Shiv Sena tiff: ఒకే వేదికపై షిండే, సీజేఐ... మండిపడ్డ శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ...

ABN , First Publish Date - 2022-09-11T21:29:25+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ యూయూ లలిత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

Shiv Sena tiff: ఒకే వేదికపై షిండే, సీజేఐ... మండిపడ్డ శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ...

న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ యూయూ లలిత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఒకే వేదికను పంచుకోవడంపై ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో ఏదీ నిబంధనల ప్రకారం జరగడం లేదని పెదవి విరిచింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించింది. 


శివసేన పార్టీ తమదేనంటూ ఏక్‌నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌కు మహారాష్ట్రలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. 


కిరణ్ రిజిజు ఇచ్చిన ట్వీట్‌లో, ముంబైలో జస్టిస్ యూయూ లలిత్ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ గవాయ్, జస్టిస్ అభయ్ ఓకా, బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, తదితర న్యాయమూర్తులు హాజరయ్యారని తెలిపారు. 


ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అధికార ప్రతినిధి అరవింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజుల్లో చట్టం, నిబంధనల ప్రకారం ఏదీ జరగడం లేదన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తాము ఆరోపించడానికి ఇదే కారణమని చెప్పారు. 


ఎన్‌సీపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాట్లాడుతూ, ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వ చట్టబద్ధత గురించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయంలో సీజేఐ జస్టిస్ లలిత్‌తో కలిసి వేదికను పంచుకోవడం షిండేకు తగదని చెప్పారు. 


కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఇచ్చిన ట్వీట్‌లో, షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వ చట్టబద్ధత గురించి సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రమే కాకుండా, దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిపై సైతం అనర్హత వేటు వేసే అవకాశం ఉన్న సమయంలో, ఈ వేదిక పొంతన లేకుండా కనిపిస్తోందని తెలిపారు. 


ఈ ఏడాది జూన్‌లో శివసేనలో అత్యధిక ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. 



Updated Date - 2022-09-11T21:29:25+05:30 IST