అమ్మో.. ఆంధ్రా!

ABN , First Publish Date - 2022-08-07T07:46:04+05:30 IST

అమ్మో.. ఆంధ్రా!

అమ్మో.. ఆంధ్రా!

జడుసుకుంటున్న పారిశ్రామిక వేత్తలు

పెట్టుబడులు పెట్టేందుకు విముఖత

రాష్ట్రంలో మారిన పరిస్థితులే కారణం

సూటిగా స్పష్టంచేసిన వేదాంత చైర్మన్‌

ప్రభుత్వం మారగానే విధానాల మార్పు

అందుకే ఏపీకి ఎవరూ వెళ్లడం లేదు

సెమీ కండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు

పరిశీలనలో కర్ణాటక, మహారాష్ట్ర: అనిల్‌


దక్షిణాదిలో... తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు! ఆపైకి వెళితే... గుజరాత్‌, మహారాష్ట్ర! భారీ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టాలనుకునే వారు ‘పరిశీలిస్తున్న’ రాష్ట్రాల్లో ఇవే టాప్‌! మరి... ఆంధ్రప్రదేశ్‌ మాటేమిటి? అని ప్రశ్నిస్తే... ‘అయ్య బాబోయ్‌! ఆ రాష్ట్రానికి రాలేము’ అని పారిశ్రామిక వేత్తలు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు! ఇదీ... జగన్‌ సర్కారు జాతీయ స్థాయిలో దక్కించుకున్న ‘ఖ్యాతి’!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొత్త పెట్టుబడులు రావడంలేదు. ఉన్నవి కూడా తరలిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరి, కొంత మేరకు కొలిక్కి వచ్చినవి, పనులు కూడా ప్రారంభిస్తున్నవి మినహాయిస్తే... కొత్తగా వస్తున్న పరిశ్రమలే లేవు! వస్తాయనే ఆశలూ కనిపించడంలేదు. దీనికి కారణం... జగన్‌ సర్కారు విధానాలపై జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తలు ఏమాత్రం సంతృప్తితో లేకపోవడమే! దీనికి తాజా నిదర్శనం... వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు. ‘‘ప్రభుత్వం మారగానే విధానాలను మార్చకూడదు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకోవడంలేదు. ఎందుకంటే... అక్కడి ప్రభుత్వం తన విధానాలను మారుస్తూ ఉంటుంది’’ అని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సెమీ కండక్టర్‌ చిప్‌ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న సానుకూలతలను వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


భారీ పెట్టుబడి...

వేదాంత గ్రూప్‌ ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థ.  సెమీ కండక్టర్‌ చిప్‌లు, డిస్‌ప్లే గ్లాస్‌ల పరిశ్రమ ఏర్పాటుకు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా 2000 కోట్ల డాలర్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పరిశ్రమను కర్ణాటక లేదా మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావిస్తోంది. భూమి కేటాయింపు, రాయితీలు, ఇతర అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  స్పష్టమైన పాలసీని కూడా రూపొందించి... వేదాంతను తమ రాష్ట్రానికి ఆహ్వానించింది. కర్ణాటక కూడా ఈ రేసులో నిలిచింది. రాయితీలు, ఇతర అంశాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో చర్చించేందుకు వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ శుక్రవారం బెంగళూరుకు వచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం, ప్రభుత్వ విధానాల గురించి ప్రస్తావిస్తూ... పరిశ్రమల ఏర్పాటుకు తాము ఆంధ్రప్రదేశ్‌ను ఏ కోశానా పరిశీలించడంలేదని పరోక్షంగా చెప్పారు. ‘‘సెమీకండక్టర్ల పరిశ్రమ తమ రాష్ట్రంలోనే పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం కోరుకుంటోంది. నిజానికి... పెద్దస్థాయిలో రాయితీలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతుంటాయి. కానీ, పరిశ్రమ ఏర్పాటుతో మాకు ఇచ్చిన రాయితీలకంటే పదిరెట్ల ప్రయోజనం రాష్ట్రానికి చేకూరుతుంది. అదే సమయంలో... పారిశ్రామిక విధానానికి సంబంధించి కేబినెట్‌ ఆమోదంతో స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వం మారగానే విధానాలు మార్చకూడదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చేస్తున్నందునే అక్కడికి ఎవరూ వెళ్లాలనుకోవడంలేదు’’ అని అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.


తిరగదోడిన ఫలితం... 

వేదాంత గ్రూప్‌ రాష్ట్రానికి కొత్తేమీ కాదు. 2018లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. వైసీసీ ప్రభుత్వం  రాగానే పరిస్థితులు మారిపోయాయి. విశాఖలో వరుసగా మూడేళ్లపాటు జరిగిన పారిశ్రామిక ఒప్పందాలను తిరగదోడటం మొదలైంది. ‘అంత భూమి మీకు అక్కర్లేదు. భూమిని అంత తక్కువకు ఇవ్వలేం. మీరు కొత్త ప్రతిపాదనలతో  మళ్లీ రండి’ అంటూ రకరకాల కొర్రీలు పెట్టారు. పారిశ్రామిక వేత్తలను విసిగించారు. దీంతో.. చాలా ఒప్పందాలు తెరపైకి రాలేదు. సౌర, పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను రద్దు చేయాలన్న నిర్ణయం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి పెను విఘాతంగా మారింది. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. పలు దేశాలు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి  తీసుకొచ్చాయి. ‘ఇలాగైతే మీ దేశంలో పెట్టుబడులు పెట్టలేం’ అని స్పష్టం చేశాయి. పీపీఏల రద్దు సరికాదని రాష్ట్రాన్ని కేంద్రం సూటిగా హెచ్చరించింది. దీనిపై పలు సంస్థలు కోర్టుకు వెళ్లాయి. ‘ప్రభుత్వాలు మారగానే విధానాలు మార్చడం కుదరదు’ అని కోర్టు తెలిపింది. రివర్స్‌ టెండరింగ్‌తో కాంట్రాక్టు సంస్థలను మార్చడం కూడా వివాదాస్పదమైంది. అప్పటి నుంచే ఏపీ పట్ల పారిశ్రామిక వేత్తల్లో విముఖత ఏర్పడింది. ఇప్పటిదాకా అంతర్గతంగా మాత్రమే దీనిపై చర్చ జరిగేది. ఇప్పుడు... వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పేశారు.

Updated Date - 2022-08-07T07:46:04+05:30 IST