Abn logo
Nov 21 2020 @ 18:53PM

ఇష్టంలేని పెళ్లి చేశారని యువకుడి ఆత్మహత్యాయత్నం

 పోలీసులు కూడా వేధించారంటూ ఆరోపణ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఘటన


సత్తుపల్లి, నవంబరు 20: పెద్ద మనుషులు తనకు ఓ బాలికతో ఇష్టం లేని పెళ్లి చేశారని, ఈ విషయంలో వేంసూరు పోలీసులు కూడా తనను వేధించారన్న ఆవేదనతో ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన మొండ్రు అశోక్‌కుమార్‌ గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అతడిని సత్తుపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించటంతో శుక్రవారం విజయవాడకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలానికి చెందిన ఓ బాలికను ప్రేమించి, ఆమెను గర్భవతిని చేశాడన్న ఆరోపణతో వేంసూరు పోలీసులు అశోక్‌కుమార్‌ను స్టేషన్‌కు పిలిపించారని అశోక్‌కుమార్‌ తల్లి తెలిపారు. ఈ బాలికను పెళ్లిచేసుకోవాలని ఎస్‌ఐ మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించారు. ఈ మేరకు బాలిక తరపు పెద్దమనుషులు ఈ నెల 18న మర్లపాడులోని సాయిబాబా ఆలయంలో బలవంతంగా పెళ్లి చేశారని, బాలికతో పెళ్లి ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీంతో తాను చేయని తప్పును తనపై వేసి బలవంతంగా పెళ్లి చేశారన్న కారణంతో మనస్తాపానికి గురైన తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆశోక్‌కుమార్‌ తల్లి ఆరోపించారు.


కౌన్సెలింగ్‌ మాత్రమే ఇచ్చాం : ఎస్‌ఐ 

బాలికతో తరచూ అశోక్‌కుమార్‌ మాట్లాడుతున్నాడని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అతడిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామని వేంసూరు ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపారు. అనంతరం ఇరు వర్గాల కుటుంబ సభ్యులతో మాట్లాడామని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అశోక్‌కుమార్‌, అతడి కుటుంబ సభ్యులు చెప్పడంతో బాలిక తండ్రి తన ఫిర్యాదును విరమించుకున్నారని తెలిపారు. ఆ తరువాత ఏం జరిగిందనే విషయం తమకు తెలియదని, అశోక్‌కుమార్‌ను ఏ రకంగానూ వేధించలేదని, స్టేషన్‌లో పెళ్లి ప్రస్తావన రాలేదని ఎస్‌ఐ వివరించారు. 

Advertisement
Advertisement