యుద్ధం మొదలైన మొదటి రోజు ఎలా గడిచిందో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-04-30T02:50:05+05:30 IST

కీవ్ : రష్యాతో యుద్ధం ఆరంభంలో ఎదురైన తీవ్ర పరిస్థితులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గుర్తుచేసుకున్నారు. తనను, తన కుటుంబాన్ని నిర్బంధించేందుకు రష్యా బలగాలు సమీపించాయని చెప్పారు.

యుద్ధం మొదలైన మొదటి రోజు ఎలా గడిచిందో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్ : రష్యాతో యుద్ధం ఆరంభంలో ఎదురైన తీవ్ర పరిస్థితులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గుర్తుచేసుకున్నారు. తనను, తన కుటుంబాన్ని నిర్బంధించేందుకు రష్యా బలగాలు సమీపించాయని చెప్పారు. నిద్రిస్తున్న తన 17 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కొడుకుని లేపి బాంబు దాడులు ప్రారంభమయ్యాయని చెప్పడం ఎప్పటికీ మరచిపోలేని చేదుగుర్తని జెలెన్‌స్కీ విచారం వ్యక్తం చేశారు.  తాను, తన భార్య పిల్లల్ని నిద్రలేపి దాడుల విషయాన్ని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో బయట నుంచి బాంబుల శబ్దాలు వినిపించాయని గుర్తుచేసుకున్నారు. జెలెన్‌స్కీ టార్గెట్‌గా ఉన్నారని, అధ్యక్ష కార్యాలయం ఎంతమాత్రం సురక్షితం కాదని సమాచారం అందింది. తనను అంతమొందించడం లేదా నిర్బంధించేందుకు రష్యా బలగాలు కీవ్‌లోకి ప్రవేశించాయని తెలిసినా భయపడలేదన్నారు. టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను తెలిపారు. ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్‌‌ ఛిన్నాభిన్నానికి నాంది పలికిన ఈ ప్రకటన వచ్చిన రోజు ఏం జరిగిందో.. నాటి చేదు జ్ఞాపకాలను జెలెన్‌స్కీ గుర్తుచేసుకున్నారు. 


జెలెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్రీ ఎర్‌మాక్ స్పందిస్తూ..  అంతకుముందు రాత్రి వరకు కేవలం సినిమాలలోనే కనిపించిన దృష్యాలు కళ్లముందే కనిపించాయని అన్నారు.  అధ్యక్షుడు జెలెన్‌స్కీని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు. గుట్టలుగా పేరుకుపోయిన పాత పోలీస్ బారికేడ్లు, ప్లైవుడ్ బోర్డులను ఉపయోగించి అధ్యక్ష భవనానికి కోట తరహా రక్షణ ఏర్పాటు చేశామని, ప్రవేశ ద్వారాలను మూసివేశామని వెల్లడించారు. రష్యా బలగాలు దాడి మొదలుపెట్టిన తొలిరోజు లైట్లను ఆర్పివేశాం. అధ్యక్ష భవనం ఆవరణలో ఉన్న రక్షణసిబ్బంది బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు, రైఫిల్స్‌ను తీసుకొచ్చారు. జెలెన్‌స్కీతోపాటు ఆయన సహాయకులకు రక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు.


ఇక ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నిపుణుడు ఒలెక్‌సీ అరెస్టోవిచ్ స్పందిస్తూ.. రష్యన్ బలగాలు అధ్యక్ష భవనం ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు రెండు సార్లు ప్రయత్నించాయని అన్నారు. ఈ సమయంలో జెలెన్‌స్కీతోపాటు ఆయన భార్య, పిల్లల్లు కూడా అక్కడే ఉన్నారని వెల్లడించారు. కాగా ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా జెలెన్‌స్కీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. అమెరికా సహా పలు దేశాలు తలదాచుకునేందుకు సాయం చేస్తామని చెప్పినా.. ఆయన ససేమిరా అన్నారు. ఆ ధైర్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-30T02:50:05+05:30 IST