Abn logo
Feb 22 2020 @ 01:31AM

ఉగ్రరూపస్య...

‘‘అతని పేరు మహేశ్‌.. అసలు పేరు ఉమా మహేశ్వరరావు! పల్లెల్లో సాఫ్ట్‌గా పని చేసుకునే ఫొటోగ్రాఫర్‌. సున్నితమైన ప్రేమికుడు కూడా! అలాంటి వ్యక్తి ఉగ్రరూపం దాల్చడానికి కారణమేంటి అన్నది తెరపైనే చూడాలి’’ అంటున్నారు వెంకటేశ్‌ మహా. ఆయన దర్శకత్వంలో సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయాణ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలు. షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మలయాళంలో హిట్టైన ‘మహేశింతే ప్రతీకారమ్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగుతుందీ సినిమా. మన నెటివిటీకి తగ్గట్టు దర్శకులు మార్పులు చేసి అద్భుతంగా మలిచారు. సత్యదేవ్‌ లుక్‌ కొత్తగా ఉంటుంది. అరకు ప్రాంతంలో 36 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం, ఏప్రిల్‌  17న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’. నరేశ్‌, రామ్‌ ప్రసాద్‌, సుహాస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బిజ్‌బల్‌, సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్‌.

Advertisement
Advertisement
Advertisement