ఆరోగ్యామృతం

ABN , First Publish Date - 2021-04-12T16:49:15+05:30 IST

తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు- మొత్తం ఆరు రుచుల కలయిక ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచిచెడులకు, కష్టసుఖా లకు, జయాపజయాలకు అది ప్రతీక. ఇవన్నీ కలిసినదే జీవితం. దాన్ని యథాతథంగా తీసుకోవాలని చెప్పడమే ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం.

ఆరోగ్యామృతం

తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు- మొత్తం ఆరు రుచుల కలయిక ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచిచెడులకు, కష్టసుఖా లకు, జయాపజయాలకు అది ప్రతీక. ఇవన్నీ కలిసినదే జీవితం. దాన్ని యథాతథంగా తీసుకోవాలని చెప్పడమే ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం.


ఉగాది పచ్చడిని మన శాస్త్రాల్లో  ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోక కళికా ప్రాశనం’ అని పేర్కొంటారు. రుతువుల మార్పు కారణంగా కలిగే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఈ ఉగాది పచ్చడిని పూర్వకాలం సేవించేవారు. 


‘‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం, మమ శోకం సదా కురు’’ అనే శ్లోకం చదువుతూ ఈ పచ్చడిని తింటే సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్యమూ రాదని శాస్త్రాలు పేర్కొన్నాయి. పూర్వకాలం ఈ వేపపువ్వు పచ్చడిని చైత్రశుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ సేవించేవారు. ఈ పచ్చడిలో మన పూర్వీకులు- వేప లేత చిగుళ్లు, ఇంగువ, బెల్లం, సైంధవ లవణం కలిపి నూరేవారు. ఆ తర్వాత చింతపండు, తాటిబెల్లం లేదా పటిక బెల్లం, వాము, జీలకర్ర, పసుపు కూడా వేసి మెత్తగా నూరేవారు. ఈ మిశ్రమాన్ని పరగడుపున అరతులం వంతున తొమ్మిది లేదా పదిహేను రోజులు తింటే ఎలాంటి అనారోగ్యమూ రాదని విశ్వసించేవారు. ఇప్పుడు ఈ పచ్చడిలో లేతమామిడి చిగుళ్లు, అశోక చిగుళ్లు వాడటం మానేశారు. ఇక ఆయుర్వేదంలో కూడా ఈ పచ్చడిలో ఉపయోగించే పదార్థాల విశిష్టత గురించి ఎన్నో విషయాలు పేర్కొన్నారు. అవి..


బెల్లం (మధురం):  బెల్లం మనసును ఆహ్లాద పరుస్తుంది. మినరల్స్‌, విటమిన్స్‌, పొటాషియం విరివిగా లభిస్తాయి.  దీనిలో ఉండే ఐరన్‌ రక్తహీనత రాకుండా కాపాడుతుంది. దగ్గు, అజీర్ణం, అలర్జీ, మలబద్ధకం, మైగ్రేన్‌, కామెర్లు వంటి అనారోగ్యాలను నివారిస్తుంది.


చింతపండు (పులుపు): కొత్త చింతపండు జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. మంచి విరేచనకారి. జీర్ణాశయంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. 


లవణం (ఉప్పు): మంచి రుచిని కలిగిస్తుంది. హైపోనెట్రోనియా రాకుండా నివారిస్తుంది.


వాము (కారం) : దీనిలో ఫైబర్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగ్‌సలకు ఇది విరుగుడు. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది. విరేచనాలను కట్టడి చేయడానికి, ఎముకలు, కీళ్ల నొప్పుల నివారిణిగా పని చేస్తుంది.


వేప పువ్వు (చేదు):  పొట్టలో ఉండే క్రిములను నాశనం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడి అనేక రకాల చర్మ వ్యాధులను నివారిస్తుంది. దీన్ని పొడిగా చేసి వాడితే చర్మంపై పుండ్లు, గాయాలు మానుతాయి. మధుమేహానికి మంచి ఔషధం. 


మామిడి పిందెలు (వగరు):  లేత మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల పేగుల్లోని మలినాల్ని బయటకు పంపుతుంది. రక్త విరేచనాలను అరికడుతుంది. సన్నగా ఉన్నవారు పాలల్లో గానీ, బెల్లంతో గానీ లేతమామిడిని తింటే లావు అవుతారు.


పచ్చడి తయారీ

కావలసినవి: వేప పువ్వు - ఒక టేబుల్‌ స్పూన్‌, చింతపండు గుజ్జు - రెండు టేబుల్‌ స్పూన్లు, బెల్లం తురుము - ఒక కప్పు, పచ్చి మామిడి ముక్కలు (సన్నగా తరిగి) - ఒక కప్పు, శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూన్‌ (ఇష్టమైతే), తాజా కొబ్బరి తురుము - ఒక టేబుల్‌ స్పూన్‌, అరటిపండు (సన్న ముక్కలుగా తరిగి) - సగం, ఉప్పు - చిటికెడు, పచ్చిమిర్చి (సన్నగా తరిగి) - ఒకటి. 


తయారీ: చింతపండుని రాత్రంతా నానపెడితే గుజ్జు బాగా వస్తుంది. లేదా వేడి నీళ్లలో కొంచెంసేపు నానపెట్టి గుజ్జు తీయొచ్చు. చింతపండు గుజ్జు, బెల్లం తురుము, మామిడి ముక్కలు, అరటి పండు ముక్కలు, కొబ్బరి తురుము, వేపపువ్వు, శెనగపప్పు, ఉప్పు, కారం లేదా పచ్చిమిర్చిలను ఒక గిన్నెలో వేసి కలపాలి. పుల్లగా అనిపిస్తే కొన్ని నీళ్లు కలపొచ్చు.

Updated Date - 2021-04-12T16:49:15+05:30 IST