ఎం23 ని క్రియాశీలకంగా నిలువరిస్తున్న భారతీయ దళాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఐరాస శాంతి ఆపరేషన్‌లో భాగస్వామ్యం అందిస్తున్న ఇతర దేశాల బలగాలను కూడా కొనియాడింది. శాంతిని నెలకొల్పేందుకు అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగోలో అమాయక పౌరులపై దాడులను  అడ్డుకోవడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఐరాస సెక్రటరీ-జనరల్ ఫర్ పీస్ ఆపరేషన్స్ జీన్-పియరీ లాక్రోయి మెచ్చుకున్నారు. పశ్చిమ కాంగోలో రెండు వారాలుగా ఎం23 సాయుధ గ్రూప్ దాడులకు క్రీయాశీలక ప్రయత్నాలు చేస్తోందని జీన్-పియరీ వెల్లడించారు. ఈ గ్రూప్ దాడులను భారత్ సహా ఇతర దేశాల బలగాలు సమర్థవంతంగా నిలువరిస్తున్నాయని చెప్పారు.


కాగా ఐరాస శాంతి పున:స్థాపన మిషన్లలో భారీ సైనిక సహకారాన్ని అందిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఎంవోఎన్‌యుఎస్‌సీవో (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో)కు సైనిక దళాల సహకారంలో మిలిటరీ(1,888)పరంగా 2వ స్థానం, పోలీస్(139) పరంగా 5వ స్థానాల్లో భారత్ ఉంది. 

Updated Date - 2022-05-27T23:47:47+05:30 IST