Abn logo
Sep 9 2021 @ 02:38AM

‘ఉగ్ర’ మంత్రులు!

  • తాలిబాన్‌ సర్కారులో 14 మంది యూఎన్‌ నిషేధిత జాబితాలోని ఉగ్రసంస్థలవారే
  • కొత్త సీసాలో పాత సారా.. పాకిస్థాన్‌ ముద్ర స్పష్టం

కాబూల్‌, పెషావర్‌, న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: అఫ్ఘానిస్థాన్‌లో ఏర్పాటైన ఆపద్ధర్మ ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించినవారిలో ప్రధానమంత్రి అఖుంద్‌ సహా కనీసం 14 మంది.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించిన ‘నిషేధిత ఉగ్రవాద సంస్థ’లకు చెందినవారే. ఇది ప్రపంచదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా.. అఫ్ఘాన్‌ హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిరాజుద్దీన్‌ హక్కానీ తలపై ఏకంగా కోటి డాలర్ల (దాదాపు రూ.73 కోట్లు) నజరానా ఉంది. అతడి బంధువు, శరణార్థుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖలీల్‌ హక్కానీ కూడా నిషేధిత ఉగ్రవాద సంస్థ హక్కానీకి చెందినవాడే. ఇక, రక్షణ మంత్రి ముల్లా యాకూబ్‌, విదేశాంగ మంత్రి ముల్లా ఆమీర్‌ఖాన్‌ ముత్తాకీ, షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ కూడా ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాద సంస్థ జాబితాలో ఉన్నవారే. మొత్తం 33 మంది సభ్యులున్న ఈ కేబినెట్‌లో.. ‘తాలిబాన్‌ ఫైవ్‌’గా ప్రసిద్ధి చెందిన ఐదుగురు తాలిబాన్లలో నలుగురు (ముల్లా మొహమ్మద్‌ ఫాజిల్‌, ఖైరుల్లా ఖైర్‌ఖ్వా, ముల్లా నూరుల్లా నూరి, ముల్లా అబ్దుల్‌ హక్‌ వాసిక్‌) ఉండడం గమనార్హం. ఈ ఐదుగురూ అమెరికాలోని సుప్రసిద్ధ జైలు ‘గ్వాంటనామో బే’లో శిక్ష అనుభవించినవారే. ఇక ఐదో ఉగ్రవాది మొహమ్మద్‌ నబీ ఒమరీని ఖోష్త్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌గా ఇటీవలే నియమించారు.


