ఉద్యమ హోరు

ABN , First Publish Date - 2022-01-21T04:35:04+05:30 IST

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సంఘాల నేతలు పెద్ద ఎత్తున నెల్లూరులోని కలెక్టరేట్‌ను ముట్టడించారు.

ఉద్యమ హోరు
నెల్లూరు : గాంధీబొమ్మ కూడలిలో రోడ్డుపై బైఠాయించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

‘ఫ్యాప్టో’ పిలుపుతో కదిలిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

కలెక్టరేట్‌ ముట్టడికి విఫలయత్నం

ఉద్యమకారులను అడ్డుకున్న పోలీసులు

గాంధీబొమ్మ కూడలిలో బైఠాయింపు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహజ్వాల

దిగిరాకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు


రివర్స్‌ పీఆర్సీపై భగ్గుమన్న ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఫెడరేషన ఆఫ్‌ ఆంధ్రప్రదేశ టీచర్స్‌ ఆర్గనైజేషన్స (ఫాప్టో) పిలుపుమేరకు గురువారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పలు సంఘాల నాయకులతోపాటు పెన్షనర్లు  వేలాదిగా నెల్లూరుకు తరలిరావడంతో కలెక్టరేట్‌ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం విడుదల చేసిన అసంబద్ధ జీవోలను రద్దు చేయాలని, హెచఆర్‌ఏ స్లాబ్‌లను యథాతధంగా కొనసాగించాలని, ఫిట్‌మెంట్‌ పెంచాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు కలెక్టరేట్‌కు వెళ్లే రహదారులన్నీ మూసి వేసి బారీకేడ్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, ఫాప్టో నేతల  మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరగడంతోపాటు ఒక దశలో తోపులాట కూడా చోటుచేసుకుంది చివరకు పోలీసులను నెట్టుకుంటూ కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్దకు నేతలు, ఉద్యోగులు చేరుకున్నారు. పోలీసులు మరింతగా మోహరించి గేట్లకు తాళాలు వేసి అడ్డుగా నిలబడటంతో ఉద్యోగులు గేటు బయటే బైఠాయించారు.  అక్కడ నుంచి ప్రదర్శనగా గాంధీబొమ్మ కూడలి వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.


నెల్లూరు (విద్య), జనవరి 20 : రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సంఘాల నేతలు పెద్ద ఎత్తున నెల్లూరులోని కలెక్టరేట్‌ను ముట్టడించారు. దాదాపు 5వేల మందికిపైగా తరలి రావడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఆర్సీ జీవోలను చూపిస్తూ రగలిపోయారు. ఈ ఆందోళనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లతోపాటు పలు ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. అసంతృప్తితో రగిలిపోతున్న తాము ఉద్యమహోరుతో ప్రభుత్వానికి సెగ పుట్టిస్తామని హెచ్చరించారు. వేలాదిమంది జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ముట్టడిపై పోలీసులు నిఘా వేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం వ్యూహాత్మకంగా నాలుగు అంచెల్లో కదిలి కదం తొక్కారు. 


గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో


కలెక్టరేట్‌ లోపలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఫాప్టో నేతలు వెంటనే ఉద్యోగులతో కలిసి గాంధీబొమ్మ కూడలి వద్దకు చేరుకున్నారు. నాలుగు రోడ్లకు ఇరువైపులా వాహనాలు వెళ్లనీయకుండా అడ్డుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌ సైతం పెద్ద ఎత్తున స్తంభించిపోయింది. దాదాపు గంటకుపైగా ఆందోళన సాగిన అనంతరం ట్రాఫిక్‌ను పునురుద్ధరించారు. తమకు న్యాయం జరగకుంటే ఆందోళన ఇలానే ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


