ధర్మాన్ని ఆచరించాలి.. దైవాన్ని ఆశ్రయించాలి: సామవేదం

ABN , First Publish Date - 2021-04-12T21:42:39+05:30 IST

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

ధర్మాన్ని ఆచరించాలి.. దైవాన్ని ఆశ్రయించాలి: సామవేదం

సింగపూర్: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమంలో ఋషిపీఠం సంస్థాపకులు ప్రముఖ గ్రంథకర్త ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ పాల్గొన్నారు. అంతర్జాలంలో ఆయన నిర్వహించిన ప్రవచన కార్యక్రమం ఆదివారం సాయంత్రం అద్భుతంగా సాగింది. ‘ఉగాది విశిష్టత – ధర్మాచరణము’ అనే అంశంపై సమకాలీన పరిస్థితులకు ఉపయోగపడే విధంగా చక్కటి సమయోచితమైన ఉదాహరణలతో విపులంగా సామవేదం ప్రవచించి సింగపూర్ తెలుగు ప్రజలందరికీ ఆశీస్సులను అందజేశారు. 


ప్రవచనంలో భాగంగా సామవేదం మాట్లాడుతూ ‘‘రానున్న ప్లవ నామ సంవత్సరం శుభప్రదం అయ్యేందుకు రుద్రుని అనుగ్రహం అవసరమని తెలిపి పంచాంగ ప్రాధాన్యాన్ని గురించి వర్ణించారు. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుసరించడమేనని, మన వేద విజ్ఞాన విలువలను పరిరక్షించుకుని భావితరాలకు అందివ్వాలని, జీవితంలో బంధాల విలువ తెలుసుకుని సుఖ దుఃఖ సమన్వయం చేసుకుంటూ ధర్మాచరణ గావించాలని ఉపదేశించారు. యాంత్రికంగా ఉగాదికి శుభాకాంక్షల మెసేజ్ లు చేసుకోవడం కన్నా.. హృదయపూర్వకంగా ప్రపంచ శాంతిని సౌభాగ్యాన్ని భగవంతుడు ఒసగాలని కోరుకుంటూ శుభాన్ని ఆకాంక్షించాలని తెలియజేశారు. రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నా, ‘ధర్మాన్ని ఆచరించాలి. దైవాన్ని ఆశ్రయించాలి’ ఈ రెండింటి వలన ఎటువంటి కష్టాలనైనా అధిగమించవచ్చు’’ అని తెలియజేశారు. 


‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, లలిత దంపతులు జ్యోతి ప్రజ్వలనం చేయగా విద్యాధరి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో శివ భక్తితత్వాన్ని భక్తి జ్ఞాన మార్గాలను చక్కటి తెలుగు సాహిత్యంతో మేళవించి సామవేదం రచించిన గేయ సంపుటి 'శివపదం' నుంచి కొన్ని కీర్తనలు ఎంపిక చేసుకుని సింగపూర్ గాయనీ గాయకులు సౌభాగ్యలక్ష్మి, శైలజ, పద్మావతి, రాధిక, ఆనంత్, షర్మిల, విద్యాధరి భక్తితో ఆలపించారు. 


చామిరాజు రామాంజనేయులు వ్యాఖ్యానం ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాస్కర్ ఊలపల్లి, రాధికా మంగిపూడి, సుబ్బలక్ష్మి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


‘కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ఎటువంటి  విపత్కర పరిస్థితులు ఎదురవ్వనున్నాయోనని అందరూ భయపడుతున్న సమయంలో ‘ప్లవ’ నామ సంవత్సరానికి శుభప్రదమైన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంతో స్వాగతం పలకడం, ఈవిధంగా గురువు ఆశీస్సులను పొందడం తమ అదృష్టంగా భావిస్తున్నామని సంస్థ సభ్యులు, ఈ కార్యక్రమానికి హాజరైన సింగపూర్ తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించగా, ఈ రెమిట్ (శ్రీహరి శిఖాకొల్లు), గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈజీఏ జూస్ వారు ఆర్ధిక సమన్వయం అందించారు.



Updated Date - 2021-04-12T21:42:39+05:30 IST