Abn logo
Jun 6 2020 @ 21:04PM

ఈ సినిమా కూడా ఓటీటీలోనే అంటున్నారు

ప్రస్తుత లాక్‌డౌన్‌లో చిత్ర పరిశ్రమ బాగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో.. షూటింగ్స్‌కు ఎప్పుడు, ఎలాంటి అనుమతులు ఇస్తారో అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చినా.. థియేటర్స్ విషయంలో ఇప్పుడప్పుడే అనుమతులు వచ్చే అవకాశం లేకపోవడంతో కొందరు నిర్మాతలు ఇప్పుడు థియేటర్స్‌ని నమ్ముకోకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ వైపు చూస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక.. ఏదో ఒక రూపంలో కొంత లాభంతో సినిమాను ముందు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో డీల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాలు ఈ రూపంలో వచ్చేశాయి. ఇప్పుడు మరో మూవీ కూడా ఓటీటీలో రాబోతున్నట్లుగా తెలుస్తుంది.


తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందిస్తోన్న మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా ‘కేరాఫ్ కంచ‌పాలెం’ ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement