దేవినేని ఉమా వెర్సస్ మంత్రి కొడాలి నాని

ABN , First Publish Date - 2021-01-19T21:23:49+05:30 IST

విజయవాడ వేదికగా టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.

దేవినేని ఉమా వెర్సస్ మంత్రి కొడాలి నాని

అమరావతి: విజయవాడ వేదికగా టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మాజీ మంత్రి ఉమ ప్రతి సవాల్ విసిరి.. ఇవాళ దీక్షకు పూనుకున్నారు. అయితే.. ఆయన చేస్తున్న దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని అదుపులోకి తీసుకున్నారు. 


ఈ సందర్బంగా దేవినేని ఉమ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. మనం ఎక్కడ ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? ఏమిటీ ఆరాచకాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు. తనపై పోలీసులు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని, ప్రభుత్వం ఎందుకింత భయపడుతోందని నిలదీశారు.


మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ...

దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసే దేవినేని ఇలా నాటకం ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. ‘దేవినేని ఉమా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలి. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దాం. అక్కడే కొట్టకపోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళొపోతాను. సొల్లు ఉమా సొల్లు కబుర్లు చెబుతాడు. బహిరంగ చర్చకు సిద్ధమని రాత్రి నుంచి ఉమకు 10 సార్లు ఫోన్ చేశాను. ఉమతో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నేను చర్చకు రమ్మంటే దేవినేని నాటకాలాడుతున్నాడు’ అని నాని మరోసారి సవాల్ విసిరారు. 

Updated Date - 2021-01-19T21:23:49+05:30 IST