రాజీనామాకు సిద్ధం: CM ఉద్ధవ్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-06-23T00:20:02+05:30 IST

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఎట్టకేలకు స్పందించారు. పరిస్థితులు అదుపు చేయలేని స్థితిలో ఉండడంతో తమ పార్టీలోని ఎమ్మెల్యేలు కోరితే ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు..

రాజీనామాకు సిద్ధం: CM ఉద్ధవ్ సంచలన ప్రకటన

ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఎట్టకేలకు స్పందించారు. పరిస్థితులు అదుపు చేయలేని స్థితిలో ఉండడంతో తమ పార్టీలోని ఎమ్మెల్యేలు కోరితే ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు. మరో అడుగు ముందుకు వేసి అవసరమైతే పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. మంగళవారం నుంచి కొనాసాగుతున్న ఈ ఉత్కంఠపై బుధవారం సాయంత్రం తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో లైవ్ ద్వారా స్పందిస్తూ.. ముఖ్యమంత్రి పదవి వస్తుంది, పోతుందని కానీ ప్రజల ఆధారాభిమానాలు, వారితో ఉండే ఆప్యాయత ఎప్పటికీ ఉంటుందని అన్నారు.


‘‘ఎంత మంది అనేది సమస్య కాదు. ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క కార్యకర్త నాకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసినా నాకు అవమానమే. ఒకవేళ ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి పదవికి, అవసరమైతే పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా రాజీనామా చేస్తాను. ముఖ్యమంత్రి పదవి వస్తుంది, పోతుంది. కానీ ప్రజలతో ఉండే అనుబంధం, ఆప్యాయత ఎప్పటికీ ఉంటుంది. అదృష్టవశాత్తూ గడిచిన రెండేళ్లలో ప్రజల నుంచి ఎంతో ప్రేమాభిమానాల్ని పొందాను’’ అని ఉద్ధవ్ థాకరే అన్నారు. అయితే తన పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ తనను పదవి వదిలేయమని కోరలేదని, తనకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఏదీ చేయలేదని ఉద్ధవ్ చెప్పుకొచ్చారు. సూరత్‌ ఏం జరుగుతుందో తనకు తెలియదని, ఏదైనా ఉంటే తనతో ముఖాముఖీగా చర్చించాలని, ముఖం ముందే చెప్పాలని శివసేన ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ సూచించారు.


ఇక రాష్ట్రంలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏర్పాటు ఉద్ధవ్ స్పందిస్తూ తనకు ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నానని, అందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఎంతగానో సహకరించారని అన్నారు. ‘‘2019లో మూడు పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతల్ని నన్ను తీసుకొమ్మని శరద్ పవార్ కోరారు. కానీ నాకు ఎలాంటి అనుభవం లేదు. అయినా ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తీసుకున్నాను. శరద్ పవార్, సోనియా గాంధీ నాకు చాలా సహాయం చేశారు. నాపై నమ్మకాన్ని ఉంచారు’’ అని ఉద్ధవ్ అన్నారు.


శివసేన హిందుత్వంపై వస్తున్న విమర్శలపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘కొంత మంది శివసేనపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్నది బాలాసాహేబ్ శివసేన కాదంటున్నారు. బాలాసాహేబ్ ఆలోచనా విధానం ఏంటో వారు తెలుసుకోవాలి. హిందుత్వ అనేది మా జీవితం. బాలాసాహేబ్ అనుసరించిన హిందుత్వను శివసేన ఎప్పటికీ అనుసరిస్తుంది’’ అని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లడం లేదనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తనకు సర్జరీ అయిన కారణంగా కొద్ది నెలలుగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లలేకపోయానని, కానీ ఇప్పుడు మీటింగ్‌ల ద్వారా ప్రజల వద్దకు వెళ్తానని ఉద్ధవ్ అన్నారు.

Updated Date - 2022-06-23T00:20:02+05:30 IST