అల్సర్‌ డేంజర్‌..!

ABN , First Publish Date - 2022-09-27T06:47:14+05:30 IST

తిన్న ఆహారం జీర్ణమవటం కోసం జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం తయారువుతూ ఉంటుంది.

అల్సర్‌ డేంజర్‌..!

ఛాతీలో మంట అనిపిస్తే చేతికందిన యాంటాసిడ్‌ వాడేస్తూ ఉంటాం. కానీ తాత్కాలిక ఉపశమనాన్నిచ్చే ఈ మందులు వాడుతూ కాలం గడిపేస్తే సమస్య మరింత ముదిరి కడుపులో అల్సర్లు తయారవుతాయి. ఈ రుగ్మతను మరింత నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయానికి రంధ్రాలు పడే ప్రమాదం ఉంటుంది.


తిన్న ఆహారం జీర్ణమవటం కోసం జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం తయారువుతూ ఉంటుంది. ఈ ఆమ్లం కారణంగా జీర్ణాశయం దెబ్బతినకుండా దాని లోపల పల్చని పొర ఉంటుంది. అయితే ఈ యాసిడ్‌ అవసరానికి మించి ఉత్పత్తి అయినా, జీర్ణాశయం లోపలి రక్షణ పొర వివిధ కారణాల వల్ల బలహీనపడినా సమస్యలు మొదలవుతాయి. అసిడిటీ అనే ఈ సమస్యలో ఛాతీలో మంట, కడుపు నొప్పిలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే అరుదుగా కొందరిలో అసలు లక్షణాలే కనిపించవు. లక్షణాలు కనిపించినప్పుడు అందుబాటులో ఉన్న యాంటాసిడ్‌లు వాడి తక్షణ ఉపశమనం పొందుతూ ఉంటాం. అయితే ఈ మందులన్నీ ఆ ఆమ్లాన్ని పలుచన చేసేవే తప్ప దాని స్రావాన్ని నియంత్రించలేవు. అలాగే జీర్ణాశయం లోపలి రక్షణ పొర బలహీన పడటానికి కారణాల్ని తెలుసుకుని వాటిని సరిద్దిదనంతకాలం ఈ సమస్య పదే పదే తలెత్తుతూనే ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మూల కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్సనందించాలి. వైద్యులు అందించే సమర్ధమైన చికిత్సతో మాత్రమే ఈ సమస్యనుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ఒకవేళ పూర్తిగా యాంటాసిడ్‌ల మీదే ఆధారపడుతూ కాలం గడిపేస్తూ ఉంటే కొంతకాలానికి సమస్య మరింత ముదిరి జీర్ణాశయం లోపలి గోడలు దెబ్బతిని పరిస్థితి సర్జరీకి దారితీస్తుంది. 


అల్సర్లలో రకాలు

సాధారణంగా అల్సర్లు జీర్ణాశయం, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్‌లో తలెత్తుతాయి. అల్సర్లు తలెత్తటానికి ఎన్నో కారణాలుంటాయి. శరీరంలో రక్షణ వ్యవస్థ మందగించటం వల్ల జీర్ణాశయం లోపలి పొర బలహీనమయితే అందుకు కారణాలను కనిపెట్టి వాటిని చక్కదిద్దాలి. ఒకవేళ ఆమ్లం అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంటే దానికి మూల కారణాన్ని వెతికి దాన్ని సరిచేయటంతోపాటు స్రావం ఉత్పత్తిని నియంత్రించాలి. అలాగే  అల్సరు రకం, తీవ్రత, మందులకు స్పందించే విధానం ఆధారంగా చికిత్సనందించాలి. అల్సర్లలో కూడా రకాలుంటాయి. అవేంటంటే....


ఆమ్లం కారణంగా: అవసరానికి మించిన ఆమ్ల స్రావం వల్ల అల్సర్లు తలెత్తుతాయి.

బ్యాక్టీరియా వల్ల: కలుషిత నీటి ద్వారా హెలికోబాక్టర్‌ పైలోరి అనే బ్యాక్టీరియా పొట్టలోకి చేరి అల్సర్లు తయారవుతాయి. ఈ అల్సర్లని నిర్లక్ష్యం చేస్తే కేన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంది.

కేన్సర్‌: కేన్సర్‌తో కూడిన అల్సర్లు కూడా తయారవుతాయి. 


అల్సర్లకు ప్రధాన కారణాలు

అస్తవ్యస్థ జీవన విధానం, ఆహార నియమాలు పాటించకపోవటం, ఎక్కువ మసాలాలు, కారం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం, ఒత్తిడి, ఆందోళన, నొప్పి తగ్గించే మందులు, యాంటిబయాటిక్‌ మందుల్ని విచక్షణారహితంగా వాడటం, మద్యపానం, ధూమపానం, పొగాకు నమలటం, కాఫీలు ఎక్కువగా తాగటం, హెచ్‌.పైలోరీ బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి చేరటం, కేన్సర్‌ మొదలైన కారణాల వల్ల అల్సర్లు తయారవుతాయి.


