ఉగాదికి.. సిద్ధం

ABN , First Publish Date - 2021-04-13T05:46:46+05:30 IST

తెలుగువారి పండుగ.. ఉగాది. మంగళవారం జరిగే పండుగకు సోమవారం మధ్యాహ్నం నుంచి సందడి కనిపించింది. ప్లవ నామ సంవత్సరాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలుగు లోగిళ్లు సిద్ధమయ్యాయి.

ఉగాదికి.. సిద్ధం
ఉగాది సందర్భంగా కొనుగోళ్ల సందడి

ప్లవ నామ సంవత్సరాదికి భారీగా ఏర్పాట్లు

మార్కెట్లో తెలుగు సంవత్సరాది కొనుగోళ్ల సందడి

పూజా సామగ్రి ధరలకు రెక్కలు


గుంటూరు, ఏప్రిల్‌ 12: తెలుగువారి పండుగ.. ఉగాది. మంగళవారం జరిగే పండుగకు సోమవారం మధ్యాహ్నం నుంచి సందడి కనిపించింది. ప్లవ నామ సంవత్సరాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలుగు లోగిళ్లు సిద్ధమయ్యాయి. భక్తుల సందర్శనార్థం, పూజలకు, పంచాంగ శ్రవణానికి పలు ఆలయాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో కూడా పంచాంగ శ్రవణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక ఉగాది పర్వదినం సందర్భంగా అవసరమైన పూజాసామగ్రి కొనుగోళ్లకు ప్రజలు సోమవారం దుకాణాల బాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా దుకాణాల వద్ద కొనుగోళ్ల సందడి కనిపించింది. ఇదే అదునుగా పూలు, టెంకాయ, పండ్లు, ఇతర పూజా సామగ్రి ధరలను రెట్టింపు చేశారు. పండుగకు ప్రత్యేకంగా నివేదించే మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. పూల ధరలైతే సాధారణం కంటే రెండింతలు చేసి విక్రయించారు. పండుగ కోసం కొబ్బరికాయలు, పండ్లుతో పాటు ప్రత్యేకం గా వేపపూత, మామిడి ఆకులు సైతం పెద్ద ఎత్తున విక్రయించారు. వేప పూత చిన్న కట్ట గుంటూరు మార్కెట్‌ సెంటర్‌లో రూ.20లకు విక్రయించారు.   పూజా సామగ్రితో పాటు పూల కొనుగోళ్లతో గుంటూరు లోని బ్రాడీపేట, కొరిటపాడు, లక్ష్మీపురం, బృందావన్‌గార్డెన్స్‌, లాలాపేట, పూలమార్కెట్‌, కూరగాయల మార్కెట్‌ సెంటర్‌లలో కోలాహల వాతావరణం నెలకొంది. స్వీట్‌ దుకాణాల నిర్వాహకులు ఉగాది రుచులను సిద్ధం చేసి పలు  ఆఫర్లను ప్రకటించారు. 



  

Updated Date - 2021-04-13T05:46:46+05:30 IST