జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మంటలను ఆర్పేశాం : ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-03-04T21:08:23+05:30 IST

రష్యా దళాల బాంబు దాడిలో జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో

జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మంటలను ఆర్పేశాం : ఉక్రెయిన్

కీవ్ : రష్యా దళాల బాంబు దాడిలో జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలను ఆర్పేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. రేడియేషన్ లెవెల్స్‌లో మార్పులు ప్రస్తుతానికి కనిపించలేదని ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటర్ తెలిపింది. అయితే ఈ ప్లాంటు రష్యన్ దళాల నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోంది. 


న్యూక్లియర్ ప్లాంట్ అధికార ప్రతినిధి ఆండ్రియ్ టుజ్ ఉక్రెయిన్ టెలివిజన్‌తో మాట్లాడుతూ, రష్యా దళాలు ప్రయోగించిన బాంబులు నేరుగా తమ ప్లాంటుపై పడ్డాయన్నారు. దీనిలో ఆరు రియాక్టర్లు ఉన్నాయని, ప్రస్తుతం కార్యకలాపాలు జరగని, ఆధునికీకరణ పనులు జరుగుతున్న రియాక్టర్‌పై బాంబులు పడ్డాయని చెప్పారు. 


ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటర్ శుక్రవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎనర్హొడార్‌ నగరంలోని జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంటుపై రష్యన్ దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో చెలరేగిన మంటలను ఆర్పేశారు. రేడియేషన్ లెవెల్స్‌లో మార్పులు ప్రస్తుతానికి నమోదు కాలేదు. ఒకటో రియాక్టర్‌ కంపార్ట్‌మెంట్‌కు జరిగిన ఇతర నష్టాల గురించి అధ్యయనం జరుగుతోంది. 


న్యూక్లియర్ ఫ్యూయల్‌ను చల్లబరచే సామర్థ్యాన్ని నిర్వహించవలసిన అవసరం చాలా ఉందని ఈ రెగ్యులేటర్ తెలిపింది. ఈ సామర్థ్యం దెబ్బతింటే 1986లో జరిగిన చెర్నోబిల్ ప్రమాదం కన్నా, 2011లో జపాన్‌లోని Fukushima మెల్ట్‌‌డౌన్ కన్నా ఘోరమైన విపత్తు సంభవిస్తుందని తెలిపింది. న్యూక్లియర్ రియాక్టర్‌లో న్యూక్లియర్ ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారని, ఆ తర్వాత ఈ న్యూక్లియర్ ఫ్యూయల్‌ను తొలగించి నిల్వ చేస్తారని, దీనికి సంబంధించిన గోదాముపై బాంబు దాడి ప్రభావం పడినట్లు కనిపించడం లేదని చెప్పింది. 


ఉక్రెయిన్‌కు సముద్ర మార్గంలో రాకపోకలకు అవకాశం లేకుండా చేయడం కోసం రష్యా దళాలు జపొరిజ్జియా అణు విద్యుత్తు కర్మాగారంపై దాడి చేశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చల్లో ఓ అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రజలను సురక్షితంగా తరలించేందుకు, మానవతావాద సాయాన్ని అందజేసేందుకు తగిన పరిస్థితులు కల్పించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 


ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తదితర ప్రపంచ దేశాల నేతలకు ఫోన్ చేసి, మాట్లాడారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ తన న్యూక్లియర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్‌ను ముందు జాగ్రత్త కోసం యాక్టివేట్ చేసింది. 


Updated Date - 2022-03-04T21:08:23+05:30 IST