ఊ.. అంటావా.. ఊహూ.. అంటావా

ABN , First Publish Date - 2022-01-27T06:28:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించి పైసా ఖర్చు లేకుండా వారి ఆరోగ్యాలకు భద్రత, భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటోంది.

ఊ.. అంటావా.. ఊహూ.. అంటావా

 ప్రభుత్వాస్పత్రి డయాలసిస్‌ యూనిట్‌లో వేధింపులు

 ఇటీవల మహిళా ఉద్యోగిపై అసభ్య ప్రవర్తన 

 ఇప్పటికే ఆ విభాగం నుంచి షీటీమ్‌కు పలు ఫిర్యాదులు 

 విచారణకు వచ్చేసరికి ఉద్యోగినులను బెదిరిస్తున్న వైనం

 బెదిరింపులతోనే ముందుకు రాని మహిళా సిబ్బంది 

 చోద్యం చూస్తున్న శాఖ ఉన్నతాధికారులు 

నల్లగొండ క్రైం/నల్లగొండ అర్బన్‌, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించి పైసా ఖర్చు లేకుండా వారి ఆరోగ్యాలకు భద్రత, భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కిడ్నీలు ఫెయిలై చావుకు దగ్గరలో ఉన్న వారికి సైతం భరోసా కల్పించేలా జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అత్యాధునిక డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి సహకారంతో ఏర్పాటుచేశారు. నాటి నుంచి జిల్లాకు చెందిన డయాలసిస్‌ రోగులు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఆ విభాగంలో వైద్యులు, సిబ్బందిని సైతం పెంచుతూ నిర్ణయం తీసుకుని అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టింది. అయితే నియామకమైన వారిలో కొంత మంది పురుష ఉద్యోగులు మాత్రం విధులను పక్కనబెట్టి అందులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను వేధించడం మొదలుపెట్టారు. ఈ యూనిట్‌లో పనిచేస్తున్న ఓ దళిత ఉద్యోగినిపై అదే విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడగా ఆమె షీటీమ్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. 


విచారణ ముమ్మరం 

వేధింపుల ఘటనపై షీటీమ్‌ ఇన్‌చార్జి, సీఐ రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి విచారణ ముమ్మరంచేశారు. అందిన ఫిర్యాదు మేరకు షీటీమ్‌ అధికారులు ఉద్యోగినిని సంప్రదించి వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా వివరాలను తెలియజేసేందుకు వెనకాడినట్లు తెలిసింది. అయితే ఆ విభాగంలో ప్రస్తుతం జరిగిన ఘటనే కాకుండా షీటీమ్‌కు ఇప్పటికే నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఈ విభాగం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన నాటినుంచి కూడా ఉద్యోగినులపై లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా జిల్లా ఆసుపత్రి నిర్వాహకులు, అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జరిగిన విషయం చెప్పడంకంటే గుట్టుచప్పుడు కాకుండా విధులు నిర్వహించుకుంటూ పోవడమే మేలని బాధితులు మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగినా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, వైద్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే వేధింపులు పెరిగిపోతున్నాయన్న విమర్శలున్నాయి. జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న వేధింపులపై కలెక్టర్‌, ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగులను వేధించిన సదరు ఉద్యోగికి ఓ రాజకీయనేత వత్తాసు పలకడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా విధులు నుంచి తొలగించి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. 


ఆరోపణల సమయంలో నేను బాధ్యతలు చేపట్టలేదు : డా.లచ్చూనాయక్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, నల్లగొండ 

జిల్లా జనరల్‌ ఆసుపత్రిలోని డయాలసిస్‌ సెంటర్‌లో ఈ ఆరోపణల సమయంలో నేను సూపరింటెండెంట్‌గా లేను. ఆ సమయంలో నేను బాధ్యతలు తీసుకోలేదు. నేను రాకముందు జరిగిన ఆరోపణలు కావడంతో, నాకు ఆ విషయం తెలియదు. ఇప్పటినుంచి ఇలాంటి ఘటనలు జరకుండా చూస్తాం. ఎవరైనా మహిళా సిబ్బందిని వేధించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 


విచారణకు సహకరిస్తే చర్యలు తీసుకుంటాం : రాజశేఖర్‌, షీటీమ్‌ సీఐ, నల్లగొండ

డయాలసిస్‌ యూనిట్‌లో ఉద్యోగినిపై వేధింపులు జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే బాధితురాలి వద్దకు వెళ్లి పూర్తి వి వరాలు సేకరించేందుకు ప్రయత్నించాం. ఆమె ఇంటికి సైతం వెళ్లి వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేయ గా వివరాలు తెలిపేందుకు వెనుకడుగు వేశారు.  ఆయూనిట్‌ నుంచి ఇప్పటి వరకు మూడు, నాలుగు ఫిర్యాదులు వచ్చాయి.  

Updated Date - 2022-01-27T06:28:11+05:30 IST