నూతన విద్యా విధానంపై విస్తృత అవగాహన కల్పించండి : యూజీసీ

ABN , First Publish Date - 2020-08-06T23:45:39+05:30 IST

నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) గురించి అందరికీ అవగాహన కల్పించాలని

నూతన విద్యా విధానంపై విస్తృత అవగాహన కల్పించండి : యూజీసీ

న్యూఢిల్లీ : నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) గురించి అందరికీ అవగాహన కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించింది. దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు జారీ చేసిన ఆదేశాల్లో ఎన్ఈపీపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, ఇతరులకు అవగాహన కల్పించాలని తెలిపింది. 


విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ (వీసీ)లకు యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ పంపిన లేఖలో ఎన్ఈపీపై అందరికీ అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, ఉన్నత విద్యతో సంబంధంగల ఇతరులకు ఈ నూతన విద్యా విధానం గురించి తెలియజేయాలని తెలిపారు. ఈ విధానంలోని ముఖ్యాంశాలను, వివిధ వర్గాలపై వాటి ప్రభావం గురించి తెలియజేసే ఆన్‌లైన్ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు యూజీసీ నిర్వహించే  పోర్టల్‌లో తెలియజేయాలని పేర్కొన్నారు. 


1986నాటి విద్యా విధానానికి బదులుగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. భారత దేశం విజ్ఞాన రంగంలో ప్రపంచంలో అజేయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో దీనిని రూపొందించారు. పాఠశాల, ఉన్నత విద్యా రంగంలో పరివర్తనకు దోహదపడే సంస్కరణలను ప్రతిపాదించారు. 


అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఎంపిక, డిగ్రీ కోర్సుల్లో మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్, ఉన్నత విద్యా సంస్థల్లో 3.5 కోట్ల సీట్లకు ఏకైక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు, ఎంఫిల్ ప్రోగ్రాముల రద్దు, ఫీజుల నిర్ణయం వంటి సంస్కరణలను ప్రతిపాదించారు. 


Updated Date - 2020-08-06T23:45:39+05:30 IST