కాణిపాకంలో వైభవంగా ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2021-04-14T06:49:35+05:30 IST

కాణిపాక వరసిద్ధి ఆలయంలో ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు.

కాణిపాకంలో వైభవంగా ఉగాది వేడుకలు
పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ఈవో వెంటేశు

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 13: కాణిపాక వరసిద్ధి ఆలయంలో ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు. ఈవో వెంకటేశు వరసిద్ధుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అలకార మండపం వద్ద సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఉదయం 10.30నుంచి 11.30 గంటల వరకు గణేష్‌స్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేశారు. అర్చకులు, వేదపండితులకు ఎమ్మెల్యే, ఈవో వస్త్రాలు అందజేశారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. రాత్రి సిద్ధి, బుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ కార్యక్రమాలకు అడపగుండ్లపల్లెకు చెందిన దివంగత మహదేవ నాయుడు కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-14T06:49:35+05:30 IST