‘యూకేలో ఆరు నెలల వరకు ఆంక్షలు కొనసాగవచ్చు’

ABN , First Publish Date - 2020-03-30T09:11:23+05:30 IST

యూకేలో కరోనా విలయతాండవం ఆడుతుండటంతో మరో ఆరు నెలల పాటు ఆంక్షలు కొనసాగవచ్చని డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జెన్నీ హ్యారీస్ అభిప్రాయపడ్డారు.

‘యూకేలో ఆరు నెలల వరకు ఆంక్షలు కొనసాగవచ్చు’

లండన్: యూకేలో కరోనా విలయతాండవం ఆడుతుండటంతో మరో ఆరు నెలల పాటు ఆంక్షలు కొనసాగవచ్చని డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జెన్నీ హ్యారీస్ అభిప్రాయపడ్డారు. ప్రతి మూడు వారాలకు వచ్చే రివ్యూలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే యూకే మామూలు పరిస్థితికి రావచ్చన్నారు.. అయితే కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి ప్రజలు వెంటనే బయట తిరగకూడదని ఆమె సూచించారు. ఆంక్షలు ఎత్తివేసినప్పటికి ఆరు నెలల పాటు ప్రతి మూడు వారాలకు కేసులకు సంబంధించి రివ్యూ జరపాల్సి ఉంటుందన్నారు. యూకే మొత్తం జూన్ వరకు లాక్‌డౌన్‌లో ఉంటేనే కరోనాతో పోరాడగలమని మరో ఆరోగ్య అధికారి తెలిపారు. మరోపక్క యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే ముందు మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కాగా.. యూకేలో మార్చి 29 వరకు 19,522 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,228 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఆదివారం రోజునే 209 మంది చనిపోయారు. అధిక మరణాలు ఇంగ్లాండ్‌లోనే నమోదయ్యాయి.

Updated Date - 2020-03-30T09:11:23+05:30 IST