చేతిపై పురుషాంగం మొలిపించిన బ్రిటన్ వైద్యుడు!

ABN , First Publish Date - 2020-08-03T13:57:40+05:30 IST

పెరీనియం ఇన్ఫెక్షన్‌ కారణంగా పురుషాంగాన్ని కోల్పోయాడో వ్యక్తి! ఆ దిగులుతో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు.!! కానీ.. ఒక వైద్యుడు సరికొత్త చికిత్సతో అతడి

చేతిపై పురుషాంగం మొలిపించిన బ్రిటన్ వైద్యుడు!

  • పెరీనియం ఇన్‌ఫెక్షన్‌తో 2014లో అంగాన్ని కోల్పోయిన వ్యక్తి
  • సరికొత్త చికిత్సతో అతడికి ఊరట


లండన్‌, ఆగస్టు 2: పెరీనియం ఇన్ఫెక్షన్‌ కారణంగా పురుషాంగాన్ని కోల్పోయాడో వ్యక్తి! ఆ దిగులుతో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు.!! కానీ.. ఒక వైద్యుడు సరికొత్త చికిత్సతో అతడి చేతిపై అంగాన్ని మొలిపించాడు!! బ్రిటన్‌కు చెందిన మాల్కమ్‌ డొనాల్డ్‌ (45)  జీవితంలో జరిగిన అద్భుతమిది. డొనాల్డ్‌ పెరీనియం (మల ద్వారానికి, పురుషాంగానికి మధ్య ఉండే ప్రదేశం) భాగంలో ఇన్ఫెక్షన్‌తో చాలాకాలం బాధపడ్డాడు. అది సెప్సి్‌సకు దారితీసి కాలి, చేతుల వేళ్లు, పురుషాంగం నల్లగా అయిపోయాయి. 2014లో పురుషాంగం ఊడి పడిపోయింది! వృషణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆస్పత్రికి వెళ్తే  మిగిలిన భాగాన్ని చుట్టలా చుట్టడం తప్ప ఏమీ చేయలేమని వారు చెప్పారు. ఈ పరిస్థితుల్లో కుటుంబ వైద్యుడు.. డేవిడ్‌ రాల్ఫ్‌ అనే ప్రొఫెసర్‌ గురించి మాల్కమ్‌కు చెప్పాడు. లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆస్పత్రిలో పురుషాంగ మార్పిడి నిపుణుడైన డేవిడ్‌ రాల్ఫ్‌కు ‘పెనిస్‌ మాస్టర్‌’గా పేరుంది. పురుషాంగం లేకుండా పుట్టిన ఆండ్రూ వార్డెల్‌ అనే వ్యక్తికి బయోనిక్‌ పురుషాంగాన్ని అమర్చిన చరిత్ర ఆయనది. ఈ విషయం తెలియగానే మాల్కమ్‌లో ఆశలు చిగురించాయి. వెంటనే డేవిడ్‌ రాల్ఫ్‌ను కలిశాడు. మాల్కమ్‌ పరిస్థితి చూసి.. అతడి చేతిపై అంగాన్ని మొలిపించవచ్చని భరోసా ఇచ్చాడు. అయితే,  కనీసం రెండేళ్లు పడుతుందని, 50 వేల పౌండ్లు (దాదాపు రూ.50 లక్షలు) ఖర్చవుతుందని చెప్పాడు. చికిత్సకయ్యే వ్యయాన్ని భరించేందుకు సర్కారు అంగీకరించింది (అంగం అమర్చడం వల్ల అతడికి మూత్రవిసర్జన సులువవుతుంది కాబట్టి). దీంతో, నాలుగేళ్ల క్రితం చికిత్స మొదలైంది. వైద్యులు అతడి అంగానికి సంబంధించిన రక్త నాళాలు, నాడులను ఉపయోగించి కొత్త అంగం మొలిపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎడమ చేతి మీది చర్మాన్ని సేకరించి దాన్ని చుట్టి మూత్రమార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఇందుకు నాలుగేళ్లు పట్టింది. చేతిపై పూర్తిగా పెరిగిన పురుషాంగాన్ని దాని సహజ స్థానంలోకి అమర్చే ఆపరేషన్‌ కోసం మాల్కమ్‌ ప్రస్తుతం ఎదురుచూస్తున్నాడు. కానీ, కరోనా కారణంగా చికిత్స సాధ్యం కావట్లేదు. ఈ ఏడాది చివరికైనా సరే ఆ ఆపరేషన్‌ పూర్తవుతుందని ఆశిస్తున్నాడు. కాగా.. చేతిమీద వేలాడే పురుషాంగాన్ని కప్పి ఉంచేందుకు అతడు   పొడుగు చేతుల చొక్కాలే ధరిస్తాడు. అయినా కొందరు దాన్ని గమనిస్తారని మాల్కమ్‌ చెబుతాడు. ఎందుకంటే.. డాక్టర్లు అనుకున్నదానికన్నా రెండు అంగుళాలు ఎక్కువ పొడుగ్గా ఏర్పాటు చేయాలని మాల్కమ్‌ కోరాడు. వారు సరేనన్నారు. అందుకే.. ‘నాలాంటి డిజైనర్‌ పురుషాంగం ఎవరికీ ఉండదు’ అని డొనాల్డ్‌ నవ్వుతూ చెబుతాడు. అన్నట్టు.. చేతి మీద మొలిపించుకున్న తన పురుషాంగానికి ‘జిమ్మీ’ అని పేరు కూడా పెట్టాడు మాల్కమ్‌!!

Updated Date - 2020-08-03T13:57:40+05:30 IST