ఇప్పుడేం చేద్దాం..

ABN , First Publish Date - 2022-05-30T06:05:23+05:30 IST

వైద్య విద్యను అభ్యసించాలని వారు కలలు కన్నారు. డాక్టర్లుగా స్థిరపడితే తమ పిల్ల ల భవిష్యత్తుకు ఢోకా ఉండదని వారి తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు.

ఇప్పుడేం చేద్దాం..

ఉక్రెయిన వైద్య విద్యార్థుల్లో టెన్షన

వారి విద్యపై ప్రభావం... తల్లిదండ్రుల్లో ఆందోళన 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ  చూపకపోతే భవిష్యత అంధకారమే..

హిందూపురం టౌన, మే 29: వైద్య విద్యను అభ్యసించాలని వారు కలలు కన్నారు. డాక్టర్లుగా స్థిరపడితే తమ పిల్ల ల భవిష్యత్తుకు ఢోకా ఉండదని వారి తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరే రోజు దగ్గర పడిందనీ, వారిలో ఆనందం చూడవచ్చనుకున్నారు. లక్ష్య సాధనకు తీవ్రంగా శ్రమించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి, కన్నవారిని కూడా వదిలి విదేశాలకు వెళ్లారు. అంతా సవ్యంగా సాగుతుందనీ, మెడిసిన పూర్తి చేసుకుని, ప్రాక్టీస్‌ మొదలు పెట్టవచ్చనుకున్న సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. రష్యా, ఉక్రెయిన మధ్య యుద్ధం వారి పాలిట శాపంగా మారింది. వారి చదువును సందిగ్ధంలో పడేసింది. యుద్ధం నేపథ్యంలో వారి చదువులు ఉన్నఫలంగా ఆగిపోయాయి. వ్యయప్రయాసలకోర్చి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, స్వగ్రామాలకు వచ్చారు. వారిలో కొంతమంది ఆనలైన విద్యను అభ్యసిస్తుండగా మరికొంతమంది యుద్ధం ఆగితే వెళ్దామనీ, మరికొంతమంది ఇక్కడే చదువుకుందామని ఆలోచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందమందికిపైగా విద్యార్థులు ఉక్రెయినలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇందు లో అధిక మంది మూ డు, నాలుగో సంవత్సరం చదువుతు న్న వారే. వారిలో టెన్షన మొదలైం ది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 50మంది వరకు విద్యార్థులు ఉక్రెయినకు వైద్య విద్య కోసం వెళ్లారు. యుద్ధం మొదలవడంతో స్వదేశానికి వచ్చారు. రెండున్నర్ర నెలలు దాటినా ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు సొంత గ్రామాల్లో ఉండి ఆనలైన ద్వారా క్లాసులు వింటున్నారు. తరగతులు ఆనలైనలో జరుగుతున్నప్పటికీ వైద్య విద్యలో ఎంతో కీలకమైన ప్రాక్టికల్స్‌కు సమయం ఆసన్నం అవుతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. వైద్య విద్యలో జిల్లాకు చెందిన విద్యార్థులు మూడేళ్లు, నాలుగేళ్లు, కొంతమంది ఐదేళ్లు కూడా పూర్తయిన వారున్నారు. మరికొందరు చివరి నెలలో ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయినలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చదువులు ఎలా కొనసాగించాలో తెలియక వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలి

దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఉక్రెయినలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా స్వదేశానికి వచ్చారు. అక్కడ యుద్ధం ఆగకపోవడంతో వారిలో ఓవైపు టెన్షన, మరోవైపు కట్టిన ఫీజులు వెనక్కు వస్తాయో.. లేదోనన్న అనుమానం మొదలైంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నారు. గుర్తింపు పొందిన కళాశాలలో సీట్లు కేటాయించాలనీ, పూర్తి వైద్యవిద్య ధృవపత్రాలను ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 


ఆనలైనలో క్లాసులు వింటున్నా..

రష్యా, ఉక్రెయిన యుద్ధం నేపథ్యంలో యూనివర్సిటీని వీడి సొంత గ్రామానికి వచ్చా. మరి కొన్ని నెలల్లో నా కోర్సు పూర్తయ్యేది. అక్కడ యుద్ధం ఇంకా ఆగకపోవడంతో చదువుపై టెన్షనగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, ఇక్కడే వైద్య సీటు కేటాయించి, ధృవపత్రాలు అందజేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన వెళ్లి, చదువుకునే పరిస్థితి కనిపించట్లేదు. 

అరవింద్‌ గౌడ్‌, అరుమాకలపల్లి, చిలమత్తూరు మండలం


దిక్కుతోచట్లేదు..

ఐదున్నరేళ్ల కోర్సులో మూడేళ్లు పూర్తయింది. మరో రెండేళ్లుంటే నా కోర్సు పూర్తయి ఉండేది. ఇప్పటికే లక్షలాది రూపాయలు ఫీజు చెల్లించాం. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లాలంటే జంకే పరిస్థితి. యుద్ధ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, సొంత ఊరొచ్చాం. ప్రభుత్వాలు స్పందించి, మా ప్రాణాలకు రక్షణ కల్పిస్తే తప్ప అక్కడికి వెళ్లం. ఇక్కడే చదువు కొనసాగేలా చర్యలు చేపట్టాలి.

హరికృష్ణ, దేవరపల్లి, హిందూపురం మండలం


Updated Date - 2022-05-30T06:05:23+05:30 IST