బలిపీఠం ఉక్రెయిన్‌

ABN , First Publish Date - 2022-03-03T07:14:06+05:30 IST

ఉక్రెయిన్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బలగాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని జనావాసాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి...

బలిపీఠం ఉక్రెయిన్‌

  • రష్యా రక్తదాహం.. 2000 మంది ఆహుతి
  • ఉక్రెయిన్‌ అత్యవసర సేవల విభాగం వెల్లడి
  • ఏడో రోజూ రష్యా సేనల భీకర దాడులు
  • జనావాసాలే లక్ష్యంగా బాంబుల వర్షం
  • ఖర్కివ్‌పై పట్టు సాధిస్తున్న బలగాలు
  • ఖెర్సోన్‌ హస్తగతమైందన్న రష్యా సేనలు
  • చర్చలు మొదలెట్టండి.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు 
  • ‘నో ఫ్లై’ ఆంక్షలు పెట్టండి.. ‘నాటో’కు వినతి
  • మూడో ప్రపంచ యుద్ధం జరిగితే 
  • అణ్వాయుధాలతోనే!: రష్యా


కీవ్‌/మాస్కో, మార్చి 2: ఉక్రెయిన్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బలగాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని జనావాసాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఆస్పత్రులు, పాఠశాలలు, ఇళ్లు, రవాణా సౌకర్యాలకు సంబంధించిన నిర్మాణాలపైనా రష్యా సేనలు దాడులకు తెగబడుతున్నాయి. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ పోరులో సామాన్యులు సమిధలవుతున్నారు. రష్యా సైన్యం ఏడు రోజులుగా చేస్తున్న దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2 వేల మందికి పైగా పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. గంట గంటకూ భారీ సంఖ్యలో చిన్నారులు, మహిళలు, సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. తాము 6 రోజుల్లో 6 వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా రక్షణ శాఖ మాత్రం తమ సైనికులు 498 మంది మృతి చెందినట్లు తెలిపింది. 2870 మంది ఉక్రెయిన్‌ సైనికులు, పౌరులు మరణించినట్లు వెల్లడించింది. రష్యా దాడులు ఉధృతమవుతున్న వేళ.. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణ్వాయుధాలతోనే జరుగుతుందని, అది విధ్వంసకరంగా ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌ అణ్వస్త్రాలు సేకరించేందుకు రష్యా అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. రష్యా సాంస్కృతిక రంగాన్ని సైతం లక్ష్యంగా చేసుకుంటారని తాము ఊహించలేదని తెలిపారు. తమ క్రీడాకారులు, విలేకరులపై ఆంక్షలు విధించడం సరికాదని పశ్చిమ దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అమెరికా చెప్పినట్లుగా ఉక్రెయిన్‌ నడుచుకుంటోందని ఆరోపించారు. 


రష్యా సేనల గుప్పిట్లో ఖర్కివ్‌..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఇతర పెద్ద నగరాలపై మరింత పట్టు సాధించేందుకు రష్యా సేనలు పోరును ఉధృతం చేశాయి. ఖర్కివ్‌ నగరం శక్తిమంతమైన పేలుళ్లతో దద్దరిల్లిపోతోంది. ఉక్రెయిన్‌లో రెండో పెద్ద నగరమైన ఖర్కివ్‌లోకి రష్యా సేనలు ప్రవేశించాయి. పారాట్రూపర్లు కూడా దిగారు. ఈ నగరాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌ బలగాలు కూడా వారిని గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. ఖర్కివ్‌లో రష్యా జరిపిన ఫిరంగి దాడుల్లో 21 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. జైటోమిర్‌ నగరంలో పుతిన్‌ సేనలు జరిపిన వైమానిక దాడులకు ప్రసూతి ఆస్పత్రి ధ్వంసమైంది. ఆ ఘటనలో ఇద్దరు మరణించగా.. 16 మంది గాయపడ్డారు. దానికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ట్వీట్‌ చేసింది. ఇది మారణహోమం గాక, మరేమిటంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు దినిప్రో నగరంలో ఎయిర్‌ రైడ్‌ సైరన్లు మోగుతున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఖెర్సోన్‌ నగరం తమ అధీనంలోకి వచ్చిందని రష్యా సైన్యం ప్రకటించింది. కాగా, రష్యా తొలిసారిగా సైనికుల మృతిపై గణాంకాలు విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం వరకు 498 మంది సైనికులు మరణించినట్లు రష్యా వెల్లడించింది. 2870 మంది ఉక్రెయిన్‌ సైనికులు, పౌరులు చనిపోయినట్లు వివరించింది. 