తాలిబాన్ల చేతికి చిక్కిన అమెరికా సైనికుడు బోవె బెర్గ్‌ద్‌హ్లను విడిపించుకోవడం కోసం.. ఈ ఐదుగురినీ ఒబామా హయాంలో 2014లో గ్వాంటనామో బే జైలు నుంచి విడుదల చేశారు. కాగా.. అఫ్ఘానిస్థాన్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతాపరమైన ప్రమాదాలను నివారించే అంశంపై భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోభాల్‌.. రష్యా జాతీయ భద్రత సలహాదారు జనరల్‌ నికొలాయ్‌ పత్రుషేవ్‌తో సమావేశమై చర్చించారు. అలాంటి ముప్పు ఏదైనా సంభవిస్తే ఇరు దేశాల సైనిక వ్యవస్థలూ కలిసికట్టుగా ఎదుర్కొనాలని ఈ భేటీలో నిర్ణయించారు. అక్రమ వలసలు, డ్రగ్‌ ట్రాఫికింగ్‌పైనా దృష్టి సారించాలని నిశ్చయించారు. ఇదే అంశంపై మంగళవారం దోభాల్‌ అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ చీఫ్‌ విలియమ్‌ బర్న్స్‌తో చర్చలు జరిపారు. జైషే మహ్మద్‌, లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు బలమైన పట్టున్న అప్ఘానిస్థాన్‌ తాలిబాన్ల వశం కావడంతో.. వారి నుంచి భారత్‌కు, రష్యాకు, మధ్య ఆసియా ప్రాంతానికి ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్ల గురించి ఈ భేటీల్లో చర్చిస్తున్నారు. దోభాల్‌తో భేటీ అనంతరం నికొలాయ్‌ పత్రుషేవ్‌ మన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి నడుమ కూడా అఫ్ఘానిస్థాన్‌ సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్టు జైశంకర్‌ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అనంతరం పత్రుషేవ్‌ ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఇక.. అప్ఘాన్‌లో ఏర్పాటైన ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ‘కొత్త సీసాలో పాత సారా’గా భారత మాజీ దౌత్యాధికారులు అభివర్ణిస్తున్నారు.ఈ కొత్త ప్రభుత్వంపై పాకిస్థాన్‌ ముద్ర స్పష్టంగా ఉందని.. అది భారత్‌క ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కొత్త సర్కారులో ఉగ్రవాదులు ఉన్నందున ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబించడమే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరిగే సమయంలో పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ చీఫ్‌ కాబూల్‌కు వెళ్లడం, అప్పుడు జరిగిన పరిణామాలు పాక్‌ జోక్యానికి స్పష్టమైన నిదర్శనాలని మాజీ దౌత్యాధికారి మీరా శంకర్‌ ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు.. అఫ్ఘానిస్థాన్‌లో మూడువారాలపాటు కొనసాగిన అరాచకానికి తెరపడి అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని స్వాగతిస్తున్నట్టు చైనా ప్రకటించింది. అంతేకాదు.. ఆ ప్రభుత్వాన్ని గుర్తించి 31 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.228 కోట్లు) ఆర్థిక సాయం ప్రకటించింది.ఇక.. అఫ్ఘానిస్థాన్‌లో ఏర్పాటైన తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) డైరెక్టర్‌జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ స్పందించారు. ప్రభుత్వాలను గుర్తించడం ఐక్యరాజ్యసమితి పని కాదని.. అది యూఎన్‌ సభ్యదేశాల పని అని స్పష్టం చేశారు. అప్ఘానిస్థాన్‌లో అంతర్జాతీయ ఉగవ్రాద ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయసమాజం కలిసికట్టుగా కృషి చేయాలని గుటెర్రెస్‌ పిలుపునిచ్చారు. మరోవైపు.. అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నా, అది కొత్త వాస్తవమని, అఫ్ఘాన్‌ విషయంలో ప్రపంచదేశాలు పాత కళ్లజోళ్లను వదిలేయాల్సిన.. వాస్తవిక ధోరణితో ముందుకు సాగాల్సిన అవసరం ఉం దని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ అభిప్రాయపడ్డారు. అఫ్ఘాన్‌లో పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 


పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీలకు విలువ లేదు

‘‘ఈ రోజుల్లో పీహెచ్‌డీ డిగ్రీకి, మాస్టర్స్‌ డిగ్రీలకు ఎలాంటి విలువా లేదు. అధికారంలో ఉన్న తాలిబాన్లు, ముల్లాలకు ఎలాంటి పీహెచ్‌డీలు, ఎమ్మేలు లేవు. ఆ మాటకొస్తే హైస్కూల్‌ పట్టా కూడా లేదు. కానీ, వారంతా చాలా గొప్పవారు’’

..అఫ్ఘానిస్థాన్‌లో కొత్తగా ఏర్పాటైన తాలిబాన్ల ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన షేక్‌ మౌల్వి నూరుల్లా మునీర్‌ వ్యాఖ్యలివి. ఉన్నత విద్యాశాఖ మంత్రి అయి ఉండీ ఉన్నత విద్యను తీసిపారేసినట్టుగా మునీర్‌ చేసిన ఈ కామెంట్లపై ప్రపంచం నలుమూలల నుంచీ విమర్శల వర్షం కురుస్తోంది.