ఉక్కు స్థలాలకు రెక్కలు

ABN , First Publish Date - 2022-05-17T06:53:34+05:30 IST

ఉక్కు కర్మాగారం నిర్వాసిత కాలనీల్లో ఖాళీగా వున్న భూములకు రెక్కలొస్తున్నాయి.

ఉక్కు స్థలాలకు రెక్కలు

తప్పుడు ఆర్‌.నంబర్లతో నిర్వాసిత కాలనీల్లో పట్టాలు పొందుతున్న వైనం

ఉక్కు భూసేకరణ అధికారుల సహకారం

రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం

గ్రీన్‌ బెల్టులో నిర్మాణాలకు జీవీఎంసీ అనుమతులు

సమన్వయలోపమే కారణం

విచారణకు కలెక్టర్‌ ఆదేశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఉక్కు కర్మాగారం నిర్వాసిత కాలనీల్లో ఖాళీగా వున్న భూములకు రెక్కలొస్తున్నాయి. కొందరు దొంగ ఆర్‌.కార్డులు సృష్టించి కోట్ల విలువైన భూములను కాజేస్తున్నారు. గతంలో ఒకసారి ఫిర్యాదులు రావడంతో జిల్లా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి 528 ప్లాట్లు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి వాటికి సంబంధించిన పట్టాలు రద్దు చేసి జీవీఎంసీకి అప్పగించారు. అయితే ఇప్పటివరకు ఆ స్థలాలను జీవీఎంసీ స్వాధీనం చేసుకోలేదు. విచిత్రమేమిటంటే జీవీఎంసీకి అప్పగించిన స్థలాల్లో గల గ్రీన్‌బెల్టు లో...నిర్మాణాలకు జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. 

ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన రైతులకు గంగవరం, పెదగంట్యాడ, దువ్వాడ, అగనంపూడి, వడ్లపూడిల్లో నిర్వాసిల కాలనీలు నిర్మించారు. ప్రభుత్వం  ఆర్‌.కార్డు జారీచేసిన వారికి 107 గజాల వంతున కేటాయించారు. ఇంకా కాలనీల్లో పార్కులు, పాఠశాలలు, ఇతర సామాజిక భవనాలు నిర్మించారు. అలాగే భవిష్యత్తు అవసరాలకు కొన్ని స్థలాలు, గ్రీన్‌బెల్టు కోసం మరికొంత రిజర్వు చేశారు. అయితే గాజువాకకు సమీపంలో గల ఈ నిర్వాసిత కాలనీల్లోని ఖాళీ స్థలాలపై కబ్జాదారులు కన్నేశారు. స్థానికంగా కొందరిని పట్టుకుని తప్పుడు ఆర్‌.నంబర్లతో పత్రాలు సృష్టించి ఉక్కు భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి లంచాలు ఇచ్చి ప్లాట్లు దక్కించుకున్నారు. మరికొందరు నిర్వాసితులు తమ ఇంట్లో పెళ్లయిన వారు ఉన్నారని దరఖాస్తు చేస్తే పట్టాలు ఇచ్చేశారు. చాలాకాలంగా సాగుతున్న ఈ దందా వెనుక అన్ని పార్టీలకు చెందిన నాయకుల హస్తం వుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఉక్కు భూసేకరణ కార్యాలయం నుంచి పట్టాలు పొందిన వారంతా నిర్మాణాలు చేపట్టి అమ్ముకునేవారు. దీనిపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు వెళ్లడంతో 2014లో అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌ విచారణకు ఆదేశించారు. అప్పటి జేసీ ప్రవీణ్‌కుమార్‌, తరువాత వచ్చిన సృజన విచారించి అగనంపూడి నిర్వాసిత కాలనీలో 219, దువ్వాడలో 47, పెదగంట్యాడలో 63, వడ్లపూడి కాలనీలో 199....మొత్తం 528 మంది అక్రమంగా ప్లాట్లు పొందారని నిర్ధారించారు. ఆ మేరకు కలెక్టర్‌కు నివేదించగా 528 ప్లాట్లు రద్దు చేసి వాటిని జీవీఎంసీకి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్లాట్ల కేటాయింపు రద్దుపై కొందరు కోర్టుకు వెళ్లడంతో వివాదం అక్కడ పెండింగ్‌లో ఉంది. బోగస్‌ పట్టాలుగా గుర్తించిన 528లో అగనంపూడిలోనే 219 వరకూ ఉన్నాయి. వీటితోపాటు 2005లో నిర్వాసితుల వారసులమంటూ కొందరు జాతీయ రహదారికి ఆనుకుని అగనంపూడి పరిధి డొంకాడ కాలనీలోని సర్వే నంబర్‌ 207లో గ్రీన్‌బెల్టుగా గుర్తించిన స్థలంలో 14 ప్లాట్లను తీసుకుని అప్పట్లోనే వేరే వ్యక్తులకు అమ్మేశారు. నిబంధనల మేరకు గ్రీన్‌బెల్టులో స్థలాలను ఎవరికి కేటాయించరాదనే నిబంధన ఉన్నప్పటికీ అప్పటి ఉక్కు భూసేకరణ అధికారి ఒకరు...దానిని ఉల్లంఘించారు. కాగా డొంకాడలోని సర్వే నంబరు 207లో నిర్వాసితుల వారసులకు ఇచ్చినట్టుగానే తమకు ప్లాట్లు కేటాయించాలని జిల్లా యంత్రాంగానికి మరికొందరు నిర్వాసితులు విన్నవించారు. ఇంకా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొదటి 14 మందికి కేటాయించిన పట్టాలను రద్దు చేయగా...ఆయా స్థలాలను కొనుగోలు చేసిన వారంతా కోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉక్కు భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సర్వేనంబరు 207లో పట్టాల జారీపై ఎస్డీసీ విచారణ జరిపి కొనుగోలు చేసిన వారి పేర్లతో ‘హోల్స్‌గుడ్‌’ అన్న పదం చేర్చి ఒక నివేదిక తయారుచేశారు. అదే సమయంలో ప్లాట్లు కేటాయించాలని కోర్టును ఆశ్రయించిన నిర్వాసితులకు మాత్రం పట్టాలు ఇవ్వడం కుదరదని నివేదిక రూపొందించారు. విచిత్రమేమిటంటే...ఇప్పటికి కూడా అటు కోర్టుకు..ఇటు జిల్లా యంత్రాంగానికి ఉక్కు భూసేకరణ అధికారులు నివేదిక సమర్పించలేదు. నిర్వాసితుల పేరు కాకుండా కొనుగోలుదారుల పేరిట ‘హోల్స్‌ గుడ్‌’ అని పేర్కొంటూ నివేదిక రూపొందించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ‘హోల్స్‌గుడ్‌’ అన్న పదం పట్టుకుని కొనుగోలుదారులు అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. మరో విశేషమిటంటే..14 ప్లాట్లు అక్రమమని ఒక అధికారి వాటిని రద్దు చేస్తే...ఆ తరువాత వచ్చిన మరో అధికారి మాత్రం వాటిలో ఎనిమిది ప్లాట్లకు సంబంధించి ‘హోల్స్‌గుడ్‌’ అని పేర్కొనడం గమనార్హం. ఉక్కు నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించినప్పుడు ఒక ఆర్‌.కార్డుకు ఒక్క పట్టా మాత్రమేనన్న నిబంధన అప్పట్లో విధించారు. దీనికి విరుద్ధంగా అసలు 14 ప్లాట్లను నిర్వాసితుల వారసులకు ఎలా ఇచ్చారనేది అధికారులే చెప్పాలి. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఉక్కు భూసేకరణ అధికారి విచారణ నివేదికలో మతలబులపై కొందరు జిల్లా యంత్రాంగానికి ఇప్పటివరకు సుమారు పదిమార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రస్తుత ఉక్కు భూసేకరణ ఎస్డీసీ పద్మలతను కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశించారు. ఈ విషయమై పద్మలతను వివరణ కోరగా ఉక్కు నిర్వాసిత కాలనీల్లో ఖాళీగా వున్న ప్లాట్లను జీవీఎంసీకి అప్పగించామన్నారు. ఇంకా డొంకాడలో సర్వే నంబరు 207లోని స్థలాలపై కోర్టులో వివాదం ఉందని వివరించారు. అయితే కోర్టులో ఉన్నప్పుడు అక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించగా...పరిశీలించి అక్కడ బోర్డులు ఏర్పాటుచేస్తామని వివరించారు. 

Updated Date - 2022-05-17T06:53:34+05:30 IST