నేడు అప్పన్న ఆలయంలో ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2021-04-13T06:09:44+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో మంగళవారం ప్లవ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు అప్పన్న ఆలయంలో ఉగాది వేడుకలు

సింహాచలం, ఏప్రిల్‌ 12: వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో మంగళవారం ప్లవ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం పంచాంగకర్త శ్రీనివాసశర్మ రచించిన పంచాంగ ఆవిష్కరణ, అనంతరం పంచాంగ శ్రవణం సాయంత్రం నాలుగు గంటలకు ఆస్థాన మండపంలో జరుగనున్నట్టు అధికారులు తెలిపారు. ఉగాది సందర్భంగా వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు, బాలభోగ నివేదనలు ముగిశాక స్వామివారికి ఉగాది పచ్చడిని నివేదించి, మంగళశాసనాలు జరిపాక భక్తులకు ఉగాది పచ్చడిని అందజేస్తారు. ఈనెల 23న జరగనున్న స్వామివారి కళ్యాణోత్సవానికి సంబంధించి సాయంత్రం నాలుగున్నరకు పందిరి రాట ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత పండిత సత్కారాలు, దాతలకు విశిష్ట సేవా పురస్కారాలను అందజేస్తారు. అనంతరం స్వామివారి తిరువీధి ఉత్సవం జరుపుతారు. ఏటా మాదిరిగానే ఉగాది సాయంత్రం ఆదిత్యుని కిరణాలు అంతరాలయంలో స్వామివారిని చేరుకునే అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2021-04-13T06:09:44+05:30 IST