పీఆర్సీతో ఉద్యోగులకు అన్యాయం


రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు ద్వారా ఉద్యోగులు జీతాలు పెంచాల్సిందిపోయి కోతపెట్టడం దారుణమని ఫాప్టో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట, గాంధీబొమ్మ సెంటర్లలో ఆందోళన అనంతరం నేతలు మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మధ్యంతర భృతి 27 శాతం ఇస్తే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అంతకన్నా తక్కువగా 23శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సింది పోయి కోతపెట్టేవిధంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హెచఆర్‌ఏలో కోత విధిస్తూ జీఓ ఇవ్వడంతో  వేతనాలు తగ్గిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ సిఫార్సులను కాకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీని నియమించి ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న పీఆర్సీకి బదులు పదేళ్లకు ఒకసారి ఇచ్చే కేంద్ర పీఆర్సీని అమలు చేస్తాననడం దుర్మార్గమన్నారు. 2023 జులై నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్‌సీని రద్దు చేయడం, పాత హెచఆర్‌ఏ రేట్లకు భిన్నంగా తక్కువ స్లాబులను ముందుకు తేవడం ఏమిటని ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దు చేయకపోవడం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఐఆర్‌ 27శాతం కంటే ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఇవ్వాలన్నారు. పాత హెచఆర్‌ఏ స్లాబులను కొనసాగించడంతో పాటు రాష్ట్ర పే కమిషన యథాతధంగా అమలు చేయాలన్నారు. పెన్షనర్స్‌కి ప్రస్తుతం క్యాంటమ్‌ పెన్షనను యథాతధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫాప్టో చైర్మన ఆర్‌.మురళీధర్‌, సహాయ కార్యదర్శి చిట్టేటి రమేష్‌, కో చైర్మన్లు వీవీ.శేషులు, టి.శ్రీనివాసులు, సీహెచ.హజరత, ఎ.సురేంద్రరెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ కె.మధుసూదనరావు, మాజీ చైర్మన పి.బాబురెడ్డి, కె.వెంకటేశ్వరరావు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్‌ సంఘాలు హాజరయ్యాయి. కాగా,  కలెక్టరేట్‌ ఎదుట ఫాప్టో చేపట్టిన ఆందోళనలో జేఏసీల తరపున మద్దతు తెలిపి ట్రెజరీ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. 


ఎక్కడకక్కడ కట్టడి!


నెల్లూరుకు రాకుండా పోలీసుల ఆంక్షలు

ఉద్యోగ, ఉపాధ్యాయుల అరెస్ట్‌


నెల్లూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : పీఆర్సీ కోసం  ఉపాధ్యాయ, ఉద్యోగులు నెల్లూరులో తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడిని  భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. బస్సుల్లో, వివిధ రకాల వాహనాల్లో వస్తున్న ఉపాధ్యాయులను అడ్డుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఇంకొన్ని చోట్ల ముందస్తు అరెస్టులూ జరిగాయి. ఉదయగిరి మండల పరిధిలో ఉపాధ్యాయులను ముందస్తు అరెస్టు చేశారు. చేజర్ల మండలం పరిధిలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ఉపాధ్యాయుల కోసం గాలించారు. నాయుడుపేట, గూడూరు రెవెన్యూ డివిజన్లకు చెందిన ఉపాధ్యాయులను నెల్లూరుకు చేరనివ్వకుండా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై వాహనాలు ఆపి తనిఖీలు చేశారు. కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో సూళ్లూరుపేట టోల్‌ గేట్‌ వద్ద ఉపాధ్యాయులు జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మర్రిపాడు వద్ద ఆర్టీసీ బస్సుల్లో నెల్లూరుకు వస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషనకు తరలించారు. అనంతసాగరంలో టీచర్లు పోలీసు స్టేషన ఎదుటే నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఎ్‌సపేట పోలీసు స్టేషనలోనే అరెస్టు అయిన టీచర్లు రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరికుంటపాడు, కొండాపురం, కోట, బుచ్చిరెడ్డిపాళెం తదితర మండలాల్లో దారికాసి ఉపాధ్యాయులను అరెస్టులు చేశారు. 


భగ్గు భగ్గు!


రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహజ్వాల


మా ఆవేదనను పట్టించుకోరే!


పీఆర్సీ పేరుతో చర్చలకు పిలిచి సంఘాలను మాట్లాడనీయకుండా ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనదారుల  సంఘాల ఆవేదనను పరిగణలోకి తీసుకోలేదు. అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న భేదం లేకుండా  8 శాతం హెచఆర్‌ఏ అమలు చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. నాలుగు డీఏలను జనవరి 2022 లోగా చెల్లిస్తామని బకాయిలను చెల్లించకుండా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ వేతన సంఘ పరిధిలోకి తీసుకువెళ్లడం తగదు. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని  నిలబెట్టుకోలేకపోయారు. తాత్కాలిక భృతిని వెనక్కు తీసుకున్నందు వల్ల ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష నష్టం వాటిల్లుతోంది.

-  ముక్కు చంద్రమౌళి, ఉపాధ్యాయ నాయకుడు, కోవూరు



నేతి బీరకాయలో నెయ్యిలా..


నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో ఈ పీఆర్సీలో వేతనాలు పెరగడం కూడా అంతే నిజం. ఐఆర్‌ 27 శాతం ఉండగా ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇవ్వడం గత పది పే రివిజన్లలో ఎన్నడూ జరగలేదు. కనీసం ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గకూడదు. పదేళ్ల ముందు నిర్ణయించిన ఇంటి అద్దె శ్లాబులను తగ్గించడం అన్యాయం. పాత శ్లాబులను కొనసాగించాలి. అదనపు పెన్షన సౌకర్యాన్ని ఎత్తివేయడం దుర్మార్గం. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నెలబెట్టుకోవాలి. పదేళ్లకోసారి పే రివిజన చేస్తామనే దుర్మార్గమైన ఆలోచనను విరమించుకుని పాత పద్ధతినే కొనసాగించాలి. 

