భారత్‌పై ఐరాస హక్కుల ఛీఫ్‌ విమర్శ

ABN , First Publish Date - 2020-10-21T10:27:43+05:30 IST

భారత్‌లో హక్కుల కోసం పోరాడే కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం, హక్కుల సంస్థలు, ఎన్‌జీవోలు విదేశీ విరాళాలు స్వీకరించడంపై

భారత్‌పై ఐరాస హక్కుల ఛీఫ్‌ విమర్శ

జెనీవా, అక్టోబరు 20: భారత్‌లో హక్కుల కోసం పోరాడే కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం, హక్కుల సంస్థలు, ఎన్‌జీవోలు విదేశీ విరాళాలు స్వీకరించడంపై ఆంక్షలు విధించడం సరికాదని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషనర్‌ మిషేలీ బ్యాచ్‌లెట్‌ విమర్శించారు. ’గత కొద్ది నెలలుగా హక్కుల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసినా, గళమెత్తినా చట్ట-వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేస్తున్నారు. అసలీ చట్టమే హక్కుల ఉల్లంఘనను ప్రస్ఫుటిస్తోంది.


ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఈ మధ్య 83-ఏళ్ల స్టాన్‌ స్వామి అనే క్రైస్తవ మతగురువును అరెస్ట్‌ చేశారు. స్వేచ్ఛగా భావాలను ప్రకటించేవారికి, సమావేశాలు పెట్టి తమ అభిప్రాయాలు చెప్పేవారికి అవకాశమివ్వాలి’ అని ఆమె కోరారు. ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన విదేశీ-విరాళాల నియంత్రణ చట్టం- ఎఫ్‌సీఆర్‌ఏని  కూడా మిషేలీ తప్పుబట్టారు. అయితే ఆమె వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ’చట్టాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థకు లోబడి సాగుతున్న రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ మాది. చట్టాలు చేసుకోవడం మా సార్వభౌమాధికారం. ఇందులో వేరెవ్వరూ వేలుపెడితే సహింమని విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఘాటుగా బదులిచ్చారు. 

Updated Date - 2020-10-21T10:27:43+05:30 IST