వారికోసం ఓ మాట్రిమోనీ యాప్‌!

ABN , First Publish Date - 2020-12-23T05:30:00+05:30 IST

అమ్మాయికి ఓ మంచి సంబంధం వెతికిపెట్టేందుకు ఇప్పుడు రకరకాల మ్యాట్రిమోనీ సంస్థలు ఉన్నాయి. అబ్బాయికి తగిన వధువును ఎంపిక చేసుకునే అవకాశం కల్పించే మ్యాట్రిమోనీ యాప్‌లు ఉన్నాయి

వారికోసం ఓ మాట్రిమోనీ యాప్‌!

అమ్మాయికి ఓ మంచి సంబంధం వెతికిపెట్టేందుకు ఇప్పుడు రకరకాల మ్యాట్రిమోనీ సంస్థలు ఉన్నాయి. అబ్బాయికి తగిన వధువును ఎంపిక చేసుకునే అవకాశం కల్పించే మ్యాట్రిమోనీ యాప్‌లు ఉన్నాయి. మరి ట్రాన్స్‌జెండర్ల మాటేమిటి? ఇలాగే ఆలోచించారు ముంబయికి చెందిన సిర్జీష్‌. ట్రాన్స్‌జెండర్ల కోసం ‘ఉమీద్‌ మ్యాట్రిమోనీ’ పేరుతో యాప్‌ను ప్రారంభించి వాళ్లకు పెళ్లి సంబంధాలు కుదుర్చుతున్నారు.  


‘ఉమీద్‌ మాట్రిమోని’ ట్రాన్స్‌జండర్‌ కమ్యూనీటీ యువతకు వివాహ సంబంధాలను అందించే మాట్రిమోనీ యాప్‌. దీనిని ఏడాది క్రితం ముంబయికి చెందిన సిర్జీష్‌ ప్రారంభించారు.  సమాజంలో నిర్లక్ష్యానికి  గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు ఒక్క మాట్రిమోనీ యాప్‌ కూడా లేదు! ఇది గుర్తించిన సిర్జీష్‌ వారికి పెళ్లిసంబంధాల సేవలను అందించేందుకు ఏడాది క్రితం ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశారు.


ట్రాన్స్‌జెండర్లకు వివాహ సంబంధాలు తెస్తున్న ఏజన్సీలు  లేకపోలేదు కానీ, ఇవి వీళ్ల నుంచి ఎక్కువ మొత్తాల్లో డబ్బులు దండుకుంటున్నాయి. అందుకే ఈ కమ్యూనిటీ వాళ్లకు పెళ్లి సంబంధాల సేవలు అందించేందుకు ‘ఉమీద్‌ మాట్రిమోనీ’ యాప్‌ రూపుదిద్దుకుంది. మనదేశంలోని ఎల్‌జిబిటి (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) కమ్యూనిటీ అందరికీ ఈ యాప్‌ సేవలు అందిస్తోంది. ఈ యాప్‌ను ప్రారంభించిన సంవత్సరానికే మంచి స్పందన వచ్చింది. ఒక్క సంవత్సరంలో  ఎల్‌జిబిటి కమ్యూనిటీకి చెందిన ఎనిమిది వేల మంది  ఇందులో  తమ పేర్లను నమోదుచేసుకున్నారు. నిజానికి మనదేశంలో ఎల్‌జిబిటి కమ్యూనిటీకి దేశంలోని ఇతర పౌరులతో సమానంగా  వివాహ హక్కులు లేవు! కానీ  వీళ్లు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఇవేమీ అడ్డుకాలేదు. తమ జీవితభాగస్వామిని పొందడం కోసం వీళ్లంతా ఈ యాప్‌ ద్వారా వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. దీని సృష్టికర్త సిర్జీష్‌ యాప్‌ ప్రారంభించడానికి ముందు నుంచే ట్రాన్స్‌జెండర్స్‌ కమ్యూనిటీ సంక్షేమం కోసం వన్య ఫౌండేషన్‌ ద్వారా సేవలు అందిస్తున్నారు.


‘ఉమీద్‌  మాట్రిమోనీ’ యాప్‌ గురించి మాట్లాడుతూ ‘ఇది డేటింగ్‌ యాప్‌ కాదు ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ తమకు నచ్చిన భాగస్వాములతో బలమైన జీవిత బంధాన్ని కొనసాగించడానికి ప్రారంభించాం’ అని సిర్జీష్‌ వివరించారు. మనదేశంలో ఒకే జెండర్‌కు చెందిన వాళ్లు పెళ్లి చేసుకోవడం, రిలేషన్‌షి్‌పలో ఉండడం నేరం కానప్పటికీ వాళ్ల  వివాహాలు ఇంకా చట్టబద్ధంగా గుర్తింపుకు నోచుకోవడం లేదు.