- ఎస్‌.చిరంజీవి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, గూడూరు


ఈ చీకటి జీవోను రద్దు చేయాలి  


ఈ చీకటి జీవోతో ప్రభుత్వ ఉద్యోగులైన మాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. అశుతోష్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి, సీఎస్‌ కమిటీ ఇచ్చిన పీఆర్సీని అమలు చేయడం దారుణం. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు లేదు. ఐఆర్‌ 27 శాతం ఇచ్చి ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇవ్వడమేమిటి? గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఫిట్‌మెంట్‌ 30 శాతం, హెచఆర్‌ఏ యథాతధంగా ఉండేలా మళ్లీ పీఆర్సీని ప్రకటించాలి. అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోం. 

- బి.వెంకటేశ్వర్లు, ఫ్యాప్టో ప్రాంతీయ కన్వీనర్‌, పొదలకూరు



ఆ నివేదికను బహిర్గతం చేయాలి


ప్రభుత్వం అశుతో్‌షమిశ్రా కమిషన నివేదికను బహిర్గతం చేయాలి. ఫిట్‌మెంట్‌ను కార్యదర్శుల కమిటీ పేరుతో ప్రకటించడం సరికాదు. దేశంలో ఎక్కడాలేని విధంగా రివర్స్‌ పీఆర్సీ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీతాల్లో కోత విధించడం దారుణం. పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

  - షేక్‌ దస్తగిరి అహ్మద్‌, పెన్షనర్ల సంఘ నాయకుడు, ఉదయగిరి



జీతాలు తగ్గించేందుకే అర్ధరాత్రి నిర్ణయాలు


ఉద్యోగుల జీతాలు తగ్గించేందుకే రాష్ట్రప్రభుత్వం అర్ధరాత్రి చీకటి జీవోను విడుదల చేసింది. పీఆర్సీతో జీతాలు తగ్గడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా కాలయాపన చేసినప్పుడే ప్రభుత్వం ఉద్యగుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అనుమానం కలిగింది. రివర్స్‌ పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయో గ్యం కాదు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం నిరసనకు దిగితే పోలీసులు అరెస్ట్‌ చేయడం, అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం?. పీఆర్సీని రద్దుచేసే వరకు ఉద్యమం కొనసాగిస్తాం.

-ఎస్‌ శివకుమార్‌, ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన డివిజన అధ్యక్షుడు, కావలి


అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు 


ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉపాధ్యాయులను అరెస్టు చేయడం తగదు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. సమ్మెలోకి వెళ్లడానికి వెనుకాడం. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పడం ఉద్యోగులకు చేసిన అన్యాయాన్ని కప్పి పుచ్చుకునే చర్య. ఒకవైపు జీతాలు తగ్గవంటూనే న్యాయంగా రావాల్సిన ఐదు విడతల కరువుభత్యం బకాయిలు కలిపి చూపించడం దుర్మార్గం. 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించి పాత హెచఆర్‌ఏ స్లాబులు కొనసాగించే వరకు ఉద్యమాలు ఆపబోము.

- ఎ.సురేంద్రరెడ్డి, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, ఆత్మకూరు


ప్రభుత్వం మెడలు వంచైనా... 


రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా మా న్యాయమైన హక్కులను సాధించుకుంటాం.  మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఐఆర్‌ 27శాతం ఇచ్చి ఫిట్‌మెంట్‌ 23శాతం ఇవ్వడం ఏమిటి. పీఆర్‌సీ చరిత్రలో ఐఆర్‌కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా. 12, 20, 30 శాతం ఉన్న హెచఆర్‌ఏ 8, 16 శాతానికి తగ్గించడం దుర్మార్గం కాదా. దీనివల్ల ప్రతి ఉపాధ్యాయుడు 4వేల నుంచి 10వేల వరకు జీతం నష్టపోతాడు. మాకు 27 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. హెచఆర్‌ఏ స్లాబ్‌లు యథాతధంగా ఉండాలి. గతంలో మాదిరి ఐదేళ్లకోసారి పీఆర్‌సీ ఇవ్వాలి. ఉద్యోగ వివమణచేసిన పింఛన దారులకు 70 ఏళ్లకు ఇచ్చే క్వాంటమ్‌  ఫింఛన రద్దుచేయకూడదు. మా ఈ న్యాయమైన హక్కులను సాధించుకునేవరకు పోరాటం ఆగదు. 

- జీజే రాజశేఖర్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట







Updated Date - 2022-01-21T04:35:04+05:30 IST