ముందు బాంబు దాడులు ఆపండి: జెలెన్‌స్కీ

కాల్పుల విరమణపై అర్థవంతమైన చర్చ జరగడానికి ముందు.. తమ దేశంపై బాంబు దాడుల్ని నిలిపివేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు. ‘‘కనీసం ప్రజలపై బాంబు దాడులను నిలిపివేయాలి. దాడుల్ని ఆపి, చర్చలు ప్రారంభించాలి’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను లేకుండా చేయాలని రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రష్యా వైమానిక దళాన్ని నిలువరించేందుకు ‘నో ఫ్లై జోన్‌’ ఆంక్షలు విధించాలని ఆయన నాటో సభ్య దేశాలను కోరారు. రష్యా కారణంగానే ప్రతి ఒక్కరు ఈ యుద్ధంలోకి రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘‘మా భాగస్వామ్య దేశాలు ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే.. రష్యా కూడా ఉక్రెయిన్‌ నాటోలో ఉండకూడదనుకుంటే.. ఉక్రెయిన్‌ కోసం భద్రతా హామీలను సిద్ధం చేయాలి. వాటి ద్వారా మా దేశ సరిహద్దులకు రక్షణ ఉంటుంది. మా దేశ సమగ్రతకు రక్షణ లభిస్తుంది. పొరుగు దేశాలతో ప్రత్యేక సంబంధాలుంటాయి’’ అని జెలెన్‌స్కీ అన్నారు. అలాగే రష్యా దూకుడుగా నిర్వహిస్తున్న సైనిక చర్యపై ఐరోపా దేశాలను హెచ్చరించారు. ‘‘ఉక్రెయిన్‌ పతనమైతే.. రష్యా దళాలన్నీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లోనే ఉంటాయి. అప్పుడు మీకూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది’’ అని అన్నారు. సైనిక పోరు ప్రారంభానికి ముందే రష్యాపై ఆంక్షల విషయంలో తాను చేసిన అభ్యర్థనను అమెరికా, ఐరోపా దేశాలు విస్మరించాయని జెలెన్‌స్కీ చెప్పారు. ఎంతకాలం రష్యాను ఎదుర్కొని నిలబడతారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘‘మేం చివరి వరకూ పోరాడతాం. ఇది మా జన్మభూమి. పిల్లల భవిష్యత్తు కోసం మా నేలను కాపాడుకుంటాం. ఇక్కడ రష్యన్లకు ఏం పని? వారు చంపడానికి లేదా చావడానికే ఇక్కడకు వచ్చారు’’ అని జెలెన్‌స్కీ బదులిచ్చారు. ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. భారీ భద్రత నడుమ జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే కీవ్‌లోని హోలోకాస్ట్‌ స్మారకానికి సమీపంలో ఉన్న టీవీ టవర్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. మరోవైపు ప్రపంచంలో ఉన్న యూదులందరూ రష్యా దురాక్రమణపై గళమెత్తాలని ఆయన కోరారు.


చర్చలకు సిద్ధం: రష్యా

ఉక్రెయిన్‌తో రెండో విడత చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్ష భవనం వెల్లడించింది. ఇందులో భాగంగా బుధవారం మ ధ్యాహ్నం నుంచి తమ ప్రతినిధుల బృందం సిద్ధంగా ఉంటుందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. అయితే, ఈసారి చర్చలు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు ఈ చర్చలపై ఉక్రెయిన్‌ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం గమనార్హం. ఇక.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై ఆయన ప్రారంభించిన సైనిక చర్యను వ్యతిరేకించాలని ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. రష్యా హెలికాప్టర్‌ తమ గగనతలంలోకి ప్రవేశించడంపై జపాన్‌ ప్రభుత్వం రష్యాకు దౌత్యపరమైన నిరసన తెలిపింది.


సొంత వాహనాలనే ధ్వంసం చేస్తున్న రష్యా సైనికులు!

రష్యా దళాల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆహారం, నీరు దొరక్క సైనికులు అల్లాడిపోతున్నారు. కనిపించిన వారందరినీ కాల్చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగా.. ఈ తరహా విధ్వంసానికి ఇష్టపడని కొందరు సైనికులు తమ సొంత వాహనాలనే ధ్వంసం చేసుకుంటున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనంలో వెల్లడించింది. రష్యా సైనికుల్లో అధిక శాతం యువతే ఉన్నారని.. పూర్తిస్థాయి యుద్ధంలో ఎలా పాల్గొనాలో వారికి శిక్షణ ఇవ్వలేదని తెలిపింది. దీంతోపాటు వారికి మంచినీరు, ఆహారం, ఇంధనం లాంటి వనరులు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు వివరించింది. ఉక్రెయిన్‌ బలగాలకు పట్టుబడిన రష్యా సైనికులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. 


Updated Date - 2022-03-03T07:14:06+05:30 IST