యూజీసీ నిబంధనలు ప్రభుత్వ విద్యాసంస్థలకేనా!

ABN , First Publish Date - 2021-07-23T09:38:57+05:30 IST

దేశంలోని ఉన్నత విద్యాసంస్థలలో విద్యాప్రమాణాలను పెంపొందించడం కోసం యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులు కావాలంటే...

యూజీసీ నిబంధనలు ప్రభుత్వ విద్యాసంస్థలకేనా!

దేశంలోని ఉన్నత విద్యాసంస్థలలో విద్యాప్రమాణాలను పెంపొందించడం కోసం యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులు కావాలంటే పిహెచ్‌డి తప్పనిసరిగా ఉండాలని, డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీతో పాటు నెట్, సెట్, పిహెచ్‌డిలలో ఏదో ఒకటి ఉండాలని యుజిసి నిబంధన విధించింది.


తెలుగు రాష్ట్రాలలో ఒక యూనివర్సిటీలో ఒక్కో విభాగంలో కనిష్టంగా 40 గరిష్టంగా 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉండరు. అదే, యూనివర్సిటీకి అనుబంధంగా వందల సంఖ్యలో ఉన్న డిగ్రీ ప్రైవేట్ విద్యాసంస్థలలో ఒక్కో విభాగంలో సెక్షన్ల పేరిట సుమారు 200 మందిపైనే విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఈ సంఖ్య కేవలం ఒక తరగతికి సంబంధించింది మాత్రమే. మొత్తం కళాశాలలో విద్యార్థుల సంఖ్య సుమారు 700 నుంచి 800 వరకు ఉంటుంది. ఆ కళాశాలలో బోధించే అధ్యాపకులకు పిజి పట్టా తప్ప నెట్, సెట్, పిహెచ్‌డి వంటి మరే అర్హత ఉండకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వ కళాశాల అధ్యాపకునికి యుజిసి అర్హతలు తప్పనిసరి అయినప్పుడు, ప్రైవేట్ విద్యాసంస్థలలోని అధ్యాపకుల నియామకంలో కూడా ఆ నిబంధనలను అమలు చేయకపోవడంతో ఆ సంస్థలు వ్యాపారకేంద్రాలుగా మారాయి.


ఇక యూనివర్సిటీ స్థాయి విద్యను అందించే ప్రైవేట్ పిజి కళాశాలల పరిస్థితి మరింత దిగజారింది. బిటెక్, ఎం టెక్, ఎంబీఏ, లాంటి కోర్సులను భోదించే అధ్యాపకులకు యుజిసి విధించిన అర్హతలు ఏ ఒక్కటి ఉండకపోవడం గమనార్హం. ఆ అధ్యాపకులను తక్కువ వేతనం ఇచ్చి, అడ్మిషన్ లకోసం ఉపయోగించి ఆ తరువాత టీచింగ్‌ చేయించి విద్యాసంవత్సరం ముగిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ ఫ్యాకల్టీని రీసెర్చ్ వైపు ప్రోత్సహించకపోవడం, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు పంపకపోవడం వల్ల అధ్యాపకులు కేవలం పుస్తక బోధనకే పరిమితమవుతున్నారు. దీని పర్యవసానాలను విద్యార్థులు పై చదువులకు వెళ్ళినప్పుడు, ఉన్నతమైన ఉపాధి అవకాశాలలో తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.


విద్యావ్యవస్థ ఇలా తయారవటానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి, రాజకీయ ప్రభావం, ప్రైవేట్ సంస్థల పనితీరును నియంత్రించే వ్యవస్థ లేకపోవడమేనని చెప్పవచ్చు. తమ పరిధిలోని ప్రైవేట్ అనుబంధ విద్యాసంస్థలలో అర్హులైన సిబ్బందినే యాజమాన్యాలు నియమించేలా ఆయా యూనివర్సిటీల వీసీలు చర్యలు చేపట్టాలి.

డాక్టర్ ఎం డి ఖ్వాజా మొయినొద్దీన్, కరీంనగర్

Updated Date - 2021-07-23T09:38:57+05:30 IST