లక్షణాలు

ఛాతీ ఎముక, నాభికి మధ్య, పక్కటెముకల కింద, వీపులో నొప్పి అల్సర్‌ ప్రధాన లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలు ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత మొదలవుతూ ఉంటాయి. అంటే భోజనానికి భోజనానికి మధ్య ఖాళీ సమయంలో, రాత్రి వేళ విడవకుండా నొప్పి ఉంటుంది. అలాగే ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. కొందరిలో వాంతి, ఉబ్బరం లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ అల్సర్‌ ప్రారంభ లక్షణాలు. అల్సర్‌ మరింత ముదిరినప్పుడు జీర్ణాశయం రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. రక్తస్రావం ఎక్కువగా ఉంటే రక్తం, యాసిడ్‌ కలిసి కాఫీ రంగులో వాంతులవుతాయి. మలం కూడా నలుపు రంగులో ఉంటుంది. ఈ సమస్య మరింత ముదిరితే జీర్ణాశయంలో రంధ్రం పడి తిన్న ఆహారం పేగులు, పొట్ట మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలోకి వెళ్లిపోతుంది. అది ప్రమాదకరమైన పరిస్థితి.. ఈ స్థితికి చేరుకున్న రోగి ప్రాణాలను కాపాడటం కష్టం. కొందరిలో డియోడినమ్‌లో పదే పదే అల్సర్లు తయారవుతూ వాటంతటవే మానుతూ ఆ ప్రదేశంలో మచ్చలా తయారవుతుంది. ఈ మచ్చ వల్ల చిన్నపేగు మార్గం మూసుకుపోయి సమస్య తలెత్తుతుంది. దాంతో తిన్న ఆహారం వెంటనే వాంతి అయిపోతూ ఉంటుంది.


యాంటాసిడ్స్‌ వాడొచ్చా?

యాంటాసిడ్‌లు ప్రభావవంతమైనవి కావు. అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించగలుగుతాయి. ఎందుకంటే ఏ రకమైన యాంటాసిడ్‌ అయినా పొట్టలోని ఆమ్లాన్ని సమం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్‌  కోసం యాంటాసిడ్లను వాడినా ఫర్వాలేదు. అల్సర్‌కు కారణం బ్యాక్టీరియా, లేదా కేన్సర్‌ అయిన పక్షంలో యాంటాసిడ్‌లు వాడుతూ పోతే సమస్య మరింత ముదిరి ప్రాణాలకే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకమైన అల్సరో తెలుసుకోకుండా తక్షణ ఉపశమనం కోసం యాంటాసిడ్లను వాడుతూ కూర్చోకూడదు. అల్సర్‌ లక్షణాలు అడపా దడపా అందరిలో ఏదో ఓ సందర్భంలో కనిపిస్తాయి. అయితే ఎప్పుడైనా భారీ భోజనం తిని అల్సర్‌ లక్షణాలు కనిపించినప్పుడు యాంటాసిడ్‌ వాడి ఉపశమనం పొందటం మంచిదే! అయితే ఆ అవసరం ఎంత తరచుగా వస్తుందో గమనించాలి. ఒకవేళ వారంలో నాలుగైదు రోజులు అల్సర్‌ లక్షణాలు కనిపించినా, పదే పదే యాంటాసిడ్‌ వాడాల్సిన అవసరం పడుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. యాంటాసిడ్‌లకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మెగ్నీసియం హైడ్రాక్సైడ్‌, అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ అనే రెండు రకాల యాంటాసిడ్‌లలో వేర్వేరు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయి. అల్యూమినియం హైడ్రాక్రైడ్‌ కలిగిన యాంటాసిడ్‌ వల్ల మలబద్ధకం, మెగ్నీసియం హైడ్రాక్సైడ్‌ కలిగిన యాంటాసిడ్‌ వల్ల డయేరియా వస్తుంది. మనంతట మనం యాంటాసిడ్‌లను ఎంపిక చేసుకుంటే ఈ దుష్ప్రభావాలను బలవంతంగా భరించాల్సి ఉంటుంది. అలాకాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడితే ఆ సైడ్‌ ఎఫెక్ట్స్‌ను వైద్యుల దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి వైద్యులు వేరే మందులను లేదా కాంబినేషన్‌ డ్రగ్స్‌ను సూచిస్తారు. 


అల్సర్లు రాకుండా...

సమయానికి ఆహారం తీసుకోవాలి.

మసాలాలు, కారం, కొవ్వులు, పుల్లటి పదార్థాలు వీటిలో వేటి వల్ల మంట తలెత్తుతుందో కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి. 

కలుషిత నీరు తాగకూడదు. పరిశుభ్రత పాటించాలి.

నొప్పి తగ్గించే మందులు పరిమితంగా వాడాలి.

ఒత్తిడి తగ్గించుకోవాలి.

ధూమపానం, మద్యం మానేయాలి.

Updated Date - 2022-09-27T06:47:14+05:30 IST