రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి : జెలెన్‌స్కీ

ABN , First Publish Date - 2022-03-09T18:34:46+05:30 IST

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మంగళవారం

రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి : జెలెన్‌స్కీ

లండన్ : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మంగళవారం బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌ను ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. పార్లమెంటు సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిల్చుని ఆయన పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు. జెలెన్‌స్కీ చరిత్రాత్మక ప్రసంగంలో, తమ దేశంపై యుద్ధం చేస్తున్న రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరారు. తమ దేశ గగనతలం సురక్షితంగా ఉండటం కోసం రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలను విధించాలని విజ్ఞప్తి చేశారు. 


బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘మేం మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం, పాశ్చాత్య దేశాల సాయం కోసం చూస్తున్నాం. ఈ సహాయానికి మేం కృతజ్ఞులం, బోరిస్! మీకు ధన్యవాదాలు’’ అని జెలెన్‌స్కీ చెప్పారు. రష్యాపై ఆంక్షలను పెంచాలని కోరారు. రష్యాను ఉగ్రవాద దేశంగా గుర్తించాలన్నారు. ఉక్రెయిన్ గగనతలం సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చేయవలసినదంతా చేయాలని కోరారు. 


పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను ప్రకటించినప్పటికీ, రష్యా చమురు సరఫరా ఇంత వరకు నిలిచిపోలేదు. ఉక్రెయిన్ గగనతలంపై నో-ఫ్లై జోన్‌ను ప్రకటించాలని జెలెన్‌స్కీ కోరుతున్నప్పటికీ, అమెరికా, దాని మిత్ర పక్షాలు అందుకు అంగీకరించడం లేదు. 


Updated Date - 2022-03-09T18:34:46+05:30 IST