లాంచ్‌కు ముందే 500 ఎంట్రీ

ఈ యాప్‌ను ప్రారంభించే ముందు దేశం అంతటా నివసిస్తున్న ఈ కమ్యూనిటీ జనాల డేటాను సిర్జీష్‌ సేకరించారు. మాట్రిమోనీ సేవలను వీళ్ల కోసం చేపట్టాలనుకుంటున్న సంగతి నేరుగా వారితో  చర్చించి వారి స్పందన ఎలా ఉందో గమనించారు.  ఆ తరువాత ఉమీద్‌ మాట్రిమోనీ యాప్‌ ప్రారంభించారు. అలా అది మెల్లగా ఊపందుకుంది. కమ్యూనిటీ కోసం నిర్వహించే పలు కార్యక్రమాలలో ఈ యాప్‌ గురించి సిర్జీష్‌ తెలియజేస్తూ  ప్రమోట్‌ చేశారు.  దీంతో ఈ యాప్‌ లాంచ్‌కి ముందే  ఎల్‌జిబిటీకి చెందిన 500 మంది తమ ప్రొఫైల్స్‌ను యాప్‌లో చేర్చారు. అంతేకాదు థాయ్‌లాండ్‌, దక్షిణాఫ్రికా, ఫిలిప్పైన్స్‌, మరికొన్ని విదేశాలలోని ఎల్‌జిబిటీ  యువత కూడా ఇందులో  చేరారు. అయితే ‘ఉమీద్‌ మాట్రిమోనీ’ యాప్‌లో తమ ఫోటోలను అప్‌లోడ్‌ చేయడానికి చాలామంది ఎల్‌జిబిటి యువత ఇష్టపడటం లేదు.


సామాజిక భయాందోళనల నుంచి వీళ్లు  బయటపడటానికి ఇంకా కొంత  సమయం పట్టక తప్పదు.  ఎందుకంటే ఈ కమ్యూనిటీ వ్యక్తుల పట్ల సమాజంలో తక్కువ చూపు ఉంది. అలాగే  ఈ తరహా సంస్కృతికి అలవాటుపడని జనాలు ఇక్కడ చాలామంది ఉన్నారు. మనదేశంలో చట్టం కింద సాధారణ జంటలు అనుభవిస్తున్న ఎలాంటి  ప్రయోజనాలూ  ఎల్‌జిబిటి జంటలకు  ఉండడం లేదు. ఫలితంగా వీళ్లు  ఎన్నో రాజ్యాంగపరమైన హక్కులను కోల్పోతున్నారు. ఒకే జెండర్‌ వాళ్లు పెళ్లి  చేసుకోవడం మనదేశంలో నేరం కాకపోయినా  వీళ్ల పెళ్లిళ్లను అధికారికంగా మనదేశంలో ఇంకా రిజిస్టర్‌ చేయడం లేదు. అంతేకాదు వీరిని ఆదుకునే ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లు కూడా లేవు. ఇలాంటి జంటలు పర్సనల్‌ లేదా హోమ్‌ లోన్లను మాత్రం జాయింట్‌ అకౌంట్‌ ద్వారా పొందగలరు తప్ప, మరే  ఇతర న్యాయపరమైన హక్కులూ వీళ్లకి  లేవు.  అయితే  తమ హక్కుల సాధన కోసం ఎందరో ఎల్‌జిబిటీ  కార్యకర్తలు దేశమంతటా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.


మొత్తానికి ఈ యాప్‌ వల్ల  తగిన జీవిత భాగస్వామిని ఎంచుకుని ఆనందంగా జీవితం గడుపుతున్నామని  ఎల్‌జిబిటి జంటలు అంటున్నారు. వన్య ఫౌండేషన్‌ ఎల్‌జిబిటీ కమ్యూనిటీ వారి కోసం సామాజిక, సాంస్కృతిక, విద్యాపరమైన పలు కార్యక్రమాలను చేపడుతూ వాళ్లని చైతన్యవంతులను చేస్తోంది. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లపై  ప్రత్యేక దృష్టి సారించింది. వీరందరికీ  విద్యావకాశాలు కల్పించడంతో పాటు  ఉపాధిని సైతం ఈ సంస్థ  కల్పిస్తోంది. ఈ సంస్థ  ‘ఉమీద్‌ మాట్రిమోనీ’ యాప్‌ ద్వారా  ఎల్‌జిబిటి కుటుంబాలను ఏర్పరచడంలో కీలకంగా కృషిచేస్తోంది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఎంతోమంది ఎల్‌జిబిటీ యువత సిర్జీష్‌ ప్రారంభించిన మాట్రిమోనీ యాప్‌ పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. తమకంటూ ఒక జీవితాన్ని, కుటుంబాన్ని, అనుబంధాలను ఈ యాప్‌ ద్వారా ఏర్పరచుకోగలుగుతున్నామని అంటున్నారు వీళ్లంతా. అంతేకాదు ఈ యాప్‌ సేవలపై  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2020-12-23T05:30:00+05:30 IST