రష్యాలోకి ఉక్రెయిన్‌ రహస్య దళం!

ABN , First Publish Date - 2022-07-04T10:16:41+05:30 IST

తెలతెలవారుతుండగానే రష్యా నగరం బెల్గోరోడ్‌ పేలుళ్లతో దద్దరిల్లింది.. వరుస దాడులతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.

రష్యాలోకి ఉక్రెయిన్‌ రహస్య దళం!

బెల్గోరోడ్‌ నగరంలో పేలుళ్లు

బెల్గోరోడ్‌, జూలై 3: తెలతెలవారుతుండగానే రష్యా నగరం బెల్గోరోడ్‌ పేలుళ్లతో దద్దరిల్లింది.. వరుస దాడులతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది..! ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. 11 అపార్ట్‌మెంట్లు, 39 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. అదేంటి..? ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్నది రష్యా కదా..? అలాంటిది రష్యా నగరంలో పేలుళ్లు ఎలా జరుగుతాయి? అని సందేహం వస్తోందా? ఇదంతా ఉక్రెయిన్‌కు చెందిన రహస్య దళం ‘‘షామన్‌’’ బెటాలియన్‌ చేస్తున్న ఆపరేషన్‌. సుశిక్షిత షామన్‌ కమాండోలు.. అత్యంత చాకచక్యంగా శత్రువు భూభాగంలోకి ప్రవేశించి తమ మిషన్‌ పూర్తి చేస్తున్నారు.  కఠోర శిక్షణ పొందిన షామన్‌ బెటాలియన్‌కు ఉక్రెయిన్‌ ఈ బాధ్యత అప్పగించింది. వీరు రష్యా లోపలకు చొచ్చుకెళ్తూ తమ ప్రధాన లక్ష్యం.. ఉక్రెయిన్‌పై దాడికి వేదికగా ఉన్న స్థావరాలను ధ్వంసం చేయడం.  


చొరబాటు ఎలా?

నిఘా పరంగా రష్యా సామాన్యమైనదేమీ కాదు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్ల ద్వారా వీరిని నిర్దేశిత ప్రాంతాలకు ఉక్రెయిన్‌ చేరవేస్తోంది. అక్కడ వెంటనే వీరు తమ మిషన్‌లోకి దిగిపోతారు. అయితే, దీనిని రష్యా ఆలస్యంగా పసిగట్టింది. ఆదివారం దాడుల అనంతరం తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను మరింత అప్రమత్తం చేసింది.  అయితే, అత్యంత వేగంగా, అసలు వచ్చి వెళ్లిన సంగతే తెలియకుండా మిషన్‌ను పూర్తి చేస్తారు షామన్‌ కమాండోలు. డాన్‌బా్‌స (లుహాన్స్క్‌+ డొనెట్స్క్‌) రీజియన్‌లోని లుహాన్స్క్‌ ప్రావిన్స్‌ తమ వశమైనట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదివారం ప్రకటించారు. లుహాన్స్క్‌లోని లిసిచాన్స్క్‌ ని స్థానిక తిరుగుబాటుదారుల సహకారంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్‌కు పట్టున్న సీవీరోడోనెట్స్క్‌, లిసిచాన్స్‌, సమీప ప్రాంతాలు మాత్రమే. రష్యా మద్దతున్న తిరుగుబాటుదారుల నియంత్రణలో మిగతాది కొనసాగుతోంది.

Updated Date - 2022-07-04T10:16:41+05:30 IST