బ్రిటన్ ప్రధానికి ఐసీయూలో చికిత్స, నిలకడగా ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-04-09T02:50:10+05:30 IST

చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం నిలకడగా ఉంది

బ్రిటన్ ప్రధానికి ఐసీయూలో చికిత్స, నిలకడగా ఆరోగ్యం

లండన్ : కోవిడ్-19 చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన లండన్‌లోని ఆసుపత్రిలో రెండో రోజు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు. 


బోరిస్ జాన్సన్ చురుగ్గా పని చేయకపోయినప్పటికీ, తన మంత్రివర్గ సహచరులతోనూ, అధికారులతోనూ మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్లినికల్లీ స్టేబుల్ అని, చికిత్సకు స్పందిస్తున్నారని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిథి తెలిపారు. 


సెంట్రల్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో ఉన్న సెయింట్ థామస్ ఆసుపత్రిలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు చికిత్స జరుగుతోంది. ఇది అంటు వ్యాధుల చికిత్సకు సంబంధించిన ప్రత్యేక జాతీయ ఆరోగ్య సేవా ఆసుప్రతి.


బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డ్ అర్గర్ బుధవారం ఉదయం మాట్లాడుతూ బోరిస్ జాన్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తాజా సమాచారం ప్రకారం జాన్సన్‌కు స్టాండర్డ్ ఆక్సిజన్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఆయన వెంటిలేటర్ల వంటి పరికరాల సహాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నారు.  


బోరిస్ జాన్సన్‌కు ఓ వారం క్రితం కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఆయనను ఆదివారం ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఆయనను ఐసీయూకు తరలించి, చికిత్స చేస్తున్నారు. ఆయనకు న్యూమోనియా లక్షణాలు లేవని డౌనింట్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2020-04-09T02:50:10+05:30 IST